Vemulawada Politics: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ రాజన్న సాక్షిగా గులాబీ పరిమళిస్తుందా.?
వేమలవాడలో రాజకీయాలు రెండు వర్గాలుగా విడిపోయాయి. దీని ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పై పడే ప్రమాదం ఉందంటున్నారు రాజకీయ పండితులు.

Vemulawada sitting MLA Chennamaneni Ramesh Babu is deeply unhappy with the announcement of CM KCR's MLA candidates
బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ముహూర్తాన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించారో.. ఆరోజు నుంచి తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తికరంగా మారుతున్నాయి. మన్నటి వరకూ ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్ హాట్ టాపిక్ గా మారితే.. నిన్న మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేసి మరింత అగ్గిరాజేశారు. తాజాగా ఈ అసంతృప్తి వేములవాడకు చేరింది. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సీఎం ఆహ్వానాన్ని కూడా పట్టించుకోలేదు. దీనికి కారణం అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఇతరులకు ఇవ్వడం పట్ల తీవ్ర అసంతప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది.
చెన్నమనేనికి సీఎం అపాయింట్మెంట్ వెనుక అసలు కథ..
వేములవాడ లో చెన్నమనేని మంచి పేరున్న లీడర్ గా ఎదిగారు. 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అయితే స్థానికేతరుడిగా అక్కడ నిలబడటం కొందరికి మింగుడుపడలేదు. ఇతను జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నాడు. దీనిపై భారత పౌరసత్వాన్ని కేంద్రహోంశాఖ గతంలో వద్ద చేస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. దీనిని అస్త్రంగా చేసుకుని ఇతనిని ఎన్నికల నుంచి తప్పించే ప్రయత్నాలు చేశారు. దీంతో కేసీఆర్ ఈ దఫా చల్మెడ లక్ష్మీనరసింహరావుకు వేములవాడ టికెట్ కేటాయించారు. అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న చెన్నమనేనిని బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా ప్రగతి భవన్ కి ఆహ్వానించారు. పైగా ముఖ్యమంత్రికి వ్యవసాయ రంగ సలహాదారునిగా నియమించినట్లు ప్రకటించింది ప్రభుత్వం. దీనిని కూడా పట్టించుకోకుండా కేసీఆర్ ను కలిసేందుకు సుముఖత చూపించలేదు చెన్నమనేని. దీంతో వేములవాడలో బీఆర్ఎస్ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారింది.
మద్దతు కోసం ప్రయత్నాలు..
గతంలోనూ వర్గపోరు ఉన్నప్పటికీ కాస్త ప్రశాంతంగా ఉన్న వేములవాడలో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దీనికి కారణం ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనే అని తెలుస్తోంది. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేకి కాదని వేరెవరికో టికెట్ ఇవ్వడాన్ని చెన్నమనేని రమేశ్ బాబు జీర్ణించుకోలేక పోతున్నట్లు సమాచారం. పైగా ఇతనికి స్థానికంగా మంచి పట్టు ఉంది. ఇతని మద్దతు కూడబెట్టుకొని చెల్మెడను గెలిపించేందుకు ప్రయత్నింస్తాడని భావించింది అధిష్టానం. కానీ కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టింది. అసలు సీఎంతో మాట్లాడేందుకే ఇష్టపడని చెన్నమనేని.. చల్మెడ లక్ష్మీనరసింహరావుకు ఎన్నికల్లో సహకరిస్తారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఇతను మద్దతు ఇవ్వకపోతే చెల్మెడ విజయం కాస్త డౌటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
సిట్టింగ్ కాస్త జంప్ చేస్తారా.?
ఇన్నేళ్లు గా బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ని నమ్ముకుని ఉన్న తనకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని అస్సలు భావించలేదు చెన్నమనేని. దీంతో వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకటి సిట్టింగ్ ఎమ్మెల్యేకి మద్దతు పలుకుతుంటే మరొకరు లక్ష్మీనరసింహరావు వైపు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య చెన్నమనేని బీఆర్ఎస్ లో స్థిరంగా కొనసాగుతారా.. సీఎం బుజ్జగింపులు ఎంత మాత్రం ఫలిస్తాయి.. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నిలబడతారా లేక ఇతర పార్టీల్లో చేరుతారా అన్న ప్రశ్నలు వేములవాడలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీనిపై మరింత స్పష్టత రావాలంటే ఎన్నికల నోటిఫికేఫన్ వచ్చే వరకూ ఎదురుచూడక తప్పదు.
T.V.SRIKAR