భర్తతో అమెరికా వెళ్లాలనుకుంటే.! బాత్రూం కిటికీలు ఎన్నో చెప్పాల్సిందే జీవిత భాగస్వాములకు వీసా కష్టాలు
తమ జీవిత భాగస్వామితో కలిసి ఉండాలని ఎంతో మంది కలలు కంటారు. అందులోనూ అమెరికాలో తమ భర్త లేదా భార్యతో సమయం గడపాలని ఎవరైనా అనుకుంటారు.

తమ జీవిత భాగస్వామితో కలిసి ఉండాలని ఎంతో మంది కలలు కంటారు. అందులోనూ అమెరికాలో తమ భర్త లేదా భార్యతో సమయం గడపాలని ఎవరైనా అనుకుంటారు. అయితే అమెరికాలో ఉంటున్న జీవిత భాగస్వామి వద్దకు వెళ్లడం అంటే ప్రస్తుతం పరిస్థితుల్లో మాములు విషయం కాదు. ఎన్నో పరీక్షలను దాటుకుంటేనే వీసాలు వస్తాయి. వీసాలు రావడం కూడా అంత ఈజీ కాదని చెబుతున్నారు. అమెరికా పౌరులు, గ్రీన్ కార్డుదారులను వివాహం చేసుకుని అమెరికా వెళ్లాలనుకునే వారికి కఠిన సవాళ్లు మొదలయ్యాయి. అక్రమ వలసలపై ఫోకస్ చేసిన ట్రంప్ సర్కార్…ప్రతి కేసును నిశితంగా పరిశీలించాలని నిర్ణయించింది. వివాహ మోసాలు అరికట్టడానికి అమెరికా కఠిన చర్యలు తీసుకుంటోంది. దీంతో గతంలో మాదిరిగా తేలిగ్గా ఉండే ఇంటర్వ్యూలు, అనుమతులు ఇచ్చే సమయం ముగిసిపోయింది. ఇప్పుడు వివాహ బంధానికి సంబంధించిన మరిన్ని ఆధారాలను ఇమిగ్రేషన్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.
అమెరికా పౌరుడు, లేదా పౌరురాలిని వివాహం చేసుకున్న వారు.. ఇంటర్వ్యూలో ఏ చిన్న అంశాన్ని ఈజీగా తీసుకోవడానికి ఛాన్సే లేదు. అమెరికా పౌరులను వివాహం చేసుకున్న వ్యక్తులను తొలిదశలో ఇంటర్వ్యూ చేయనున్నారు. ఇది గతం కంటే కఠినంగా ఉంటుంది. వివాహిత భారత పౌరురాలు అయితే.. ఆమెను అమెరికా కాన్సులేట్ అధికారులే ఇంటర్వ్యూ చేస్తారు. జీవిత భాగస్వామి హెచ్-1బీ వర్క్ వీసాపై అమెరికాలో ఉంటే.. అప్పుడు మాత్రమే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారిని అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవల అధికారులు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు.. అన్ని పత్రాలను మర్పిస్తే అధికారులు సాధ్యమైనంత వేగంగా అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. సమాధానం చెప్పడంలో తడబడితే ఇక అంతే సంగతులు. సంబంధిత దరఖాస్తును బ్లాక్ లిస్టులో పెడతారు.
పెళ్లికి సంబంధించిన పత్రాలు, వివాహ ఖర్చులు, ఇరుపక్షాల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలకు కాల్స్ లిస్టును జీవిత భాగస్వామి పేరుతో బీమా పత్రాలను కచ్చితంగా సమర్పించాలి. వైవాహిక జీవితం ఎలా సాగుతోంది ? జీవిత భాగస్వామి ఇపుడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు ? నెలకు శాలరీ ఎంత ? జీవిత భాగస్వామి విద్యార్హతలు ఏంటి ? ఇద్దరిలో ఎవరు ముందు నిద్ర లేస్తారు ? ఎవరు ముందుగా పడుకుంటారు వంటి ప్రశ్నలు అడుగుతారు. అంతే కాదు జీవిత భాగస్వామి ఫుడ్ అలర్జీ ఉందా ? మీ బాత్రూంకి ఎన్ని కిటికీలు ఉన్నాయి వంటి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.
ఇప్పటికే భాగస్వామి హెచ్1బీ వీసా పై ఉంటే మాత్రం…గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడు అమెరికా సిటిజన్ షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అధికారుల ఇంటర్వ్యూ ఉంటుంది. అమెరికా పౌరులు తమ జీవిత భాగస్వామికి స్పాన్సర్ చేస్తున్నట్లు వీసాను పొందాలంటే ఫాం ఐ-130 అనుమతి పొందడానికి 14 నెలల సమయం పట్టనుంది. ఆ తర్వాత మూడున్నర నెలలకు ఇంటర్వ్యూ పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ మొత్తం ప్రక్రియ ముగియడానికి 17 నుంచి 20 నెలలు సమయం పట్టే పట్టనుంది. ఎఫ్2ఏ గ్రీన్ కార్డ్ కేటగిరీలో భారీగా బ్యాక్ లాగ్ ఉంటున్నాయి. ప్రస్తుతం 2022 జనవరి 1న దరఖాస్తు చేసుకొన్న వారికి ప్రాధన్యం ఇస్తున్నారు. దాదాపు మూడేళ్ల నాటి అప్లికేషన్లను ముందు చూస్తున్నారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకుంటే మరో 3 నుంచి 4 ఏళ్లు సమయం పట్టనుంది. దరఖాస్తు దారులు వీలయినంత త్వరగా పేపర్ వర్క్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.