మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని బీజేపీ కూటమి, 2వందలకు పైగా సీట్లతో అధికారంలోకి మహయుతి

మహారాష్ట్రలో బీజేపీ అఖండ విజయం సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మెజార్టీ సీట్లు సాధించింది. బీజేపీ, శివసేన ఏక్‌నాథ్‌ షిండే వర్గం, అజిత్‌ పవార్‌ ఎన్సీపీ కలిసి పోటీ చేయడం...మహయుతికి కలిసి వచ్చిందా ?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 23, 2024 | 08:29 PMLast Updated on: Nov 23, 2024 | 8:29 PM

Unwavering Bjp Alliance In Maharashtra Assembly Elections Mahayuti Comes To Power With Over 200 Seats

మహారాష్ట్రలో బీజేపీ అఖండ విజయం సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మెజార్టీ సీట్లు సాధించింది. బీజేపీ, శివసేన ఏక్‌నాథ్‌ షిండే వర్గం, అజిత్‌ పవార్‌ ఎన్సీపీ కలిసి పోటీ చేయడం…మహయుతికి కలిసి వచ్చిందా ? మహావికాస్‌ అఘాడీ అంతర్గత కుమ్ములాటలు…కాషాయ కూటమికి అనుకూలంగా మారాయా ? బీజేపీ నాయకత్వం…రాష్ట్ర నాయకులకే ప్రచార బాధ్యతలు అప్పగించడం ప్లస్ అయిందా ? సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌ వల్లే…కాషాయ కూటమికి ఈ విజయం సాధ్యమైందా ?

మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయదుందుభి మోగించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మెజార్టీ సీట్లను సాధించి…రికార్డు సృష్టించింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను మించి…బీజేపీ కూటమికి 2వందలకుపైగా సీట్లను తన ఖాతాలో వేసుకుంది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో మహాయుతికి స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఈ ఏడాది జరిగిన లోక్​సభ ఎన్నికల్లో…మహారాష్ట్రలో ఎన్​డీఏ ఘోర పరాజయం పాలయింది. లోక్‌సభ ఫలితాల షాక్‌తో తేరుకున్న మహాయుతి, అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఎన్నికల ముందు సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఈ పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ప్రభుత్వం మారితే పథకాలు రద్దవుతాయని ప్రచారం చేసింది.

మహారాష్ట్రలో ప్రజలు స్థానిక సమస్యలకు ఎక్కువ ప్రధాన్యం ఇస్తారని తెలుసుకున్న వ్యూహకర్తలు…అందుకు అనుగుణంగా ప్రణాళికలు అమలు చేశారు. స్థానిక సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వడంతో… క్షేత్ర స్థాయిలో క్యాడర్​ను బలోపేతం అయింది. ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం…విభజన అంటే విధ్వంసమే జరుగుతుందంటూ…బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మూడు పార్టీలకు చెందిన ముగ్గురు ఎన్డీఏ విజయంలో కీలకపాత్ర పోషించారు. ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ షిండే…సంక్షేమ పథకాలు, అభివృద్ధి​పై దృష్టి పెట్టారు. డిప్యూటీ సీఎంలు అజిత్‌ పవార్‌, దేవేంద్ర ఫడ్నవీస్‌…రాజకీయ వ్యూహాలు అమలు చేశారు. సిద్ధాంతాల పరంగా భిన్న ధృవాలైన మహా వికాస్​ అఘాడీ మిత్రపక్షాలు…అంతర్గత విభేదాలతో అధికార పక్షాన్ని అనుకున్నంత మేర అడ్డుకోలేకపోయాయి.

హర్యానాలో అమలు చేసిన ఫార్మూలానే మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్లింది ఆర్‌ఎస్‌ఎస్. కాంగ్రెస్‌ వ్యతిరేకులు, హిందుత్వ ఎజెండా, లోకల్‌ సెంటిమెంట్‌ను సంఘ్‌ కార్యకర్తలు జనంలోకి బలంగా తీసుకెళ్లారు. ఇంటింటికి వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించారు. మరాఠా ఓటర్లను కాదని ఓబీసీ వర్గాలను ఏకం చేశారు. మాలి, ధంగర్, వంజరి కమ్యూనిటీలను బీజేపీ వైపు మళ్లించడంలో సంఘ్‌ కార్యకర్తలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీజేపీ కూటమి చరిత్రలో ఎన్నడూ లేని విజయాన్ని అందుకుంది. మహాయుతిలో ఓట్ల బదలాయింపు సజావుగా సాగినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు మహావికాస్‌ అఘాడీలో సీట్ల సర్దుబాటు వేళ తలెత్తిన విభేదాలు ఎన్నికలపై ప్రతికూల ప్రభావం చూపాయి. కాంగ్రెస్‌ నిర్ణయాలకు ఢిల్లీ అనుమతులుండాలంటూ సంజయ్‌ రౌత్‌ విమర్శించడం, దీనికి హస్తం నేత నానా పటౌలే స్పందన వంటివి ఇరు పార్టీల ఓటర్లను ఏకం కాకుండా చేశాయి. అఘాడీ కూటమిని నష్టపర్చాయి. అల్టిమేట్‌గా బీజేపీ కూటమికి…కలిసి వచ్చేలా చేశాయి.

లోక్​సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ వ్యూహం మార్చేసింది. స్థానిక సమస్యలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రాంతాల వారిగా పరిస్థితులను బట్టి వ్యూహాలు, ప్రణాళికల్లో మార్పులు చేసింది. ఆదివాసీలు ఎక్కువగా ఉండే చంద్రపుర్​ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఆదివాసీలు, దళితులు, ఓపీసీలపై ఉదారంగా వ్యవహరించడం వల్లనే ఆ వర్గాలు వెనుకబడ్డాయని తీవ్ర విమర్శలు చేశారు. సోయాబీన్, పత్తి అధికంగా పండే…విదర్భా ప్రాంతంలో సోయాబీన్ రైతలుకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను…అక్కడ జరిగే బహిరంగ సభల్లో లేవనెత్తారు. వాటికి పరిష్కారం తాము చూపుతామని ప్రచారంలో చేశారు. బీజేపీ అనుసరించిన వ్యూహాలు అనుకున్నట్లే…ఎన్నికల్లో సత్ఫలితాలు ఇచ్చాయి.

మహారాష్ట్ర ఎన్నికల్లో మరోసారి హిందూత్వ ఏజెండా పని చేసిందా ? మహాయుతి ఎత్తుల ముందు మహా వికాస్‌ ఆఘాడీ చిత్తయిందా ? హిందువుల ఓట్లన్ని…బీజేపీ కూటమికే పడ్డాయా ? కాంగ్రెస్‌ కూటమి చేసిన ప్రయత్నాలన్నీ…కాషాయ పార్టీ ఎత్తుల ముందు చిత్తయ్యాయా ? ముస్లింలకు వ్యతిరేకంగా వక్ఫ్‌ బోర్డు బిల్లును తీసుకురావడంతో…హిందుత్వ వాదులంతా ఏకమైపోయారా ? కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు హిందుత్వ శక్తులన్నీ కలిసి పని చేశాయా ? బీజేపీ ఎత్తుకున్న హిందుత్వ ఎజెండా…మరోసారి సక్సెస్‌ అయిందా ?
——–