V Hanumantha Rao: పాపం వీహెచ్.. హనుమంతన్నకి కోపమొచ్చింది.. పగబట్టిందెవరు ?
ఇటీవల వరుస నియామకాలు జరుగుతున్న క్రమంలో తన సంగతేంటన్న క్వశ్చన్ వస్తోందట ఆయనకు. దశాబ్దకాలం తర్వాత పవర్ వస్తే.. తనను పట్టించుకోరా అంటూ కోపంగా ఉన్నట్టు తెలిసింది.
V Hanumantha Rao: తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ ఎంపీ వి.హన్మంతరావు కొంత కినుక వహించారా..? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. పవర్‌లో ఉన్నా, లేకున్నా గాంధీభవన్‌ని అంటిపెట్టుకుని ఉన్న కొద్దిమంది నాయకుల్లో ఆయన ఒకరు. కానీ.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తనను పట్టించుకోవడం లేదన్న అసహనం ఆయనలో పెరిగిపోతోందంటున్నారు సన్నిహితులు. ఇటీవల వరుస నియామకాలు జరుగుతున్న క్రమంలో తన సంగతేంటన్న క్వశ్చన్ వస్తోందట ఆయనకు. దశాబ్దకాలం తర్వాత పవర్ వస్తే.. తనను పట్టించుకోరా అంటూ కోపంగా ఉన్నట్టు తెలిసింది. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో.. ఒక సీటు ఏఐసీసీ కోటాలోకి వెళ్లినా.. ఆ అవకాశం తనకే వస్తుందని ఆశించారట ఆయన.
TDP TENSION: సిద్ధంసభలో జనం చూసి.. టీడీపీలో దడ
అయితే.. రెండు సీట్లూ తెలంగాణ కోటాకే ఇవ్వడంతో ఒకటి రేణుకా చౌదరికి మరోటి అనిల్ యాదవ్‌కు ఇచ్చింది పార్టీ. ఆఖరి నిమిషం వరకు తనకు రాజ్యసభ ఇస్తారని భావించారట వీహెచ్. కానీ.. జాబితా వచ్చాక షాకై సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళినట్టు తెలిసింది. సీఎం రేవంత్‌తో.. ఎన్నికలకు ముందు నుంచి కొంత సఖ్యతగా ఉంటూ సహకరిస్తున్నారు వీహెచ్. పార్టీ అధికారంలోకి వచ్చాక.. ఇక ఏదో ఒక ఛాన్స్ రాకపోతుందా..? అని లెక్కలు వేసుకున్నారాయన. ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు వీహెచ్. అందుకే ఈ దఫా కూడా తనకే ఛాన్స్ అనుకున్నారాయన. కానీ.. ఫైనల్ లిస్ట్‌తో డిజప్పాయింట్ అయ్యారట వీహెచ్. పార్టీలో కీలకమైన నేతలు అందరితో సఖ్యతగానే ఉంటున్నారాయన. దశాబ్దాల తరబడి పార్టీకి విధేయుడు. గాంధీ కుటుంబంతో సాన్నిహిత్యం, సోనియాగాంధీ స్థాయిలో ఉన్న వ్యక్తిగత పరపతి కలిసి వస్తాయని లెక్కలేసుకున్న వీహెచ్ ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ, రాజ్యసభ ఖాళీలు భర్తీ అయ్యాయి.
కానీ.. పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశాలు వస్తాయని చెప్పే నాయకులు.. తనకు అవకాశం ఎందుకు ఇవ్వడం లేదన్న బాధలో వీహెచ్ ఉన్నట్టు సమాచారం. గతంలో ఖమ్మం పార్లమెంట్ సీటు కోసం ప్రయత్నించినా దక్కలేదు. ఈసారి అయినా అవకాశం వస్తుందేమో అనే ఆలోచనలో ఉన్నా.. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య నేతలు చాలామంది కన్ను ఈ సీటు మీద ఉంది. ఈ పరిస్థితుల్లో వీహెచ్‌కి పార్టీలోగాని, ప్రభుత్వంలోగానీ ఎలాంటి పదవి దక్కుతుందన్న చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. అసలాయనకు పదవీయోగం కనుచూపు మేరలో ఉందా అన్న చర్చ సైతం జరుగుతోందట. కాంగ్రెస్ లో కోదండరెడ్డి… వీహెచ్ ఇద్దరూ మంచి మిత్రులు. పార్టీలో సీనియర్ నేతలు. ఇప్పుడా ఇద్దరిని ఎలా సెట్ చేస్తారు..? ఎలాంటి అవకాశాలు వస్తాయన్న ఆసక్తిగా చూస్తున్నాయి తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు.