TTD Board: టీటీడీపై పట్టుకోసం కరికాల ప్రయత్నం.. జగన్‌పై ఒత్తిడి.. కొత్త బోర్డా..? స్పెసిఫైడ్ అథారిటీనా..?
టీటీడీ కొత్త బోర్డును నియమించాలా.. లేక స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేయాలా.. అనే విషయంలో జగన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మరోవైపు బోర్డు ఏర్పాటు చేయకుండా, స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేయాలని, దానికి తనను ఛైర్మన్‌ను చేయాలని సీనియర్ ఐఏఎస్ అధికారి కరికాల వలవన్ కోరుతున్నారు.
TTD Board: ప్రస్తుతం ఉన్న టీటీడీ బోర్డు పదవి ఈ నెల 7తో ముగుస్తుంది. దీంతో టీటీడీకి కొత్త అధ్యక్షుడు, బోర్డు మెంబర్ల నియామకం సీఎం జగన్‌కు పెద్ద సవాలుగా మారింది. టీటీడీ కొత్త బోర్డును నియమించాలా.. లేక స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేయాలా.. అనే విషయంలో జగన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో జగన్‌కు అన్నివైపుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. బోర్డ్ చైర్మన్ పదవి కోసం విపరీతమైన పోటీ ఉంది.
మరోవైపు బోర్డు ఏర్పాటు చేయకుండా, స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేయాలని, దానికి తనను ఛైర్మన్‌ను చేయాలని సీనియర్ ఐఏఎస్ అధికారి కరికాల వలవన్ కోరుతున్నారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న కరికాల.. టీటీడీ బోర్డ్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. అయితే, ఆయన అంతటితో సంతృప్తి పడటం లేదు. టీటీడీకి బోర్డు కాకుండా.. స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటయ్యేలా చేసి, దానికి ఛైర్మన్ కావాలని భావిస్తున్నారు. ఎందుకంటే.. ఆయన తిరుపుతి లోక్‌సభ నియోజకవర్గంపై కన్నేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. అదే తనకు అథారిటీ ఛైర్మన్ పదవి ఇస్తే, టీటీడీతోపాటు తిరుపతిలోనూ పట్టు సాధించవచ్చని, దీనిద్వారా స్థానికుల్లో సానుకూలత వస్తుందని, అది తన రాజకీయ భవిష్యత్తులకు ఉపయోగపడుతుందని కరికాల ఆశిస్తున్నారు. కరికాల కొద్ది రోజుల క్రితమే రిటైర్ అయ్యారు.
దీనికి నాలుగు రోజుల ముందే ఆయనను దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనను అదే హోదాలో కొనసాగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏడాదిపాటు ఈ పదవిలో ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్ పదవిని ఆశిస్తూ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకోసం సీఎం జగన్‌పై వివిధ వర్గాల నుంచి ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. ఒక దశలో జగన్ దీనికి సానుకూలంగానే స్పందించారు. పైగా కరికాల ఎస్సీ సామాజిక వర్గం. ఆయనకు ఈ పదవి ఇస్తే రాజకీయంగా కూడా ప్రయోజనం ఉంటుందని భావించారు. కానీ, వైసీపీలోని ఒక వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఎన్నికల సమయంలో తొందరపడొద్దని, దీనివల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని జగన్‌కు సూచించారు. దీంతో జగన్ కరికాల విషయంలో పునరాలోచనలో పడ్డారు.
ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నేతల సూచనతో వెనక్కు తగ్గారు. పోనీ టీటీడీ బోర్డు ఏర్పాటు చేద్దామన్నా.. దీనికీ విపరీతమైన పోటీ ఉంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితోపాటు, పలువురు టీటీడీ ఛైర్మన్ పదవి ఆశిస్తున్నారు. దీంతో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక జగన్ సతమతమవుతున్నారు. ప్రస్తుతానికి ఈ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది.