Vijaya Sai Reddy : చంద్రబాబుకు విజయసాయి రెడ్డి బర్త్‌ డే విషెస్‌.. అన్నదమ్ములు కలిసిపోయారా.. జగన్‌కు వార్నింగ్ ఇచ్చారా?

చంద్రబాబుకు వైసీపీ ఎంపీ విజయసాయి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. చంద్రబాబు, లోకేశ్‌ పేరు చెప్తే చాలు.. ఇంతెత్తున ఎగురుతూ, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే విజయసాయి నుంచి ఇలాంటి విషెస్‌ రావడం కొత్త చర్చకు కారణం అవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 20, 2023 | 02:02 PMLast Updated on: Apr 20, 2023 | 2:12 PM

Vijayasai Reddy Sent Birthday Wishes To Chandrababu Did They Give A Warning To Jagan

Chandrababu Naidu: మీరు మారిపోయారు సార్‌.. విజయసాయిని చూసి ఇదే మాట పదేపదే అంటోంది ఏపీ రాజకీయం. టీడీపీ అధినేత చంద్రబాబు 72వ పుట్టినరోజు వేడుకలు గురువారం ఏపీవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అభిమానులు, కార్యకర్తలు, నాయకులు.. అందరూ చంద్రబాబుకు విషెస్ చెప్తున్నారు. అందులో విశేషం ఏమీ లేదు. అయితే, వైసీపీ ఎంపీ విజయసాయి కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. చంద్రబాబు, లోకేశ్‌ పేరు చెప్తే చాలు.. ఇంతెత్తున ఎగురుతూ, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే విజయసాయి నుంచి ఇలాంటి విషెస్‌ రావడం కొత్త చర్చకు కారణం అవుతోంది.

పుట్టినరోజు అనో, పార్టీ పెట్టిన రోజు అనో కాదు.. సమయం ఏదైనా, సందర్భం ఎలాంటిదైనా ఒకప్పుడు చంద్రబాబును ఏకిపారేయడం మాత్రమే తెలుసు అన్నట్లు కనిపించేవి విజయసాయి ట్వీట్లు! 2020లో చంద్రబాబు బర్త్‌డేకు విజయసాయి పెట్టిన పోస్టు అప్పట్లో పుట్టించిన హీట్ అంతా ఇంతా కాదు. ఫోర్త్ మంథ్.. 20 ఇయర్‌.. 420కి బర్త్‌ డే శుభాకంక్షలు అంటూ చంద్రబాబుకు విషెస్ చెప్పిన విజయసాయి.. 2021లోనూ అదే దూకుడు చూపించారు. చంద్రబాబు వెన్నుపోటు అంటూ ఘాటుగా ట్వీట్‌ చేశాడు. కట్‌ చేస్తే.. రెండేళ్లు గడిచాయ్. విజయసాయిలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఇప్పుడు కూడా విషెస్ చెప్పారు. కానీ, ఈసారి తీరు మారింది. చంద్రబాబు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని.. సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలంటూ చంద్రబాబుకు విషెస్‌ చెప్పారు విజయసాయి.

ఆ పోస్టులో అభిమానం కనిపించింది. ప్రేమ వినిపించింది. ఇదే ఇప్పుడు రెండు పార్టీల్లో చర్చకు కారణం అయింది. చంద్రబాబు, విజయసాయి మధ్య బంధుత్వం ఉంది. తనకు చంద్రబాబు అన్న వరుస అవుతారని.. తారకరత్న ఆసుపత్రిలో ఉన్న సమయంలో విజయసాయి చెప్పారు. తారకరత్న చనిపోయినప్పుడు కూడా.. ఈ ఇద్దరూ పెద్దమనుషులు అయ్యారు. కార్యక్రమం ముగించారు. పక్కపక్కనే కూర్చొని మాట్లాడటం, ఒకరిని ఒకరు మీడియా సాక్షిగా గౌరవించుకోవడంపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. తారకరత్న మరణమే ఆ ఇద్దరిని దగ్గర చేసిందనే చర్చ ఇప్పటికీ వినిపిస్తుంటుంది అక్కడక్కడ! ఆ తర్వాత నుంచి చంద్రబాబు, లోకేష్‌ పేర్లను కనీసం ఎత్తను కూడా లేదు విజయసాయి. దీంతో అన్నదమ్ములు ఇద్దరూ కలిసిపోయారా అనే అనుమానాలు రాజకీయవర్గాల్లో మొదలయ్యాయ్.
మరోవైపు జగన్‌కు, విజయసాయికి మధ్య గ్యాప్ పెరిగిపోయిందనే చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. పార్టీలో కీలక పదవుల నుంచి విజయసాయిని తప్పించారు జగన్. గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టి.. దాన్ని విజయసాయి సమర్థంగా నడిపించారు. ఐతే ఆ బాధ్యతల నుంచి విజయసాయిని తప్పించారు జగన్. అప్పటి నుంచి పార్టీలో, ప్రభుత్వంలో ఆయనకు ప్రాధాన్యం తగ్గింది. పార్టీ కార్యక్రమాల్లోనూ విజయసాయి పాల్గొన్నట్లు పెద్దగా కనిపించడం లేదు. విజయసాయికి ఢిల్లీ లెవల్‌లో మంచి పరిచయాలు ఉన్నాయి. కేంద్రంలోని పెద్దలతో మంచి సంబంధాలు కొనసాగిస్తుంటారు విజయసాయి. నిజానికి ఇప్పటికీ ఉన్నాయి కూడా!
వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు విషయంలో టెన్షన్‌ పడుతున్న జగన్‌.. బయట స్వామీజీలను లాబీయింగ్‌కు వాడుకుంటున్నారు తప్ప.. విజయసాయిని పట్టించుకోవడం లేదు అనే ఆరోపణలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఇలా ఏ లెక్కన చూసినా.. విజయసాయికి, జగన్‌కు మధ్య దగ్గర చేయలేనంత దూరం పెరిగిందని క్లియర్‌గా అర్థం అవుతోంది. మిత్రుడు అనుకున్న వ్యక్తి ఎలాగూ శత్రువుగా చూస్తున్నారు. అతని శత్రువుకు దగ్గరవడం వల్ల.. తనేంటో ప్రూవ్ చేసుకోవాలని విజయసాయి ప్లాన్ చేశారా.. అందుకే టోన్ మార్చారా.. తన మార్పుతో ఒకరకంగా జగన్‌కు హెచ్చరికలు పంపించారా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోందిప్పుడు!