ASSEMBLY ELECTIONS: తెలంగాణలో ఇక నోట్ల జాతర.. ఓటుకు నోటు ఎక్కడ ఎక్కువంటే..!

తెలంగాణలో 2018లో.. ఆ తర్వాత వచ్చిన ఉపఎన్నికల్లో ఓటుకు నోటు ఖర్చు బాగానే పెంచేశాయి అన్ని రాజకీయ పార్టీలు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో రూ.700 కోట్లకు పైగా ఖర్చయినట్టు తెలుస్తోంది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటుకు 5 వేల నుంచి 10 వేల దాకా పలికింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 27, 2023 | 07:14 PMLast Updated on: Nov 27, 2023 | 7:14 PM

Vote For Note And Liquor Are Raising In Telangana Assembly Elections

ASSEMBLY ELECTIONS: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే టైమ్ ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టిపెట్టారు. ఎన్నికల కమిషన్ పకడ్బందీగా ఎన్ని ఏర్పాట్లు చేసినా డబ్బులు, మద్యం పంపిణీకి సీక్రెట్‌గా ఏర్పాట్లు జరిగిపోయాయి. చాలా గ్రామాల్లో ఇప్పటికే ఇవి తరలిపోయాయి. ఓటుకు ఎన్ని నోట్లు ఇస్తున్నారనేది ఆయా నియోజకవర్గాల్లో నిలబడ్డ అభ్యర్థుల సామర్థ్యాన్ని బట్టి ఉంటోంది. కరీంనగర్, వేములవాడ, మునుగోడు, ములుగుతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం మొత్తమ్మీద 20 వేల కోట్ల రూపాయలు పంపిణీ జరగవచ్చని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి టైమ్ అయిపోతుండటంతో.. పోలింగ్‌కు ముందు రెండు రోజులపాటు అనుసరించాల్సిన వ్యూహంపై అందరు అభ్యర్థులు దృష్టిపెట్టారు.

TELANGANA CONGRESS: హరీష్ రావు మైండ్ బ్లాక్ అయింది.. బీఆర్ఎస్‌ది తప్పుడు ప్రచారం: కాంగ్రెస్ నేతలు

తెలంగాణలో 2018లో.. ఆ తర్వాత వచ్చిన ఉపఎన్నికల్లో ఓటుకు నోటు ఖర్చు బాగానే పెంచేశాయి అన్ని రాజకీయ పార్టీలు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో రూ.700 కోట్లకు పైగా ఖర్చయినట్టు తెలుస్తోంది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటుకు 5 వేల నుంచి 10 వేల దాకా పలికింది. ఇక్కడ దాదాపు రూ.600 కోట్లు ఖర్చు చేశారని అంటున్నారు. ఇప్పుడు కూడా అదే స్థాయిలో డబ్బుల పంపిణీ ఉండవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో జనరల్ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనే భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు 5 వేల దాకా ఇస్తారని ప్రచారం జరుగుతోంది. చాలా చోట్ల ఓటు విలువ రూ.2వేల నుంచి 3 వేల దాకా కొనసాగుతున్నట్టు సమాచారం. డబ్బుతో పాటు మద్యం పంపిణీ కూడా భారీగానే ఉంటోంది. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు దాదాపు లక్ష మంది ఓటర్లకు డబ్బు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు, పోలీసుల తనిఖీలు అంతంతమాత్రంగానే ఉన్నాయని అంటున్నారు.

Priyanka Gandhi: కేసీఆర్ మళ్లీ గెలిస్తే మీ భూములు మాయం.. ఉద్యోగాలు నిల్: ప్రియాంకా గాంధీ

ప్రచారం కంటే కూడా పోల్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యం. అధికార పార్టీ అభ్యర్థులైతే ముందు నుంచే పోల్ మేనేజ్‌మెంట్‌పై గట్టిగా దృష్టిపెట్టారు. బూత్ స్థాయిలో ప్రతి 100 మందికి ఇద్దరు, ముగ్గురు లీడర్లు ఈ పంపిణీ బాధ్యతను చూస్తున్నట్టు చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు డబ్బులు పంచాక ఓటర్లతో ప్రమాణాలు చేయించుకుంటున్నారని సమాచారం. ఎన్నికలకు ముందే వందల కోట్ల రూపాయలు తెలంగాణలో పట్టుబడ్డాయి. కానీ ఇందులో చాలా తక్కువ మొత్తంలోనే రాజకీయ నాయకుల సొమ్ము ఉందనీ.. ఎక్కువగా సామాన్యులు, వ్యాపారుల డబ్బులే ఉన్నాయంటున్నారు. రాష్ట్రంలో కరీంనగర్, వేములవాడ, మునుగోడు, పాలేరు, ఖమ్మంతో పాటు హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లోనూ ఓటుకు నోటు రేటు భారీగా పలికే ఛాన్సుంది. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో కలిపి 15 నుంచి 20 వేల కోట్ల రూపాయల దాకా అభ్యర్థులు ఖర్చుపెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈసారి దేశంలోనే తెలంగాణ ఎన్నికలు కాస్ట్‌లీగా మారతాయని విశ్లేషకులు చెబుతున్నారు. మునుగోడులో అయితే.. పోలింగ్ టైమ్ ముగిసే చివరి అరగంటలో కొందరు ఓటర్లు డిమాండ్ చేసి మరీ డబ్బులు తీసుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.

రోడ్డు మీద ధర్నాలు కూడా చేసిన సంఘటనలు జరిగాయి. భారీగా డబ్బులు పంచుతున్నట్టు సీవిజిల్ ద్వారా ఫిర్యాదులు అందుతుండటంతో.. ఎన్నికల అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏ చిన్న సమాచారం అందినా వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. కానీ అవి నామినల్‌గా చేసే తనిఖీలే అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఈ మూడు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. దాంతో దేశంలోనే ఇవి ఖరీదైనవిగా మారే అవకాశం ఉందంటున్నారు. నోట్లు, మద్యానికి ఆశపడి.. ఓట్లు వేయొద్దని ప్రజాసంఘాలు, పౌర సమాజం, ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నారు.