VV Lakshmi Narayana: వైసీపీలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.. అసలు విషయం ఇదే..!

వైసీపీని పొగడటంతో లక్ష్మీ నారాయణ త్వరలో వైసీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై లక్ష్మీ నారాయణ స్పష్టతనిచ్చారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 30, 2023 | 01:23 PMLast Updated on: Oct 30, 2023 | 1:23 PM

V V Lakshmi Narayana Will Join Ysrcp Here Is The Clarity

VV Lakshmi Narayana: సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ వైసీపీలో చేరబోతున్నారంటూ ఇటీవల ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై లక్ష్మీ నారాయణ స్పష్టతనిచ్చారు. ఈ ప్రచారంలో నిజం లేదన్నారు. గతంలో సీబీఐ జేడీగా పని చేసిన లక్ష్మీ నారాయణ.. తన పదవికి రాజీనామా చేసి, అనంతరం రాజకీయాల్లో చేరారు. 2019లో ఏపీలోని విశాఖ నుంచి జనసేన తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి జనసేనకు రాజీనామా చేశారు. అప్పటినుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే, వివిధ సామాజిక, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల శ్రీశైలంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో జేడీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం గురించి ప్రశంసలు కురిపించారు. విద్య, వైద్య రంగాల్లో మంచి చేసేవారికి మంచి ఫలితం ఉంటుందన్నారు. నాడు-నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలను అభినందించారు. నాడు-నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు రాగిజావ, పౌష్టికాహారం ఇవ్వడం మంచి నిర్ణయమని ప్రశంసించారు. అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా రోగుల వద్దకే వెళ్లి డాక్టర్లు పరీక్షలు చేసి, మందులు ఇవ్వడం మంచి పరిణామం అన్నారు. ఇలా వైసీపీని పొగడటంతో లక్ష్మీ నారాయణ త్వరలో వైసీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొంతకాలం క్రితం లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే, తనకు అనువైన పార్టీని ఎంచుకుంటానని, అన్ని పార్టీలు తనతో టచ్‌లో ఉన్నాయన్నారు. దీంతో వైసీపీలో చేరికపై ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై లక్ష్మీ నారాయణ స్పష్టతనిచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు. “మా పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి ఆహ్వానించడానికి శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిని కలిశాను.

అక్కడే వైద్య పరీక్షలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమానికి ఆయన నన్ను ఆహ్వానించారు. ఆ సమావేశంలో నేను వైద్య శిబిరాలు, నాడు-నేడు కార్యక్రమాలను అభినందించాను. అంతమాత్రాన నేను అధికార పార్టీలో చేరుతున్నానని, వచ్చే ఎన్నికల్లో వారి టిక్కెట్టుపై పోటీ చేస్తానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదు. ఈ ఊహాగానాలలో ఏ మాత్రం నిజం లేదు. ప్రజలు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఓటర్ల చైతన్య కార్యక్రమం కొనసాగించే నా పోరుబాటకు కట్టుబడి ఉన్నాను” అంటూ ప్రకటంచారు. దీంతో లక్ష్మీ నారాయణ విషయంలో జరుగుతున్న ప్రచారం ఉత్తిదే అని తేలిపోయింది.