Vangaveeti Radha: అనుచరులతో వంగవీటి రాధా భేటీ.. టీడీపీకి గుడ్‌బై చెప్పేస్తున్నారా..?

తాజాగా వంగవీటి రాధా విజయవాడలో తన అనుచరులతో సమావేశమయ్యారు. దీంతో ఆయన రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్న ఆసక్తి నెలకొంది. టీడీపీలో రాధాకృష్ణకు ఇబ్బందులున్నాయి. 2009లో రాధా ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు. అనంతరం వైసీపీలో చేరారు. 2019లో టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీని కూడా వీడే అవకాశాలున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 10, 2023 | 01:59 PMLast Updated on: Aug 10, 2023 | 7:06 PM

Vangaveeti Radha Will Quit Tdp Joins Janasena Soon

Vangaveeti Radha: కృష్ణా జిల్లా రాజకీయాల్లో వంగవీటి రాధా కీలక నేత. వంగవీటి రంగా కుమారుడైన రాధా.. తనదైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, రాజకీయంగా కలిసి రావడం లేదు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న రంగా త్వరలోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. తాజాగా వంగవీటి రాధా విజయవాడలో తన అనుచరులతో సమావేశమయ్యారు. దీంతో ఆయన రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్న ఆసక్తి నెలకొంది.

టీడీపీలో రాధాకృష్ణకు ఇబ్బందులున్నాయి. 2009లో రాధా ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు. అనంతరం వైసీపీలో చేరారు. 2019లో టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీని కూడా వీడే అవకాశాలున్నాయి. వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ సీటు ఆశిస్తున్నారు. అయితే, అదే స్థానం నుంచి టీడీపీలో కీలక నేతగా ఉన్న బోండా ఉమ టిక్కె‌ట్ కావాలనుకుంటున్నారు. చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం రీత్యా బోండా ఉమకే టీడీపీ టిక్కెట్ దక్కే అవకాశాలున్నాయి. దీంతో తనకు అవకాశం లేకపోవడంతో రాధా పార్టీని వీడబోతున్నారు. ఈ విషయంపై రాధా తన అనుచరులతో సమావేశమై చర్చిస్తున్నారు. టీడీపీని వీడితే ఎదురయ్యే పరిస్థితులు.. ఏ పార్టీలో చేరాలి వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశాల అనంతరం దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం.. వంగవీటి రాధా జనసేన వైపు చూస్తున్నారు. జనసేనలో చేరితే ఆ పార్టీ తరఫున విజయవాడ సెంట్రల్ టిక్కెట్ గ్యారెంటీ అనే హామీ దక్కినట్లు తెలుస్తోంది.

జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ వంగవీటి రాధాకు టిక్కెట్ ఇస్తామని జనసేన నుంచి ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు వంగవీటి రాధాకు కొడాలి నాని, వల్లభనేని వంశీతో సన్నిహిత సంబంధాలున్నాయి. వాళ్లు రాధను వైసీపీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, దీనికి రాధ అంగీకరిచడం లేదు. తాను జనసేన వైపే వెళ్లాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. రాధ సోదరి వంగవీటి ఆశాలత కూడా రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె బాబాయ్.. తనను రాజకీయాల్లోకి తేవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమె వైసీపీ నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, ఈ విషయంలో అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. రాధ, ఆశాలత.. వేర్వేరు పార్టీలను ఎంచుకుంటే రాజకీయ పోరు ఆసక్తికరంగా ఉంటుంది.