TS POLLING: జనగామ, ఇబ్రహీంపట్నం, బోధన్ లో ఉద్రిక్తత

తెలంగాణలో అక్కడక్కడా చిన్న చిన్న ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. జనగామ, ఇబ్రహీంపట్నం, బోధన్ లో బీఆర్ఎస్ - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 30, 2023 | 10:18 AMLast Updated on: Nov 30, 2023 | 10:18 AM

Ts Polling Starts

తెలంగాణలో ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 2 వేల 290 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.  3 కోట్ల 26 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 35 వేల 655 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసంది.  రాష్ట్రంలో పురుష ఓటర్ల కన్నా మహిళలే ఎక్కువగా ఉన్నారు.  దాదాపు 68 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను మహిళలే నిర్ణయించే అవకాశముంది.  పోలింగ్ బందోబస్తులో 75 వేల మంది పోలీస్ బలగాలను వినియోగిస్తున్నారు.  రాష్ట్రంలోని 40 వేల మందితో పాటు… సరిహద్దు రాష్ట్రాల నుంచి మరో 15 వేల మందిని, 375 కంపీల కేంద్ర సాయుధ బలగాలు బందోబస్తులో ఉన్నాయి.

సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది.  రాష్ట్రంలో 13 సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ మొదలైంది.  దాంతో పోలింగ్ అధికారులపై ఓటర్లు మండిపడ్డారు. కొన్ని చోట్ల ఈవీఎంలో మార్పులు చేస్తున్నారు అధికారులు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఉదయం నుంచే బారులు తీరారు జనం.

జనగామ, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తత తలెత్తింది.  జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రావు, ఇతర నాయకులు గులాబీ కండువాలు వేసుకొని పోలింగ్ బూత్ లోకి వచ్చారు.  దీనిపై కాంగ్రెస్ లీడర్లు అభ్యంతరం తెలిపారు.  దాంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. జనగామలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ 245 పోలింగ్ కేంద్రం దగ్గర ఈ ఘర్షణ జరిగింది. కొద్దిసేటి తర్వాత పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు. జనగామ రైల్వే స్టేషన్ దగ్గర పోలింగ్ బూత్ లోనూ గొడవ జరిగింది.  పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్కువ సేపు బూత్ లో ఉండటంపై కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు.  దాంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.  ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని ఖానాపూర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.   లాఠీ ఛార్జ్ చేసి పోలీసులు వారిని చెదరగొట్టారు.  బోధన్ లోని విజయమేరి పోలింగ్ స్టేషన్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.  పోలీసులు రెండు వర్గాలను అక్కడి నుంచి పంపేశారు.