Bhumana Karunakar Reddy: టీటీడీ ఛైర్మన్‌గిరి రాజకీయ పదవా..? రాజకీయ కోణంలో ఎంపిక సరైందేనా..?
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఆమాటకొస్తే దేశంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి. అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకోవడంతోపాటు, అధిక ఆదాయం కలిగిన దేవాలయం కూడా ఇదే. ఇలాంటి బోర్డుకు ఛైర్మన్ పదవిని నియమించాలంటే అనేక అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలి
Bhumana Karunakar Reddy: టీటీడీ నూతన ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమిస్తూ ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న భూమనకు రెండోసారి ఈ పదవి దక్కింది. భూమనకు ఈ పదవిని రాజకీయ కోణంలోనే జగన్ కట్టబెట్టారన్నది నిర్వివాదాంశం. అయితే, పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ పదవిని రాజకీయ కోణంలో నియమించడం సరైందేనా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఆమాటకొస్తే దేశంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి. అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకోవడంతోపాటు, అధిక ఆదాయం కలిగిన దేవాలయం కూడా ఇదే. ఇలాంటి బోర్డుకు ఛైర్మన్ పదవిని నియమించాలంటే అనేక అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. హిందూత్వ అంశం, భక్తి కోణంలోనే కాకుండా.. రాజకీయాలకు దూరంగా ఉండే వాళ్లకు అవకాశం ఇస్తే బాగుంటుంది అన్నది పలువురి వాదన. అప్పుడే ఈ దేవాలయం పవిత్రతను కాపాడగలుగుతారు. వీఐపీల నుంచి సామాన్యుల వరకు న్యాయం జరుగుతుంది. కానీ, అత్యధికసార్లు రాజకీయపరమైన కోణంలోనే ఛైర్మన్ పదవికి అభ్యర్థిని నియమిస్తున్నారు.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఈ పదవిలో ఒక వ్యక్తిని నియమించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి.. సామాజికంగా, రాజకీయంగా ఎంతవరకు ఉపయోగపడతారు అని ఆలోచించి అభ్యర్థిని ఎంపిక చేస్తున్నారు. పూర్తి రాజకీయ దృక్పథం కలిగిన వారి వల్ల టీటీడీ ఎన్నో వివాదాల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. అనేకసార్లు టీటీడీ నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. టిక్కెట్ల ధరల పెంపు, సేవల టిక్కెట్ల కేటాయింపు, ప్రసాదాల నాణ్యత, సౌకర్యాల కల్పన, కొత్త నిర్మాణాల్లో అవకతవకలు, సిబ్బంది నియామకం, అన్యమత ప్రచారం వంటి అనేక అంశాల్లో బోర్డుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో కొత్తగా ఛైర్మన్‌ను ఎంపిక చేసేటప్పుడు వీటన్నింటి విషయంలో న్యాయం చేయగల వ్యక్తిని నియమిస్తే బాగుండేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ, సీఎం జగన్ మాత్రం తన సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు, పలు ఒత్తిళ్లకు తలొగ్గి భూమనకు పదవి ఇచ్చినట్లు ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
భూమనకు సంబంధించి కొన్ని వివాదాలున్నాయి. గతంలో తిరుమల ఏడు కొండలు కాదు.. ఐదు కొండలే అన్నది భూమనే అని టీడీపీ నేతలంటున్నారు. అలాగే స్వామి వారిపై కూడా అనుచితంగా మాట్లాడారని విమర్విస్తున్నారు. అలాంటిది ఇన్ని ఆరోపణలున్న భూమనకు టీటీడీ పదవి ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పదవికి రాజకీయ నాయకుడిని కాకుండా.. వీటికి దూరంగా ఉంటూ అందరికీ న్యాయం చేయగలిగి, దేవాలయ పవిత్రతను కాపాడగలిగే వ్యక్తులనే ఎంపిక చేయాలని పలువురు సూచిస్తున్నారు.