Vijayashanti: కాంగ్రెస్‌లోకి విజయశాంతి.. ఏం హామీ ఇచ్చారంటే..

ప్రస్తుతం బీజేపీలో ఉన్న విజయశాంతికి.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ దక్కలేదు. చాలాకాలంగా ఆమె పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. మరోవైపు స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితాలోనూ రాములమ్మ పేరు లేకపోవడం కొత్త చర్చకు దారి తీసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 11, 2023 | 06:10 PMLast Updated on: Nov 11, 2023 | 7:34 PM

Vijayashanti Will Quit Bjp And Join Congress Soon

Vijayashanti: అనుకున్నదే జరిగింది.. కాస్త ఆలస్యం అయింది అంతే ! బీజేపీ మీద చాలా రోజులుగా అసంతృప్తితో రగిలిపోతున్న విజయశాంతి.. ఎట్టకేలకు జంపింగ్‌ జపాంగ్ అనేందుకు సిద్ధం అయ్యారు. త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న విజయశాంతికి.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ దక్కలేదు. చాలాకాలంగా ఆమె పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. మరోవైపు స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితాలోనూ రాములమ్మ పేరు లేకపోవడం కొత్త చర్చకు దారి తీసింది.

CM KCR: గజ్వేల్‌లో భారీగా నామినేషన్లు.. కేసీఆర్‌ను ఓడిస్తామంటున్న బాధితులు

ఇలాంటి పరిస్థితుల మధ్య ఆమె.. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యారు. ఆ పార్టీ సీనియర్ నేత, టీపీసీసీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మల్లు రవి.. ఈ విషయాన్ని కన్ఫార్మ్‌ చేశారు కూడా ! సినిమాల్లో యాక్ట్ చేస్తున్న సమయంలో బీజేపీకి విజయశాంతి మద్దతుదారుగా ఉన్నారు. 1996 తమిళనాడు ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేకు.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. దాదాపు దశాబ్దంపాటు బీజేపీలో కొనసాగిన రాములమ్మ.. 2009లో తల్లి తెలంగాణ అనే పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఆ పార్టీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. 2009లోనే మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి నెగ్గారు. కేసీఆర్‌తో విభేదాల వల్ల 2014లో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్‌లో ఆమెకు ఎన్నికల స్టార్‌ క్యాంపెయినర్‌‌గా, టీపీసీసీకి ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారుగా నియమించారు అప్పటి ఏఐసీసీ ప్రెసిడెంట్‌ రాహుల్‌ గాంధీ. 2019లో ప్రధాని మోదీపై ఆమె చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. 2020లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విజయశాంతి.. అదే ఏడాది డిసెంబర్‌లో అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ బీజేపీ నుంచి కాంగ్రెస్‌ గూటికి చేరబోతున్నారు.