TDP Vs YCP: వినుకొండలో వైసీపీ వర్సెస్ టీడీపీ.. నేతల మధ్య ఘర్షణ.. గాల్లోకి సీఐ కాల్పులు
తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే, అడ్డుకుని అక్రమ కేసులు పెడతారా అని ప్రశ్నిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మరోసారి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఈసారి వైసీపీ నేతలు అడ్డుకున్నారు. వినుకొండ బస్టాండ్ సెంటర్ వద్ద టీడీపీ నేతల్ని వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త తలెత్తి, ఘర్షణకు దారితీసింది.
TDP Vs YCP: ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. ఈ పరిస్థితుల్లో సీఐ గాల్లోకి కాల్పులు జరపడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. వినుకొండ నియోజకవర్గంలో కొంతకాలంగా వైసీపీ నేతల ఆధ్వర్యంలో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, వీటని అరికట్టాలని కోరుతూ టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి.
అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని ఆరోపిస్తూ పోలీసులు.. టీడీపీ నేతల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే, అడ్డుకుని అక్రమ కేసులు పెడతారా అని ప్రశ్నిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మరోసారి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఈసారి వైసీపీ నేతలు అడ్డుకున్నారు. వినుకొండ బస్టాండ్ సెంటర్ వద్ద టీడీపీ నేతల్ని వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త తలెత్తి, ఘర్షణకు దారితీసింది. ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారు దిగి, టీడీపీ నేతలపైకి దూసుకొచ్చారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని, మట్టి తవ్వకంపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు.
దీంతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యేకు సర్దిచెప్పి, ఆయనను అక్కడి నుంచి పంపించివేశారు. అయినప్పటికీ, టీడీపీ-వైసీపీ శ్రేణులు.. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా వీలు పడలేదు. ఈ పరిస్థితుల్లో స్థానిక సీఐ గాల్లోకి కాల్పులు జరిపారు. లాఠీచార్జి కూడా చేశారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అక్కడికి చేరుకున్నారు. తమవారినే పోలీసులు ఇబ్బందిపెడుతున్నారని ఆరోపిస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసులు ఆయనను కూడా అక్కడి నుంచి పంపించివేశారు. ప్రస్తుతం పోలీసులు అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల పెరగకుండా స్థానికంగా ఇంటర్నెట్ నిలిపివేశారు. ఈ ఘటనలో 15 మంది టీడీపీ కార్యకర్తలకు గాయలైనట్లు తెలుస్తోంది.
కొంతకాలంగా ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వర్గం, ఆంజనేయులు వర్గం మధ్య విబేధాలు నడుస్తున్నాయి. కాగా, సీఐ కాల్పులు జరపడం విమర్శలకు తావిస్తోంది. ఆయన తొందరపడ్డారేమో అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.