Vijayawada YCP: బెజవాడ సెంట్రల్ సీటుపై వైసీపీలో పంచాయతీ
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌కు సెంట్రల్ సీటు కేటాయించినప్పటి నుంచి ఈ రచ్చ మొదలైంది. సెంట్రల్ ఎమ్మెల్యే విష్ణు, ఆయన వర్గం వెలంపల్లికి సహకరించకపోవటం, అదే విషయం ఫిర్యాదుల రూపంలో అధిష్టానానికి వెళ్ళడంతో వర్గపోరు ఓ రేంజ్‌కి చేరింది.
Vijayawada YCP: బెజవాడ సెంట్రల్ సీటుపై పంచాయితీ వైసీపీ అధిష్టానానికి రోజుకో రకమైన ఇబ్బంది తెచ్చిపెడుతోంది. పశ్చిమ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌కు (Vellampally Srinivas) సెంట్రల్ సీటు కేటాయించినప్పటి నుంచి ఈ రచ్చ మొదలైంది. సెంట్రల్ ఎమ్మెల్యే విష్ణు, ఆయన వర్గం వెలంపల్లికి సహకరించకపోవటం, అదే విషయం ఫిర్యాదుల రూపంలో అధిష్టానానికి వెళ్ళడంతో వర్గపోరు ఓ రేంజ్‌కి చేరింది. పార్టీ పెద్దలు రంగంలోకి దిగి విష్ణు, వెల్లంపల్లితో భేటీలు నిర్వహించి కలిసి పనిచేసుకోమని హితబోధ చేశారు. ఆ తర్వాత సెంట్రల్‌లో వెలంపల్లి పార్టీ ఆఫీసు ప్రారంభానికి సజ్జలతోపాటు మల్లాది విష్ణు కూడా హాజరవటంతో అంతా సర్దుకుందనుకున్నారు.
Poonam Pandey: చనిపోవడానికి గంటల ముందు పార్టీ.. కన్నీళ్లు పెట్టిస్తోన్న పూనమ్ చివరి పోస్ట్..
అలా అనుకుని ఊపిరి పీల్చుకునేలోపే సీన్ రివర్స్ అయి.. మేటర్ మొదటికొచ్చిందట. మొదట్లో విష్ణు, ఆయన వర్గం సహకరించకపోవటంతో ఈ విషయాన్ని అధిష్టానానికి చెప్పి ఒంటరిగానైనా పనిచేసుకోడానికి సిద్ధమయ్యారట వెలంపల్లి. అయితే అధిష్టానం రంగంలోకి దిగి ఇద్దరి మధ్యా సర్దుబాటు ప్రయత్నాలు చేయడంతో.. పార్టీ కార్యాలయ ప్రారంభానికి వచ్చారట విష్ణు. ఆ కార్యక్రమంలో భావోద్వేగంతో కంటతడి కూడా పెట్టడంతో అయ్యో అనుకున్నారు అంతా. ఈ కార్యక్రమానికి రావటం ద్వారా వెలంపల్లి కోసం పనిచేయాలని తన వర్గానికి విష్ణు సంకేతాలు ఇచ్చారని కూడా అనుకున్నారు. ఇక అదే సమయంలో ఎన్నికల్లో తనకు పనిచేయటానికి పశ్చిమ నియోజకవర్గం నుంచి తన వర్గం మొత్తాన్ని సెంట్రల్‌కు షిఫ్ట్ చేశారట వెలంపల్లి. ఇప్పటికే సెంట్రల్‌లో 21 డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జిలు ఉన్నా కూడా వారికి ప్రత్యామ్నాయంగా తన వర్గంతో నింపేస్తున్నారట మాజీ మంత్రి. దీంతో.. విష్ణు వర్గీయులు నారాజ్ అవుతూ వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చిందంటున్నారు.
మల్లాది విష్ణుకు టికెట్ లేకపోవటంతో కొంత వరకు నిరాశలో ఉన్న సెంట్రల్ లోని పార్టీ నేతలు, క్యాడర్ వెలంపల్లి వర్గమంతా ఇక్కడకు వచ్చేసి ఆధిపత్యం చేస్తుండటాన్ని ఇంకా అవమానంగా భావిస్తున్నారట. ఓవైపు తమను పనిచేయాలని కోరుతూనే మరోవైపు అనుమానపు చూపులతో వెలంపల్లి తన వర్గానికి కీలక బాధ్యతలు ఇచ్చి తమను డమ్మీలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారన్నది విష్ణు అనుచరుల తాజా ఆరోపణ. దుర్గ గుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఎమ్మెల్సీ రుహుల్లా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి భర్త ఇలా అందరూ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ఒక్కో డివిజన్‌కు ఇన్చార్జ్‌లుగా అనధికారికంగా వ్యవహరిస్తున్నారట. దీంతో పశ్చిమ వాళ్ళు వచ్చి సెంట్రల్‌లో పెత్తనం చేయటం ఏంటంటూ… అందరూ విజయవాడ సిటీలోని వాళ్లే అయినా లోకల్, నాన్ లోకల్ రచ్చ మొదలైందట. వెల్లంపల్లి కూడా పైకి విష్ణుతో విబేధాలు లేవని చెబుతూనే… ఆయన క్యాడర్‌ను నిర్వీర్యం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Thalapathy Vijay: తమిళగ వెట్రి కళగం పేరుతో దళపతి విజయ్ కొత్త పార్టీ..
ఇక విష్ణు కూడా పార్టీ ఆఫీసు ప్రారంభానికి వచ్చారే తప్ప.. మళ్ళీ ఎక్కడా వెలంపల్లితో కలిసి కనిపించలేదు. దీంతో ఇద్దరు నేతల మధ్య గ్యాప్ ఇంకా కొనసాగుతోందనే గుస గుసలు కూడా వినిపిస్తున్నాయి. అదే సమయంలో మాజీ మంత్రి కూడా ఈ రచ్చంతా ఎందుకు.. తిరిగి తనను సొంత నియోజకవర్గం పశ్చిమకు పంపింస్తే బాగుంటుందని సన్నిహితులతో అంటున్నట్టు లోకల్ టాక్. మరి ఈ తాజా పరిణామాలన్నిటినీ మరోసారి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుకుంటారా? లేక కీచులాటలు ఎన్నికలదాకా కొనసాగి నష్టం చేసుకుంటారా అన్నది చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు.