T CONGRESS: ఉత్తమ్, జగ్గారెడ్డిపై ప్రచారం ఉత్తిదేనా..? దీని వెనుక ఎవరున్నారు..?
కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారుతారని జరిగిన ప్రచారం అంతా ఉత్తిదే అని తేలిపోయింది. అయితే, ఇంతకాలం ఈ ప్రచారం చేసిందెవరు..? కనీసం వీళ్ల పేర్లు పరిశీలించకుండానే.. కేసీఆర్ తమ అభ్యర్థుల్ని ప్రకటించారంటే ఈ నేతలు బీఆర్ఎస్‌లో చేరేందుకు నిజంగానే ప్రయత్నించలేదా..?
T CONGRESS: ఎనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మినహా మిగతా అందరికీ బీఆర్ఎస్ టిక్కెట్లు కేటాయించారు సీఎం కేసీఆర్. ఆ ఎనిమిది సీట్లలో ఒక చోటు నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారు. మిగతా ఏడింట్లో ఒకరిద్దరికి మాత్రమే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సీట్లు కేటాయించారు. మిగతా అంతా బీఆర్ఎస్ నేతలే. ఇప్పుడే ఒక అంశంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, జగ్గారెడ్డి పార్టీ మారుతారని జరిగిన ప్రచారం అంతా ఉత్తిదే అని తేలిపోయింది. అయితే, ఇంతకాలం ఈ ప్రచారం చేసిందెవరు..? కనీసం వీళ్ల పేర్లు పరిశీలించకుండానే.. కేసీఆర్ తమ అభ్యర్థుల్ని ప్రకటించారంటే ఈ నేతలు బీఆర్ఎస్‌లో చేరేందుకు నిజంగానే ప్రయత్నించలేదా..?
టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారుతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయనతోపాటు భార్య కూడా బీఆర్ఎస్‌లో చేరుతారని మీడియాలో, సోషల్ మీడియాలో విపరీత ప్రచారం జరిగింది. ఇద్దరిలో ఒకరికి ఎమ్మెల్యే టిక్కెట్, మరొకరికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించినట్లు, త్వరలోనే కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం జరిగింది. అలాగే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా కాంగ్రెస్‌ను వీడి, బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారని కూడా ఇలాంటి ప్రచారమే మొదలైంది. ఈ మేరకు జగ్గారెడ్డి బీఆర్ఎస్ పెద్దలతో సంప్రదింపులు జరిపినట్లు, కాంగ్రెస్‌కు త్వరలోనే గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రచారం జరిగింది. అంతేకాదు.. ఆ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత చింత ప్రభాకర్ అనుచరులు చివరకు హరీష్ రావును కలిశారు. జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని కోరారు. ఇంత ప్రచారం జరిగితే.. చివరికి వీరికి అవకాశమే లేకుండా.. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన వచ్చేసింది. అంటే ఇంతకాలం వీరి విషయంలో జరిగిన ప్రచారం ఉత్తితే అన్నమాట.
దీని వెనుక ఎవరున్నారు..?
రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వంటి నేతలు ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. ఎప్పట్నుంచో పార్టీలో ఉన్న తమకు కాకుండా.. కొత్తగా పార్టీలో చేరిన రేవంత్‌ను అధ్యక్షుడిని చేయడంపై ఈ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అటు రేవంత్‌కు, కొందరు సీనియర్లకు మధ్య విబేధాలు కొనసాగాయి. రేవంత్‌పై పలుమార్లు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇదే సమయంలో జగ్గారెడ్డి, ఉత్తమ్ పార్టీ మారుతారంటూ ప్రచారం మొదలైంది. దీని వెనుక రేవంత్‌కు చెందిన వ్యక్తులు ఉన్నారని ఈ ఇద్దరూ పరోక్షంగా ఆరోపించారు. పైగా ఇటీవల ఈ అంశంపై ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఆవేదన వ్యక్తం చేశారు. తమను దెబ్బతీసేందుకు సొంత పార్టీలోనే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రచారం వెనుక నిజంగానే రేవంత్ అండ్ కో ఉందా..? లేక వీరి ఇమేజ్ దెబ్బతీసి, కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు బీఆర్ఎస్ ఈపని చేసిందా..? అన్నది తేలాలి.
ఇంతకాలం ప్రయత్నించారా..?
అయితే, ఈ ఇద్దరూ బీఆర్ఎస్ సీట్ల కోసం నిజంగానే ప్రయత్నించి ఉండొచ్చని, కానీ, బీఆర్ఎస్ నుంచి సానుకూల స్పందన రాలేదనే మరో ప్రచారం మొదలైంది. అందుకే.. ఇంతకాలం ఈ ప్రచారంపై స్పందించని జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సరిగ్గా కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటించడానికి రెండు, మూడు రోజుల ముందే ప్రెస్‌మీట్ పెట్టి ఖండించారు. అంటే అప్పటివరకు సీట్ల కోసం ప్రయత్నించడం.. చివరకు టిక్కెట్లు దక్కలేదని తెలుసుకుని ప్రెసమీట్ పెట్టి ఆవేదన వ్యక్తం చేయడం చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఇక జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేయాల్సిందే.