Vladimir Putin: పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ భేటీ.. ప్రపంచానికి ప్రమాదమా..?
అణు ప్రయోగాలు, క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా అనేక దేశాలకు సవాళ్లు విసురుతోంది. భారీగా ఆయుధాలు సమకూర్చుకుంది. ఇదే సమయంలో యుక్రెయిన్‌పై యుద్ధం వల్ల రష్యా చాలా వరకు ఆయుధాల్ని వినియోగించాల్సి వచ్చింది.
Vladimir Putin: ప్రపంచంలోనే అత్యంత దూకుడైన, ప్రమాదకరమైన నేత కిమ్ జోంగ్ ఉన్. ఉత్తర కొరియా అధ్యక్షుడైన కిమ్.. తన ఆయుధ ప్రయోగాలతో దక్షిణ కొరియా, అమెరికాలాంటి దేశాలనే భయపెడుతుంటాడు. ఇటీవల యుక్రెయిన్‌పై యుద్ధంతో ప్రపంచానికి ముప్పుగా మారారు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్. ఇప్పుడు వీరిద్దరూ కలవబోతుండటం ఆసక్తి కలిగిస్తోంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, రష్యా అధినేత పుతిన్ ఈ నెలలో రష్యాలో భేటీ కానున్నారు. పుతిన్‌తో భేటీ కోసం కిమ్ మాస్కో వెళుతున్నట్లు ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ భేటీలో ఏం చర్చిస్తారనే అంశాలు ప్రపంచానికి ఆసక్తి కలిగిస్తున్నాయి.
అణు ప్రయోగాలు, క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా అనేక దేశాలకు సవాళ్లు విసురుతోంది. భారీగా ఆయుధాలు సమకూర్చుకుంది. ఇదే సమయంలో యుక్రెయిన్‌పై యుద్ధం వల్ల రష్యా చాలా వరకు ఆయుధాల్ని వినియోగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రష్యాకు అవసరమైన ఆయుధాల్ని కిమ్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపైనే ఇరు దేశాధినేతలు చర్చలు జరుపుతారు. భారీ భద్రత ఉండే రైలులో కిమ్ రష్యాకు వెళ్లనున్నారు. అయితే, ఎక్కడ చర్చలు జరుపుతారు అనే అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇప్పటికే ఆయుధాలు సరఫరా చేసే అంశంపై ఇరు దేశాల మధ్య చర్చలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ విషయాన్ని అమెరికా వర్గాలు కూడా ధృవీకరించాయి. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఇటీవల ఉత్తర కొరియా వెళ్లారు. ఈ సమయంలో తమకు అవసరమైన ఫిరంగి మందుగుండు సామాగ్రిని అమ్మాల్సిందిగా ఆయన ఉత్తర కొరియాను కోరారు. రష్యాకు ప్రస్తుతం 122 ఎంఎం, 152 ఎంఎం షెల్స్ కావాల్సి ఉంది.
యుక్రెయిన్‌పై యుద్ధం కారణంగా వీటి నిల్వలు ఆ దేశంలో అడుగంటిపోయాయి. ఇతర దేశాలు అమెరికాను ఎదిరించి, రష్యాకు ఆయుధాలు సరఫరా చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అమెరికాను ఎదిరించే ఉత్తర కొరియా మాత్రమే తమకు మందుగుండు ఇవ్వగలదని రష్యా భావిస్తోంది. అందువల్లే ఉత్తర కొరియాకు ప్రతిపాదనలు పంపింది. అయితే, ఉత్తర కొరియా దగ్గర మందుగుండు సామాగ్రి నిల్వలు ఏ మేరకు ఉన్నాయో గుర్తించడం కష్టం. ఎందుకంటే ఆయుధాలు, మందుగుండు సామాగ్రి నిల్వల విషయంలో ఉత్తర కొరియా చాలా రహస్యంగా వ్యవహరిస్తుంటుంది. ఉత్తర కొరియా దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయో కూడా ప్రపంచానికి తెలియదు. గత జూలైలో జరిగిన ఒక సమావేశంలో ఆయుధాలను ప్రదర్శించారు. దీనిలో హ్వాసాంగ్ ఖండాతర బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. మరిన్ని ప్రమాదకర ఆయుధాలు కిమ్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. రష్యాకు కిమ్ ఇవ్వబోయేది మందుగుండు సామగ్రియేనా.. లేక ఇంకేమైనా ఆయుధాల్ని కూడా విక్రయిస్తాడా అనే ఆసక్తి నెలకొంది. పుతిన్-కిమ్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.