రేవంత్ ను మేమే సీఎం చేసినం, ఆర్కే గవర్నమెంట్ నడుస్తోంది: బండి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ కు క్యాడర్ లేదు అని... రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయ్యారంటే బీజేపీ కొట్లాడితే అయ్యారని... రేవంత్ రెడ్డి ఏ ఉద్యమం చేశారు.. ఎన్ని కేసులు ఉన్నాయని ప్రశ్నించారు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ కు క్యాడర్ లేదు అని… రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయ్యారంటే బీజేపీ కొట్లాడితే అయ్యారని… రేవంత్ రెడ్డి ఏ ఉద్యమం చేశారు.. ఎన్ని కేసులు ఉన్నాయని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారన్నారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కమలం వికసిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు. రేవంత్ రెడ్డి నిన్ను వదిలి పెట్టం అని వార్నింగ్ ఇచ్చారు. సంక్రాంతి రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ విధిస్తున్నామని… ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే మంత్రులను, కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటాం అని హెచ్చరించ్చారు.
హామీలు అమలు చేయకుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు కేంద్ర మంత్రి. సరూర్ నగర్ స్టేడియం వేదికగా కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ప్రకటించిందని 23వేల ఉద్యోగాలు ఇచ్చామని టిజీపీఎస్సీ ఛైర్మెన్ చెబుతుంటే.. రేవంత్ రెడ్డి 55వేల ఉద్యోగాలు భర్తీ చేశామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. బంగ్లాదేశ్ లో ఇచ్చారా ఉద్యోగాలు అని నిలదీశారు. గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ అవుతుందని 317జీవో పైన కొట్లాడిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పట్టించుకోవడం లేదని విమర్శించారు.
మజ్లీస్ మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేసారు బండి. భాగ్య నగరంలోని దేవాలయాల మీద జరిగిన దాడిని హిందూ సమాజం మరిచి పోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి కొమ్ముకాస్తుందని విమర్శించారు. భాగ్యనగర్ ను బంగ్లాదేశ్ గా మార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు. అర్బన్ నక్సల్స్ చేతిలో రేవంత్ రెడ్డి కీలు బొమ్మగా మారారని ఆయన మండిపడ్డారు. మంత్రివర్గంలో సగం మంది అర్బన్ నక్సల్స్ భావజాలం కల్గినవారే ఉన్నారన్నారు. విద్యా, రైతు కమిషన్ లల్లో అర్బన్ నక్సల్స్ ఉన్నారని యువతను అర్బన్ నక్సల్స్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అర్కే(రేవంత్ రెడ్డి, కేసీఆర్) ప్రభుత్వం నడుస్తుందన్నారు.