Vijayasai Reddy: ఓట్ల బదిలీపై విజయసాయిరెడ్డి జోస్యం.. రివర్సయ్యే ఛాన్స్..?!

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో.. రాబోయే ఎన్నికలపై జోస్యం చెప్పారు. ట్విట్టర్ వేదికగా ఆ వివరాలను ఆయన పోస్ట్ చేశారు. ఎన్నికల్లో గెలవబోయే పార్టీ తమదే అని డప్పు కొట్టుకున్న ఆయన ప్రతిపక్షాల స్థితిగతులపై మాత్రం పేలవమైన విశ్లేషణ చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 11, 2023 | 04:44 PMLast Updated on: Aug 11, 2023 | 4:44 PM

Vijayasai Reddys Strategy Wont Work In Upcoming Elections

Vijayasai Reddy: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరగబోతోంది? పార్టీల బలాబలాలు ఎలా మారబోతున్నాయి? అనేది ఇప్పుడే అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఒకవేళ అంచనా వేసే ప్రయత్నం చేసినా.. రిజల్ట్ అదే రీతిలో ఉంటుందని కన్ఫర్మ్‌గా చెప్పలేం. కానీ వృత్తిరీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) అయిన వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో.. రాబోయే ఎన్నికలపై జోస్యం చెప్పారు. ట్విట్టర్ వేదికగా ఆ వివరాలను ఆయన పోస్ట్ చేశారు. ఎన్నికల్లో గెలవబోయే పార్టీ తమదే (వైఎస్సార్‌సీపీ) అని డప్పు కొట్టుకున్న ఆయన ప్రతిపక్షాల స్థితిగతులపై మాత్రం పేలవమైన విశ్లేషణ చేశారు.

ఇందులో బ్యాలెన్స్ అనేది పత్తా లేకుండా పోయింది. “వచ్చే పోల్స్‌లో పోటీ అంతా రెండో స్థానం కోసమేనని నాకు అనిపిస్తోంది. ఇప్పటిదాకా టీడీపీతో ఉన్న వర్గాలు జనసేన వైపునకు, అలాగే జనసేనకు అనుకూలంగా నిలుస్తూ వచ్చిన ఓటర్లు బీజేపీ వైపునకు మొగ్గు చూపే పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 51 శాతం ఓట్ల షేర్‌తో గెలిచే ఛాన్స్ ఉంది. ఏపీలో ప్రతిపక్షాలు 2024 ఎన్నికలను వదిలేసి 2029కి రెడీ అయితే బెటర్” అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏకపక్షంగా ఉన్న ఈ విశ్లేషణ నెటిజన్స్ నుంచి విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంకొందరు మాత్రం ఇది వైసీపీ ఆడిస్తున్న మైండ్ గేమ్ అని మేధావుల్లాగా తమదైన అనాలిసిస్ ఇచ్చారు. ఓట్ల బదిలీ కేవలం టీడీపీ, బీజేపీ, జనసేన మధ్యే జరుగుతుందని విజయసాయి చెప్పినప్పటికీ వైఎస్సార్‌సీపీ నుంచి జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు.
షర్మిల ఎంటర్ అయితే..
త్వరలో తెలంగాణ కాంగ్రెస్‌లో వైఎస్ షర్మిల చేరనున్నారు. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్‌కు కూడా జోష్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఏపీలో కాంగ్రెస్ తరఫున షర్మిల పాదయాత్ర చేస్తే విజయసాయి చెప్పిన లెక్కలు తారుమారయ్యే అవకాశం ఉంటుంది. ఎస్సీ, మైనార్టీ, రెడ్డి వర్గం ఓటర్లలో కొంతమందైనా మరోసారి కాంగ్రెస్ వైపు చూస్తారు. అదే జరిగితే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఫ్యామిలీకి రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుంది. వైఎస్సార్‌సీపీలో అసంతృప్తితో ఉన్న ఎస్సీ, మైనార్టీ, రెడ్డి వర్గానికి చెందిన పలువురు లీడర్స్ మళ్లీ కాంగ్రెస్ దిశగా అడుగులు వేసినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఓట్ల బదిలీ అనేది వైఎస్సాఆర్‌పీ నుంచి కాంగ్రెస్‌కు జరుగుతుంది.
బీజేపీకి ఓట్ల బదిలీ కష్టమే..
వైఎస్సార్‌సీపీ, టీడీపీలతో బీజేపీ ఆడుతున్న డబుల్ గేమ్‌ను ఏపీ ప్రజలు ఇప్పటికే అర్ధం చేసుకున్నారు. ఈ రెండు పార్టీలను రెండు కళ్లలా బీజేపీ కాపాడుకుంటోంది. ఓ వైపు చంద్రబాబు, లోకేష్ సెక్యూరిటీపై ఆరాతీస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు వైఎస్ జగన్ ప్రభుత్వానికి నిధుల కేటాయింపులు స్పీడ్‌గా జరిగేలా చూస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి దూరంగా ఉంటున్న వైఎస్సార్‌సీపీ, టీడీపీలను తమ మిత్రులుగా బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఈనేపథ్యంలో టీడీపీ నుంచి బీజేపీకి ఓట్ల బదిలీ జరిగే అవకాశాలు దాదాపు లేవు. క్షేత్ర స్థాయిలో అంతంత మాత్రంగా క్యాడర్ ఉన్న బీజేపీ.. భారీ క్యాడర్ ఉన్న టీడీపీ నుంచి ఓట్ల బదిలీని సాధించడం అసాధ్యం. పదేపదే అధ్యక్షులు మారుతున్న రాష్ట్ర బీజేపీ ఓట్ల బదిలీ జరిగేంతగా జనాన్ని ప్రభావితం చేయడం కష్టం. పొత్తుల సంగతి ఎలా ఉన్నా ఏపీలో పోటీ అనేది టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్యే ఉంటుంది. ఓ వైపు షర్మిల, మరోవైపు చంద్రబాబు ప్రచారంలో సుడిగాలిలా దూసుకెళ్తే వైఎస్సార్‌సీపీకి ఎదురుగాలి వీచినా ఆశ్చర్యం లేదు. విజయసాయి రెడ్డి జోస్యాన్ని తిరగరాసినా ఆశ్చర్యం లేదు!!