Vangaveeti Ashalatha: రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె.. ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే..?
స్వర్గీయ వంగవీటి రంగా కుమార్తె ఆశాలత రాజకీయాల్లోకి రానున్నారని, ఆమె బెజవాడ సెంట్రల్ నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. రంగా రాజకీయ వారసత్వాన్ని బలంగా జనంలోకి తీసుకుపోవడానికి ఆశాలతను ఎన్నికల బరిలోకి దించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం.
Vangaveeti Ashalatha: బెజవాడ రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న వేళ ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఇక బెజవాడ రాజకీయాల్లో వంగవీటి రంగా కుమార్తె ఆశాలతపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. స్వర్గీయ వంగవీటి రంగా కుమార్తె ఆశాలత రాజకీయాల్లోకి రానున్నారని, ఆమె బెజవాడ సెంట్రల్ నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
వంగవీటి రంగా రాజకీయ వారసత్వాన్ని బలంగా జనంలోకి తీసుకుపోవడానికి ఆయన కుమార్తె ఆశాలతను ఎన్నికల బరిలోకి దించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం. 2024 ఎన్నికల్లో రంగా కుటుంబానికి రాజకీయంగా గట్టి పట్టు ఉన్న విజయవాడ సెంట్రల్ నుంచి ఆమెని బరిలోకి దింపేందుకు ఆమె మేనమామ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. విజయవాడతో పాటు గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడం కోసం రంగా వారసత్వం పార్టీకి ఉపయోగపడుతుందని భావిస్తున్న పార్టీలు వంగవీటి ఆశాలతను పార్టీలోకి స్వాగతించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బెజవాడలో వంగవీటి రంగా అభిమానులు చాలామంది ఉన్నారు. రంగాపై ఉన్న అభిమానం ఓటు బ్యాంకుగా మారుతుందని భావిస్తున్నారు.
వంగవీటి రంగా హత్య తర్వాత ఆయన భార్య రత్నకుమారి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాను కూడా ఎమ్మెల్యేగా గెలిపించారు. అయితే రాజకీయాలలో రత్నకుమారి కానీ, కుమారుడు రాధాకృష్ణ కానీ అంతగా రాణించ లేకపోయారు. వంగవీటి రాధా ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ ఆయన చాలా లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తారు. ఎవరితోనూ ఎక్కువ సన్నిహిత సంబంధాలను కలిగి ఉండరు. ఈ క్రమంలో కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు కోసం వంగవీటి ఆశాలతను రాజకీయాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే రంగా వారసురాలు వంగవీటి ఆశాలత పొలిటికల్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో విజయవాడ సెంట్రల్ నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అయితే, ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతుంది అనేదే సస్పెన్స్..!!