Vanama Venkateswara Rao: వనమా వర్సెస్ జలగం.. బీఆర్ఎస్ ఓటు ఎవరికి..? కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరు..?
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జలగం ఈ అంశంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను సంప్రదించారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు. వనమా సభ్యత్వాన్ని కోర్టు రద్దు చేసిన అంశాన్ని తెలియజేశారు. దీనిపై స్పీకర్ ఏం స్పందించారు అనే అంశంపై స్పష్టత లేదు.
Vanama Venkateswara Rao: తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌కు ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావును అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. తప్పుడు అఫిడవిట్ సమర్పించిన కారణంగా వనమాను హైకోర్టు అనర్హుడిగా ప్రకటించి, ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఎన్నికల్లో వనమా తర్వాతి స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది.
వనమాపై కేసు దాఖలు చేసింది జలగం వెంకట్రావు. వనమా ఎన్నికల సందర్భంగా తప్పుడు అఫిడవిట్ సమర్పించాడని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు జలగం వెంకట్రావుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జలగం ఈ అంశంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను సంప్రదించారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు. వనమా సభ్యత్వాన్ని కోర్టు రద్దు చేసిన అంశాన్ని తెలియజేశారు. దీనిపై స్పీకర్ ఏం స్పందించారు అనే అంశంపై స్పష్టత లేదు. ఈ అంశం ప్రధానంగా బీఆర్ఎస్‌కు ఇబ్బందిగా మారింది. ఎందుకంటే ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కాంగ్రెస్ నుంచి గెలిచి, అనంతరం బీఆర్ఎస్‌లో చేరారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. మరోవైపు జలగం వెంకట్రావు కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఒకవేళ ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైనా.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే పరిగణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కోర్టు తీర్పు నేపథ్యంలో బీఆర్ఎస్ ఎలా వ్యవహరిస్తుంది అనే అంశంపై ఆసక్తి నెలకొంది. కోర్టు తీర్పు ప్రకారం.. జలగం వెంకట్రావును ఎమ్మెల్యే చేస్తే వనమా నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి నియోజకవర్గంలో వనమా బలంగానే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఆయనకే తిరిగి టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. వనమా బీఆర్ఎస్‌లో చేరడంతో కొంతకాలంగా జలగం రాజకీయాల్లో సైలెంట్ అయిపోయారు. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఇప్పుడు తనకు అనుకూలంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో తిరిగి జలగం యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంది.
తాజా పరిస్థితుల్లో బీఆర్ఎస్.. ఇద్దరిలో ఎటువైపు మొగ్గు చూపుతుందో చూడాలి. ఇద్దరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఒకరికి సీట్ ఇచ్చి, మరొకరిని పక్కనబెడితే పార్టీకి నష్టమే. కాగా, తాను బీఆర్ఎస్‌ను వీడలేదని, ఆ పార్టీ నుంచే తిరిగి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తానని ఆయన చెబుతున్నారు. ఈ మూడు నెలల్లో నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తనకు తెలుసని, అందుకు తగ్గ ప్రణాళిక తన వద్ద ఉందన్నారు. కాగా, తన సభ్యత్వాన్ని రద్దు చేసే అంశంపై ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వనమా సిద్ధమయ్యారు. తనపై ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తీర్పును కోర్టు వాయిదా వేసింది.