Uniform Civil Code: మళ్లీ తెరపైకి ఉమ్మడి పౌరస్మృతి… బీజేపీ 2024 అస్త్రం ఇదేనా ?

2024 లోక్‌సభ స్థానాల్లో 300లకు పైగా సీట్లను గెలుచుకుంటామని చెబుతున్న బీజేపీ... ఉమ్మడిపౌరస్మృతిపై చట్టం చేసేందుకు రెడీ అవుతుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అస్త్రాన్ని మరోసారి ప్రయోగించి.. భారీగా ఓటు బ్యాంకు పెంచుకోవాలని చూస్తోంది. ఎన్నికల లోపే చట్టాన్ని తీసుకొచ్చి... ప్రజాక్షేత్రంలోకి వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 14, 2023 | 10:36 PMLast Updated on: Jun 14, 2023 | 10:36 PM

Uniform Civil Code Law Commission Seeks Views Of Public Recognized Religious Organizations Bjp Election Agenda

పార్లమెంట్ ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేకపోవడంతో భారతీయ జనతా పార్టీ తన అమ్ముల పొదిలో నుంచి మరో బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసింది. సుప్రీం కోర్టు ద్వారా బాబ్రీ మసీదు వివాదానికి ముగింపు పలికించి అయోధ్యలో శరవేగంగా రామాలయ నిర్మాణాన్ని చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం.. సరిగ్గా ఎన్నికల సమయంలో ఉమ్మడి పౌర స్మృతిని తెరపైకి తెచ్చింది. దశాబ్దాలుగా రాజకీయ పార్టీల మధ్య, సమాజంలోని వివిధ వర్గాల మధ్య చర్చనీయాంశంగా మారిన యూనిఫాం సివిల్ కోడ్‌ను ఎన్నికల అస్త్రంగా వాడుకునేందుకు కమలనాథులు వేగంగా పావులు కదుపుతున్నారు. 2019 ఎన్నికల్లోనే ఉమ్మడి పౌర స్మృతిని ఎన్నికల ఎజెండాలో పొందుపరిచిన బీజేపీ దానికి చట్టరూపం ఇచ్చేందుకు అడుగులు వేస్తోంది.

మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ

ఉమ్మడి పౌర స్మృతిపై దేశ ప్రజలు ఎలాంటి అభిప్రాయంలో ఉన్నారో తెలుసుకోవాలని లా కమిషన్ నిర్ణయించింది. ప్రజలతో పాటు మత సంస్థలు కూడా 30 రోజుల్లోపు తమ అభిప్రాయాలను తెలియజేయాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. వెబ్ సైట్ ద్వారా లేదా మెయిల్ పంపించడం ద్వారా ఎవరైనా సరే యూనిఫామ్ సివిల్ కోడ్ పై లా కమిషన్‌కు అభిప్రాయాలు చెప్పవచ్చు. భిన్న మతాలు, సంస్కృతుల సమ్మేళనంగా ఉన్న దేశంలో ఉమ్మడి పౌర స్మతిపై మొదటి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2016లోనే 21వ లాకమిషన్ దేశ ప్రజల అభిప్రాయాలను సేకరించింది. ఆ తర్వాత 2018లో కూడా మూడు సార్లు ప్రజల నుంచి సమాచారం సేకరించింది. ప్రజాభిప్రాయాలను ఒక దగ్గరకు చేర్చి కుటుంబ చట్టాల సంస్కరణ పేరుతో ఓ నివేదికను కూడా రూపొందించింది. అయితే కాలంతో పాటు అభిప్రాయాలు మారే అవకాశాలు ఉండటంతో నాలుగేళ్ల నాటి ప్రజల అభిప్రాయలను పరిగణలోకి తీసుకోకుండా మరోసారి ప్రజల సలహాలు, సూచనలు తెలుసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన 22వ లా కమిషన్ ప్రజలకు, మత సంస్థలకు అభిప్రాయాలు చెప్పేందుకు 30 రోజుల గడువిచ్చింది

ఇంతకీ ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటి ?

రెండు ముక్కల్లో చెప్పాలంటే.. ఒకే దేశం…ఒకే చట్టం.. ఇదే ఉమ్మడి పౌర స్మృతి. కులాలు, మతాలతో సంబంధం లేకుండా దేశ ప్రజలందర్నీ ఒకే చట్ట పరిధిలోకి తీసుకురావడమే యూనిఫామ్ సివిల్ కోడ్. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత ఇలాంటి వ్యవహారాల్లో మతాల వారీగా ఇప్పటి వరకు అమలవుతున్న చట్టాలను రద్దు చేసి… దేశ ప్రజలందరికీ వర్తించేలా చట్టం తీసుకురావడమే ఉమ్మడి పౌర స్మృతి. వీటికి సంబంధించి ప్రస్తుతం దేశంలో మత ప్రాతిపదికన చట్టాలు అమలవుతున్నాయి. హిందూ వివాహ చట్టం, ముస్లిం పర్సనల్ లా, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఇలా అనేక చట్టాలు ఉన్నాయి. ఆయా మతాల్లో ఉన్న నిబంధనల ఆధారంగా వివాహం, విడాకులు, వారసత్వం, దత్తతపై నిర్ణయాలు ఉంటాయి. ఇలా మతాల వారీగా చట్టాలు ఉండటం వల్ల దేశ ప్రజలందరికీ సమన్యాయం అందడం లేదన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది. వాటికి సమాధానం చెప్పేదే ఉమ్మడి పౌర స్మృతి

ఉమ్మడి పౌరస్మృతి రాజ్యాంగ బద్దమేనా ?

బీజేపీ వంటి పార్టీలు దీన్ని రాజకీయ అంశంగా చూస్తున్నా… వాస్తవానికి ఉమ్మడి పౌర స్మృతి ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు కూడా కోరుకున్నారు. ఈ విషయాన్ని ఆర్టికల్ 44లో పొందుపరిచారు. కులమతాలకు అంతీతంగా భారత భూభాగ పరిధిలో ఉండే ప్రతి ఒక్కరికీ ఉమ్మడి పౌరస్మృతి ద్వారా న్యాయం చేయాలని ఆర్టికల్ 44 సూచిస్తోంది. సమాజంలో అన్యాయానికి, నిర్లక్ష్యానికి గురవుతున్న నిమ్నవర్గాలను దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ నిర్మాతలు ఈ దిశగా ఆలోచన చేశారు. అయితే అప్పటి కాలమాన పరిస్థితులను అంచనావేసిన నిపుణులు.. ప్రస్తుతానికి ఉమ్మడి పౌర స్మృతిని స్వచ్చంధం చేశారు. రాజ్యాంగ ముసాయిదాలో ఆర్టికల్ 35 ద్వారా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయడానికి దేశం మొత్తం సిద్ధంగా ఉన్నప్పుడు.. దాన్ని యావత్ దేశం ఆమోదించినట్టు.. ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. భారతదేశం భిన్న సమూహాల సమాజంగా ఉండటంతో మతపరమైన అంశాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు బ్రిటీష్ ప్రభుత్వం కూడా ఉమ్మడి పౌర స్మృతి ప్రతిపాదనను ఆమోదించింది. 1835లోనే దీనికి బీజాలు పడ్డాయి.

ఉమ్మడి పౌర స్మృతిని వ్యతిరేకించేది ఎవరు ?

ఒకే దేశం…ఒకే చట్టం కావాలని కోరుకున్న వాళ్లు ఉన్నట్టే… ఉమ్మడి పౌర స్మృతిని వ్యతిరేకించే వర్గాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకంగా అనేక వాదనలు ఉన్నాయి. అందులో ప్రధానమైంది.. యూనిఫామ్ సివిల్ కోడ్… రాజ్యాంగం ప్రసాదించిన మతస్వేచ్ఛను హరించేస్తుంది అన్నది. మతాచారాలను ఆచరిస్తూ వాటికి తగ్గట్టు జీవిన విధానాన్ని ఏర్పచుకునే అవకాశాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కల్పించింది. దీని ప్రకారం మతం నిర్దేశించిన విధంగా జీవించవచ్చు. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయడమంటే… మత స్వేచ్ఛకు భంగం కలిగించి హక్కులను కాలరాయడమే అన్నది ప్రధాన వాదన. అలాగే సివల్ చట్టాలు, క్రిమినల్ చట్టాలు ఒకే దేశం…ఒకే చట్టం అనే విధానాన్ని పాటించనప్పుడు.. కొన్ని వర్గాలు పాటించే పర్సనల్ లాస్ విషయంలోనే దీన్ని అమలు చేయాలనకోవడం కుట్రపూరితమన్నది ఇంకో ఆరోపణ. మరో ముఖ్యమైన విషయం పర్సనల్ లాస్ అన్నవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. పార్లమెంట్ తో పాటు రాష్ట్రాల అసెంబ్లీలు కూడా వీటిపై చట్టాలు చేయవచ్చు. ఈ నిబంధనకు వ్యతిరేకంగా కేంద్రం చట్టాన్ని తీసుకువస్తే అది ఆమోదయోగ్యం కాదన్న వాదన కూడా ఉంది. ఉమ్మడిపౌర స్మృతి ద్వారా మెజార్టీ హిందువులు ఫాలో అయ్యే విధానాలను ఇతర వర్గాలపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలు కూడా జరుగుతాయని దీనిని వ్యతిరేకించే వర్గాలు చెబుతున్నాయి.

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముస్లిం సమాజం

ఉమ్మడి పౌరస్మృతిని ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిని అమలులోకి తీసుకువస్తే సామాజిక అశాంతి రేగుతుందని దీన్ని ఎంతమాత్రం ఆమోదించబోమని తేల్చి చెబుతున్నారు. గతంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు.. లా కమిషన్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను తీవ్రంగా వ్యతిరేకించింది. ఒక మతానికి సంబంధించి అంశాలను నిర్ణయించుకునే అవకాశం, అధికారం ఆ మతానికి చెందిన వ్యక్తులకే ఇవ్వాలని… ఒకే దేశం ఒకే చట్టం పేరుతో ఇతరులు జోక్యం చేసుకోవడానికి రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని ముస్లింలు వాదిస్తున్నారు. వీళ్లతో పాటు అనేక మైనార్టీ వర్గాలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా తప్పుపడుతున్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలులోకి వస్తే భవిష్యత్తులో తమ అస్థిత్వమే ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి

బీజేపీ ఏం చేయబోతోంది ?

భిన్నాభిప్రాయాలు వ్యతిరేకత ఉన్నా… బీజేపీ ఉమ్మడి పౌరస్మృతికి కట్టుబడి ఉంది. లా కమిషన్ ద్వారా ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమైనా..అంతిమంగా పార్లమెంట్ లో చట్టం చేయల్సింది మెజార్టీ ప్రభుత్వమే. 2024 లోక్‌సభ స్థానాల్లో 300లకు పైగా సీట్లను గెలుచుకుంటామని చెబుతున్న బీజేపీ… ఉమ్మడిపౌరస్మృతిపై చట్టం చేసేందుకు రెడీ అవుతుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అస్త్రాన్ని మరోసారి ప్రయోగించి.. భారీగా ఓటు బ్యాంకు పెంచుకోవాలని చూస్తోంది. ఎన్నికల లోపే చట్టాన్ని తీసుకొచ్చి… ప్రజాక్షేత్రంలోకి వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు. లా కమిషన్ అభిప్రాయ సేకరణ కోరడంతో… ఉమ్మడిపౌరస్మృతిపై మళ్లీ దేశవ్యాప్తంగా కూలంకషంగా చర్చ జరగబోతోంది.