Undavalli Sridevi: సీట్ల వేటలో ఉండవల్లి శ్రీదేవి..! చంద్రబాబుకోసం శ్రీకాకుళం పయనం!!
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి ఆశించిన ఆమెకు జగన్ మొండిచేయి చూపారు. పైగా తన నియోజకవర్గానికి మరొకరిని ఇన్‌ఛార్జ్‌గా నియమించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు.
Undavalli Sridevi: వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేసి సంచలనం సృష్టించారు. అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పటి వరకూ ఆమె ఏ పార్టీలో చేరతారనేదానిపై క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఆమె టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. తనకు టికెట్ కేటాయించాలంటూ ఆమె టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఉండవల్లి ఏకంగా శ్రీకాకుళం వెళ్లి మరీ చంద్రబాబును కలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి ఆశించిన ఆమెకు జగన్ మొండిచేయి చూపారు. పైగా తన నియోజకవర్గానికి మరొకరిని ఇన్‌ఛార్జ్‌గా నియమించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు. సమయం కోసం ఎదురు చూసిన శ్రీదేవి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి కాకుండా టీడీపీ క్యాండిడేట్‌కు ఓటేశారు. దీంతో వైసీపీ అభ్యర్థి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆమె అధికార పార్టీకి పూర్తిగా దూరమయ్యారు. టీడీపీ అభ్యర్థికి ఓటేసినా ఇప్పటివరకూ ఆమె చంద్రబాబును కలవలేదు. దీంతో ఆమె వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారనేది ఉత్కంఠగా మారింది. కానీ ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి దంపతులు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు.
తమకు ఎమ్మెల్యే లేదా ఎంపీ సీట్లలో ఏదో ఒక దానిని ఇవ్వాలని ఆమె కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన తనకు చంద్రబాబు కచ్చితంగా టికెట్ ఇస్తారనే నమ్మకంతో ఉన్నారు శ్రీదేవి. ఒకవేళ ఎస్సీ కోటాలో తనకు ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు ఇస్తే.. రాష్ట్రమంతా తిరిగి పార్టీకోసం ప్రచారం చేస్తానని ఆమె చెప్తున్నారు. ఎస్సీలకు రిజర్వ్ అయిన తిరుపతి ఎంపీ సీటు ఇవ్వాలని శ్రీదేవి ఆశిస్తున్నారు. తనకు ఇవ్వడానికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే కాపు కులస్థుడైన తన భర్త డాక్టర్ కమ్మెల శ్రీధర్ కైనా సీటివ్వాలని ఉండవల్లి శ్రీదేవి కోరుతున్నారు. ఇన్నాళ్లూ ఎడమొహం పెడమొహంగా ఉన్న శ్రీదేవి దంపతులు.. ఇప్పుడు సీటు కోసం ఏకమైనట్టు అర్థమవుతోంది.