టీడీపీలో జీవీ రెడ్డి చిచ్చు.. అధిష్టానాన్ని తిడుతున్న క్యాడర్…!
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ప్రతి విషయాన్ని చాలా సున్నితంగా గమనిస్తుంది. నాయకుల ప్రవర్తనను, ప్రభుత్వ పనితీరును అన్ని గమనిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తోంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ప్రతి విషయాన్ని చాలా సున్నితంగా గమనిస్తుంది. నాయకుల ప్రవర్తనను, ప్రభుత్వ పనితీరును అన్ని గమనిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తోంది. ఇప్పుడు పార్టీలో జరిగిన ఓ పరిణామాన్ని తెలుగుదేశం పార్టీ క్యాడర్ చాలా సీరియస్ గా తీసుకుంది. అదే.. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉన్న జీవీ రెడ్డి పార్టీకి.. ఆ పదవికి రాజీనామా చేయడాన్ని టిడిపి క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. ఒక ఐఏఎస్ అధికారి కోసం తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టిన జీవీరెడ్డిని ఆకాశానికి ఎత్తేస్తోంది టిడిపి క్యాడర్.
సాధారణంగా ఎవరైనా పార్టీ నుంచి వెళ్లిపోతే పెద్దగా ఏ పార్టీ క్యాడర్ పట్టించుకునే ప్రయత్నం చేయదు. కానీ జీవి రెడ్డి విషయంలో మాత్రం ఇది కాస్త భిన్నంగా కనబడుతోంది. ఫైబర్ నెట్ లో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆయనకు అధికారుల నుంచి సహకారం లేదనే ఆరోపణలు గట్టిగా వచ్చాయి. స్వయంగా ఆయనే అధికారుల తీరుపై మండిపడ్డారు. అయితే అధికారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరించడంతో జీవి రెడ్డి అవమాన భారంతో ఆత్మగౌరవాన్ని చంపుకోలేక పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం ఉన్న యువ రాజకీయ నాయకుల్లో ఆయనకు ఎక్కువగా సబ్జెక్టు ఉంటుంది. మీడియా సమావేశాల్లో అలాగే చర్చా వేదికల్లో ఆయన మాట్లాడే మాటలు ఇప్పటికీ బాగా వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి నాయకుడు పార్టీకి దూరం కావడం ఖచ్చితంగా మైనస్ అని టిడిపి క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అధికారులను నమ్ముకుని చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తే రాజకీయంగా పార్టీ మరోసారి నష్టపోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోకుండా పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం కరెక్ట్ కాదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆత్మగౌరవంతో పుట్టిన పార్టీ నుంచి ఆత్మగౌరవంతో బయటికి వెళ్లిపోయిన యువ నాయకుడు తెలుగుదేశం పార్టీకి ఆదర్శం అని.. పార్టీ అధిష్టానం అతనితో చర్చలు జరపాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఇక మరి కొంతమంది కార్యకర్తలు అయితే జీవి రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను బయటపెట్టాలని డిమాండ్ చేయడం గమనార్హం. ఇక ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి చేసిన రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరోవైపు ఫైబర్ నెట్ లో వివాదంపై సిఎం వద్దకు నివేదిక చేరింది.
ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్ ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దినేష్ కుమార్ కు జీఎడికి రిపోర్ట్ చేయాలని అదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. ఈ రెండు చర్యల ద్వారా అటు పార్టీలో అయినా, ఇటు ప్రభుత్వంలో అయినా క్రమశిక్షణకు ప్రాధాన్యం అనే నిర్థిష్ట అభిప్రాయాన్ని పార్టీ పెద్దలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.