శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేసారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. తిరుమల అన్నమయ్య భవన్ లో సోమవారం టిటిడి ఈవో, టిటిడి అదనపు ఈవోలతో కలసి టిటిడి ఛైర్మెన్ మీడియాతో మాట్లాడారు. పాలకమండలి తీసుకునే నిర్ణయాలను అమలు చేయడంలో కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతుండవచ్చనేమో కాని, ఆలస్యం అవుతోందని తొందరపడి అసత్య ప్రచారం చేయవద్దని మీడియాను కోరారు. తిరుమల విషయంలో ఒకటికి రెండు సార్లు పరిశీలించి, సంబంధిత వ్యక్తుల నుంచి వాస్తవ సమాచారాన్ని తెలుసుకుని వార్తలు రాయాలని కోరారు. ఒకరిద్దరు మీడియా, సోషల్ మీడియాలో టిటిడి ఛైర్మెన్ కు, ఈవో శ్రీ శ్యామల రావుకు మనస్పర్థలు ఉన్నాయంటూ వార్తలు రాయడం సరికాదని అభిప్రాయపడ్డారు. వైకుంఠ ఏకాదశికి శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించామని తెలిపారు. విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలు, క్యూలైన్లు, శ్రీవారి దర్శనం, అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలలో మరింత నాణ్యతగా అందించామన్నారు చైర్మన్. తిరుపతిలో జరిగిన తోపులాట సంఘటన జరగడం సీఎంను, తమను, దేశాన్ని, ప్రపంచాన్ని భాధించిందని ఈ సంఘటనలో మృతి చెందిన కుటుంబాలకు , తీవ్రంగా గాయపడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 31 మందికి పరిహారం అందించామని, మరో 20 మందికి రెండు మూడు రోజుల్లో పరిహారం అందిస్తామని తెలిపారు. చిన్న పొరపాట్లు చేయకుండా చాలా ముందు జాగ్రత్తతో సేవలు అందిస్తున్నామని స్పష్టం చేసారు. ఇక సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయవద్దని ఈవో జె. శ్యామల రావు కోరారు.