Vara Prasad: ఔరా రాపాక.. నువ్వా విలువలు గురించి చెప్పేది.!
పతివ్రత పరమాన్నం వండితే.. తెల్లారేదాకా చల్లారలేదంట ! రాపాక తీరు చూసి ఇప్పుడు రాజకీయవర్గాలు, జనాలు అనుకుంటున్న మాట ఇదే ! సిగ్గు శరం వదిలేస్తే పదికోట్లు వచ్చేవని.. విలువలకు కట్టుబడి జగన్ వైపే ఉన్నానని రాపాక ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు. నిజంగా రాపాకను టీడీపీ వాళ్లు సంప్రదించారా.. పది కోట్లు ఆఫర్ చేశారా అన్నది కాదు ఇక్కడ మ్యాటర్ ! ఫిరాయింపు ఎమ్మెల్యే అయిన రాపాక ఈ మాటలు చెప్పడమే ఇక్కడ హైలైట్.
విలువలకు వలువలు ఊడదీసిన నువ్వా.. ఇప్పుడు విలువల గురించి మాట్లాడేది అనేది చాలామంది చర్చ! గత ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్.. ఆ తర్వాత వైసీపీ వైపు వెళ్లిపోయారు. పార్టీ నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే.. పైగా పవన్ ఎంతో నమ్మిన నేత.. అలాంటి రాపాక అన్నీ వదిలేసి అధికార పార్టీలోకి జంప్ చేశారు. గెలిచిన ఒకే ఎమ్మెల్యేగా పార్టీకి పెద్దన్న పాత్ర వహించాల్సింది పోయి.. జంబలకిడి జారుమిఠాయా అన్నట్లు.. అధికార పార్టీలోకి జారుకున్నారు. అలాంటి రాపాక ఇప్పుడు విలువ గురించి మాట్లాడడం.. సిగ్గు, శరం గురించి ప్రస్తావించడం ఏంటి.. ఇట్స్ లాఫింగ్ టైమ్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ, జనసేన నేతలు.
నిజానికి స్వతంత్య్ర అభ్యర్థిగా నిల్చుంటే.. మూడు వందల ఓట్లు కూడా రావని తెలిసినా.. పిలిచి మరీ పవన్ రాపాకకు టికెట్ ఇచ్చారు. గెలిచిన తర్వాత రాపాకకు పవన్ చాలా మద్దతుగా నిలిచారు. ఓ సమయంలో అరెస్ట్ చేస్తామంటే అడ్డు పడింది కూడా పవనే ! అలాంటి పవన్‌ను తిట్టిన తిట్టు.. తిట్టకుండా తిట్టి వైసీపీలో చేరిపోయారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు విలువల గురిచి మాట్లాడడమా ! సిగ్గు శరం ఉంటే పది కోట్లు వచ్చేవి అయినా విలువలకు కట్టుబడి జగన్‌తో ఉన్నానని అంటున్న ఇదే రాపాక.. ఆ రోజు పవన్‌కు, పవన్ పార్టీకి ఎందుకు దూరం అయినట్లు.. ఏదో ఆశించి అప్పుడు వైసీపీలో చేరిన రాపాక.. ఇప్పుడు విలువలకు కట్టుబడి టీడీపీ ఆఫర్ వద్దన్నాను అంటూ చెప్పడం నిజంగా పెద్ద కామెడీనే ! విలువల గురించి చెప్పేముందు.. ఆ విలువలకు ఎలాంటి విలువ ఇచ్చారో గుర్తు చేసుకోవాలి. టీడీపీ నిజంగానే ఆఫర్ చేసి ఉండొచ్చు.. ఈయన నిజంగానే వద్దు అని ఉండొచ్చు.. అలా అని విలువల గురించి నువ్ మాట్లాడితే చాలా కామెడీగా ఉందయ్యా రాపాక అని అనుకుంటున్నారు జనం.