పాకిస్తాన్‌ను ఏకాకిని చేసిన అమెరికా, ఆఫ్ఘాన్ తాలిబన్ల వేటకు లైన్ క్లియర్

బలూచిస్తాన్‌‌లో బీఎల్‌ఏ దాడులు, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో తాలిబన్ల అటాక్స్, ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ అస్థిరత.. ఇవన్నీ సరిపోవన్నట్టు మిత్ర దేశాలు ఇస్లామాబాద్‌ వైపు కనీసం కన్నెత్తిచూసే పరిస్థితీ లేదు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక దేశానికి ఇంతకంటే కష్టాలు ఉంటాయా అన్నట్టుంది పాకిస్తాన్ పరిస్థితి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 11, 2025 | 04:58 PMLast Updated on: Jan 11, 2025 | 4:58 PM

Us Afghan Taliban Who Isolated Pakistan Clear The Line For Hunt

బలూచిస్తాన్‌‌లో బీఎల్‌ఏ దాడులు, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో తాలిబన్ల అటాక్స్, ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ అస్థిరత.. ఇవన్నీ సరిపోవన్నట్టు మిత్ర దేశాలు ఇస్లామాబాద్‌ వైపు కనీసం కన్నెత్తిచూసే పరిస్థితీ లేదు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక దేశానికి ఇంతకంటే కష్టాలు ఉంటాయా అన్నట్టుంది పాకిస్తాన్ పరిస్థితి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఉగ్ర దేశానికి మరో బిగ్ షాక్ తగిలింది. టర్కీ, చైనా తర్వాత ఇప్పటివరకూ పాకిస్తాన్‌కు అండగా నిలిచిన అమెరికా ఇస్లామాబాద్ బెండు తీసే బిల్లు తెరపైకి తెచ్చింది. ఈ బిల్లు కనుక ఆచరణలోకి వస్తే పాక్ బతుకు కుక్కలు చింపిన విస్తరి కావడం ఖాయం. అంతేకాదు, పాక్‌పై ప్రతీకారంతో రగిలిపోతున్న ఆఫ్ఘాన్ తాలిబన్లకు ఈ బిల్లు కొండంత అండగా నిలుస్తుంది. ఇంతకూ, పాక్ పాలకుల తిక్క తుదర్చడానికి అమెరికా తెరపైకి తెచ్చిన ఆ బిల్లు ఏంటి? ఈ బిల్లు పాకిస్తాన్‌ను ఎలా పతనం చేస్తుంది? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..

నాటోయేతర పెద్ద మిత్రుడి హోదా.. పాకిస్తాన్‌కు అప్పుడెప్పుడో అగ్రరాజ్యం కల్పించిన హోదా ఇది. నాటోలో సభ్యత్వం లేని దేశాలతో అమెరికా సైనిక దళాలు పని చేస్తుంటే ఈ హోదాను ఇస్తుంటారు. ఈ హోదా దక్కిన దేశాలకు పలు రకాలైన సైనిక, ఆర్థిక సహాయాలను అమెరికా అందజేస్తుంది. అమెరికా 19 దేశాలకు ఈ హోదాను ఇచ్చింది. ఈ దేశాలతో కలిసి సమష్టిగా రక్షణరంగ ప్రాజెక్టులను చేపడుతుంది. కీలకమైన ఆయుధ వ్యవస్థలను వీటికి విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం, శిక్షణ వంటివి చేస్తుంది. ఈ హోదాను చూసుకునే భారత్‌పై పాకిస్తాన్ రెచ్చిపోయేది. అమెరికాకు భారత్ కంటే తామే పెద్ద మిత్రులం అనీ, యుద్ధం వస్తే భారత్‌ను ఓడిస్తామని గొప్పలుపోయేది. ఇప్పుడు ఆ హోదానే రద్దు చేయాలని రిపబ్లిక్ కాంగ్రెస్ సభ్యుడు అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఆమోదం దొరికితే పాక్ కథ క్లైమాక్స్‌కు చేరినట్టే. కానీ, ఇప్పుడే ఈ బిల్లును ఎందుకు తెరపైకి తెచ్చారు? ఈ ప్రశ్నకు ఆన్సర్ హక్కానీ నెట్‌వర్క్‌..!

హక్కానీ నెట్‌వర్క్ అనేది పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపుల్లో ఒకటి. దీనిని జలాలుద్దీన్‌ హక్కానీ స్థాపించాడు. అతను పష్తూన్‌కు చెందిన ఓ మాజీ ముజాహుద్దీన్‌ కమాండర్‌. సొవియట్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు అతనికి 1980ల్లో CIA శిక్షణ ఇచ్చింది. ఈ గ్రూప్‌లో పాక్‌లోని వజీరిస్థాన్‌ ప్రాంతంలోని జద్రాన్‌ అనే తెగవారు ఎక్కువగా ఉన్నారు. అత్యధికంగా 10 వేల మంది వరకు ఉగ్రవాదులు ఉన్నారు. 1996లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను చేజిక్కించుకున్నారు. అప్పుడు జలాలుద్దీన్‌ హక్కానీ సరిహద్దులు, ఆదివాసీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. తాలిబన్లలో తన పరపతి గణనీయంగా పెంచుకొన్నారు. 9/11 దాడుల తర్వాత అమెరికా ఆఫ్ఘాన్‌పై యుద్ధం ప్రకటించింది. ఆ సమయంలో హక్కానీ నెట్‌వర్క్‌ దళాలు నాటో దళాలపై దాడులు చేశాయి. బిన్‌ లాడెన్‌ను ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరలించడంలో హక్కానీ నెట్‌వర్క్‌ పాత్ర ఉంది. అమెరికా దాడుల నుంచి తప్పించుకోవడానికి హక్కానీ పాక్‌లోని నార్త్ వజీరిస్థాన్‌లో దాక్కొన్నట్లు అమెరికా అనుమానించింది.

అల్‌ఖైదా చీఫ్‌ బిన్‌ లాడెన్‌కు చెందిన కీలక వ్యక్తులతో కలిసి హక్కానీ పనిచేశాడు. ఈ విషయం పాకిస్తాన్‌లో బిన్ లాడెన్‌ను మట్టుబెట్టిన ఇంట్లో దొరికిన ఫైల్స్‌లో ఉంది. హక్కానీ నెట్‌వర్క్‌ను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్‌ సంస్థ ISI అనుబంధ సంస్థగానే విశ్లేషకులు చూస్తారు. హక్కానీ నెట్‌‌వర్క్‌ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్‌ స్వయంగా పాక్‌లో శరణు పొందాడు. 2012లో పాక్‌లోని వజీరిస్థాన్‌లో జరిగిన అమెరికా చేసిన డ్రోన్‌ దాడిలో జలాలుద్దీన్‌ కుమారుడు బద్రుద్దీన్‌ హక్కానీ మృతి చెందాడు. మరో కుమారుడు నసిరుద్దీన్‌ హక్కానీ కూడా పాక్‌లోని ఇస్లామాబాద్‌ వద్ద హత్యకు గురైయ్యాడు. ఇతను హక్కానీ నెట్‌వర్క్‌లో కీలకమైన వ్యక్తి. సౌదీ, యూఏఈ వంటి దేశాల నుంచి నిధులను సమకూర్చేవాడు. హక్కానీ నెట్‌‌వర్క్‌ ఛాన్స్ దొరికిన ప్రతిసారీ భారత్‌పై విషం కక్కుతుంది. 2008లో భారత్ దౌత్యకార్యాలయంపై దాడి ఈ గ్రూపు పనే. ఈ ఘటనలో 58 మంది మరణించారు. హెరాత్‌లో జరిగిన ఆత్మాహుతి దాడి కూడా హక్కానీల పనే. హక్కానీ నెట్‌వర్క్‌కు ఐసిస్‌-కె ఉగ్రసంస్థకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేలింది.

పాకిస్తాన్‌కు నాటోయేతర పెద్ద మిత్రుడి ఇవ్వడం వెనుక అసలు కారణం ఉగ్రవాదంపై ఆ దేశం పోరాడుతుందన్న నమ్మకం. ఆ పోరాటం కోసం ఆర్ధిక, ఆయుధ, సైనిక శిక్షణ వంటి సాయం అమెరికా చేస్తూ వచ్చింది. కానీ, తనపై అమెరికా పెట్టుకున్న నమ్మకాన్ని పాక్‌ నిలబెట్టుకోలేదు. హక్కానీ నెట్‌వర్క్‌కు తానే మద్దతుగా నిలిచింది. పైకి ఉగ్రవాదంపై పోరాడుతున్నాం అని చెబుతూనే ఆ ఉగ్రముఠాలకు మన దేశంపైకి ఉసిగొల్పింది. భారత్ వీలు చిక్కిన ప్రతిసారీ ఇదే నిజాన్ని అమెరికాకు చెప్పింది. చివరకు పాక్ అసలు రంగు తెలుసుకున్న అమెరికా హక్కానీ నెట్‌వర్క్‌పై యాక్షన్ తీసుకుంటేనే నాటోయేతర పెద్ద మిత్రుడి హోదా ఉంటుందని సంచలన బిల్లు చట్టసభల ముందుకు తెచ్చింది. నిజానికి.. అగ్రరాజ్యం పాకిస్తాన్‌కు ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చింది. 2019 నుంచీ అమెరికా ప్రతినిధుల సభ ముందుకు ఈ బిల్లు వస్తూనే ఉంది. అయితే, ఇప్పటివరకు ఆచరణలోకి రాలేదు. అందుకు కారణం పాకిస్తాన్‌కు ఓ ఛాన్స్
ఇవ్వాలన్న ఆలోచనే. కానీ, ఇప్పుడు మరో ఛాన్స్ ఇచ్చేందుకు అమెరికా సిద్ధంగా లేదు. కాబట్టి పాకిస్తాన్‌కు నాటోయేతర పెద్ద మిత్రుడి హోదా గల్లంతవ్వడం ఖాయం. అదే జరిగితే ఎవరి నుంచీ మద్దతులేని పాక్‌ని ఆఫ్ఘాన్ తాలిబన్లు దారుణంగా వేటాడమూ ఖాయమే.