Udhayanidhi Stalin: ఉదయనిధి వ్యాఖ్యలతో ఇండియా కూటమికి నష్టమా..?

ఉదయనిధి వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ మాటలదాడికి దిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షానే నేరుగా ఈ విషయంలో ఇండియా కూటమిపై విమర్శలు చేశారు. స్టాలిన్ వ్యాఖ్యల ద్వారా ఇండియా కూటమి హిందూ వ్యతిరేకి అని స్పష్టమవుతోందన్నారు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 3, 2023 | 08:59 PMLast Updated on: Sep 03, 2023 | 8:59 PM

Udhayanidhi Stalins Controversial Remark On Sanatan Dharma Will Ruin India Bloc

Udhayanidhi Stalin: సనాతన ధర్మం విషయంలో తమిళనాడు డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాల ఇండియా కూటమికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉదయనిధి వ్యాఖ్యలతో ఆయన పార్టీ ఉన్న ఇండియా కూటమిని కూడా హిందూ వ్యతిరేక కూటమిగా బీజేపీ పక్షాలు చిత్రీకరిస్తున్నాయి. దీంతో హిందూత్వవాదుల నుంచి ఇండియా కూటమిపై వ్యతిరేకత కనిపించవచ్చు.
ఉదయనిధి వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ మాటలదాడికి దిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షానే నేరుగా ఈ విషయంలో ఇండియా కూటమిపై విమర్శలు చేశారు. స్టాలిన్ వ్యాఖ్యల ద్వారా ఇండియా కూటమి హిందూ వ్యతిరేకి అని స్పష్టమవుతోందన్నారు. రాజస్థాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. అటు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా కూడా ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించారు. ఇండియా కూటమిపై విమర్శల కోసం చూస్తున్న బీజేపీకి ఆయన వ్యాఖ్యల ద్వారా ఒక అస్త్రం దొరికినట్లైంది. రాబోయే ఎన్నికల్లో హిందూత్వ అంశం కూడా కీలకమే. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల ప్రభావం ఇండియా కూటమిపై ఉంటుంది. దీనిపై ఇండియా కూటమి తమ వైఖరి చెప్పాల్సి ఉంటుంది.

ఇండియా కూటమి అనగానే హిందూ వ్యతిరేక కూటమి అనే ముద్ర మొదటి నుంచి ఉంది. దీనికి స్టాలిన్ వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చాయి. అయితే, ఈ అంశంలో కాంగ్రెస్ మాత్రం స్టాలిన్‌కు అనుకూలంగా స్పందించింది. కూటమిలోని మిగతా పార్టీలు ఎలాంటి వైఖరి తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. కొంతకాలం జాతీయ రాజకీయాల్లో స్టాలిన్ వ్యాఖ్యల రచ్చ కొనసాగుతుంది. ఇప్పటికే స్టాలిన్‌కు వ్యతిరేకంగా కేసులు కూడా నమోదయ్యాయి. అయితే, ఈ అంశం కూటమికి ఏ మేరకు నష్టం కలిగిస్తుందో.. లాభం కలిగిస్తుందో చూడాలి.