మౌనం వెనుక భయమా…? సాయి రెడ్డిని కెలకని సజ్జల
ఒకప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏమన్నా సరే వైసీపీ సోషల్ మీడియా నుంచి చాలా ఘాటుగా రియాక్షన్ ఉండేది. ఎవరినైనా సరే విమర్శించడానికి వైసిపి సోషల్ మీడియా వెనకడుగు వేసేది కాదు.

ఒకప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏమన్నా సరే వైసీపీ సోషల్ మీడియా నుంచి చాలా ఘాటుగా రియాక్షన్ ఉండేది. ఎవరినైనా సరే విమర్శించడానికి వైసిపి సోషల్ మీడియా వెనకడుగు వేసేది కాదు. అవసరమైతే వారి కుటుంబ సభ్యులను కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేవారు. పార్టీ నాయకులు కూడా అదే ధోరణిలో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. రాజకీయంగా వైసీపీ ప్రస్తుతం బలహీనపడటానికి ఇదే ప్రధాన కారణం అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.
ఇప్పుడు విజయసాయిరెడ్డి వైయస్ జగన్ తో విభేదించి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజకీయంగా ఆయన ఒకప్పుడు ఆ పార్టీలో కీలక పాత్ర పోషించారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి… విజయసాయిరెడ్డి అత్యంత కీలక పాత్ర పోషించారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా కొంతమంది కీలక వ్యక్తులను.. వైయస్ జగన్ కు పరిచయం చేయడంలో.. జగన్ కు అనుకూలంగా రాజకీయం చేయడంలో విజయ్ సాయి రెడ్డి ఢిల్లీ స్థాయిలో సక్సెస్ అయ్యారు.
అయితే ఇప్పుడు ఆయన రాజకీయాల నుంచే తప్పుకోవడమే కాకుండా… సమయం దొరికిన ప్రతిసారి ఏదో ఒక రూపంలో వైయస్ జగన్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా వైసీపీలో కోటరీ… ఎక్కువగా ఉందని కోటరీ మాటలను నాయకుడు వినకూడదు అంటూ విజయసాయిరెడ్డి సూచించారు. పార్టీలో ఉన్న కోటరీ కారణంగానే తన రాజకీయాలనుంచి తప్పుకున్నానని… ఇక మళ్ళీ వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని విజయసాయిరెడ్డి క్లియర్ కట్ గా చెప్పేశారు. వాస్తవానికి విజయ సాయి రెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఆ పార్టీ సోషల్ మీడియా తీవ్రస్థాయిలో రియాక్ట్ అవ్వాలి.
విజయసాయిరెడ్డి… టిడిపి, బిజెపి గానీ జనసేన పార్టీ గానీ కాదు. కాబట్టి ఆయనకు కౌంటర్ ఇచ్చిన వారిపై కేసులు నమోదవడం జరగదు. కానీ విజయసాయిరెడ్డిని వైసీపీ సోషల్ మీడియా పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. ఆయనపై ఎక్కడా విమర్శలు చేయలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల్లో ఉన్న వైసీపీ సోషల్ మీడియా… ఇప్పుడు విజయసాయిరెడ్డి విమర్శించేందుకు సాహసం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయనకు వ్యతిరేకంగా ఏ కామెంట్ చేసినా సరే తమకు ఇబ్బందికర పరిస్తితులు ఉంటాయి అనే భయం లో వైసీపీ నేతలు ఉన్నట్టుగానే అర్థమవుతుంది.
ఇక వైసిపి నేతలు కూడా అటు సోషల్ మీడియాలో గాని ఎలక్ట్రానిక్ మీడియాలో గాని విజయసాయిరెడ్డి పై పెద్దగా మాట్లాడే ప్రయత్నం ఈ మధ్యకాలంలో చేయడం లేదు. ఆయన రాజకీయాల నుంచి తప్పకున్నా సరే పార్టీ నేతలు మౌనంగానే ఉన్నారు. కీలక నాయకులు కూడా పెద్దగా ఎక్కడా మాట్లాడటం లేదు. విజయసాయిరెడ్డి తో పార్టీ నేతలు అందరికీ సఖ్యత ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి కంటే విజయసాయిరెడ్డి తోనే పార్టీ నేతలు ముందు కలిసి ఉండేవారు. బహుశా అందుకేనేమో విజయసాయిరెడ్డి ఏ కామెంట్ చేసినా సరే వైసీపీ నుంచి పెద్దగా రియాక్షన్ ఉండడం లేదు.