విజయసాయి సీటు కిరణ్ రెడ్డికే..?
ఆంధ్రప్రదేశ్ లో మరో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఇటీవల మూడు స్థానాలకు ఎన్నికలు పూర్తికాగా తాజాగా విజయసాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఎవరిని పంపిస్తారు అనేదానిపై పెద్ద చర్చ జరుగుతుంది. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూటమి పార్టీలు భావిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో మరో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఇటీవల మూడు స్థానాలకు ఎన్నికలు పూర్తికాగా తాజాగా విజయసాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఎవరిని పంపిస్తారు అనేదానిపై పెద్ద చర్చ జరుగుతుంది. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూటమి పార్టీలు భావిస్తున్నాయి. మూడు రాజ్యసభ స్థానాల విషయంలో జనసేన జోక్యం చేసుకోలేదు. దీంతో రెండు స్థానాలు తెలుగుదేశం పార్టీ తీసుకోగా ఒక స్థానాన్ని బిజెపి తీసుకుంది. ఇక ఇప్పుడు విజయసాయిరెడ్డి తో ఖాళీ అయిన స్థానాన్ని ఎవరు తీసుకుంటారు అనే దానిపై స్పష్టత రావటం లేదు.
అయితే దీనిపై చంద్రబాబు మనసులో కొంతమంది పేర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకోకుండా బీజేపీకే ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో తనతో సన్నిహితంగా ఉండే ఒక బీజేపీ నేతకు ఈ సీటును కేటాయించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఆయన కోరినట్లు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ రాజ్యసభ స్థానం కేటాయించాలని చంద్రబాబు కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసి కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు.
ఆయనకు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కూడా ఉండటంతో ఆయన ఖచ్చితంగా పార్లమెంట్లో రాష్ట్రానికి బలం అవుతారని చంద్రబాబు భావిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి.. పీలేరు నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి రాజ్యసభలో ఉంటే కచ్చితంగా తనకు కూడా కలిసి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అయితే కిరణ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని కూడా చంద్రబాబు నాయుడు అప్పట్లో భావించినట్లు వార్తలు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ లో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండటంతో ఒక స్థానానికి కిరణ్ కుమార్ రెడ్డిని మరో స్థానానికి వంగవీటి రాధను ఎంపిక చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశారని మీడియాలో ప్రచారం జరిగింది. కానీ దానిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఇక వంగవీటి రాధకు మంత్రి పదవి కూడా ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ మంత్రి పదవికి జనసేన నుంచి నాగబాబును ఎంపిక చేయడంతో మరో పదవి వంగవీటి రాధకు ఇవ్వాలని చంద్రబాబు భావించారు.
ఇక కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా ఉండటంతో చంద్రబాబు నాయుడు ఆయన ను రాజ్యసభకు పంపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఇక బిజెపి పెద్దలు కూడా ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. అయితే బిజెపి తరఫున తెలంగాణకు చెందిన ఒక కీలక నేత రాజ్యసభ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్యకు బిజెపి రాజ్యసభ స్థానం కేటాయించింది. మరి కిరణ్ కుమార్ రెడ్డి వెళతారా లేదంటే మరో నేతను పంపిస్తారా అనేది చూడాలి.