Vladimir Putin: పుతిన్.. ఇక నీ పని గోవిందా.. వాగ్నర్ గ్రూప్ తర్వాత ప్రజలే తిరగబడతారు.. కాస్కో..!
ప్రస్తుతం పుతిన్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. యుక్రెయిన్ యుద్ధం మొదలై ఇవాళ్టికి సరిగ్గా 16నెలలు. ఇప్పటివరకు జెలెన్‌స్కీ సేనలపై పుతిన్ బలగాలు ఆధిపత్యం చూపించలేకపోయాయి. అదే సమయంలో సొంతింటిలోనే పుతిన్‌కి సెగ మొదలైంది.

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆధిపత్యానికి టైమ్ దగ్గర పడిందా..? రేపు కాకపోతే ఎల్లుండైనా దుకాణం సర్దుకోవాల్సిందేనా..? పుతిన్‌పై వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ఇదే విషయాన్ని చెబుతోందా..?
రాజకీయాల్లోనూ, దేశాధినేతల్లోనూ మంచోళ్ళు, చెడ్డోళ్ళు అని ఎవరూ ఉండరు. పవర్‌ఫుల్-పవర్‌లెస్ మాత్రమే ఉంటారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని ప్రపంచంలోనే శక్తివంతమైన అధినేతల్లో ఒకరిగా చెబుతుంటారు. అంటే ఎంత నియంతలా ఉంటే అంత శక్తివంతం కావొచ్చు. ఆ పవర్‌ఫుల్ వర్డ్ వెనుక అర్థం, పరమార్థం అదే కావొచ్చు. అయితే ఎంతటి శక్తివంతుడైనా ఏదో ఇక రోజు ఓడిపోతాడు. తలవంచుతాడు. హిట్లర్ కావొచ్చు.. ఇంకెవరైనా కావొచ్చు.. ప్రజలు తిరుగుబాటు చేసే వరకే వాళ్ల పెత్తనం. ఒక్కసారి ప్రజలు తిరగబడితే శ్రీలంకలో రాజపక్సే కుటుంబానికి పట్టిన గతే పడుతుంది. ప్రస్తుతం పుతిన్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. యుక్రెయిన్ యుద్ధం మొదలై ఇవాళ్టికి సరిగ్గా 16నెలలు. ఇప్పటివరకు జెలెన్‌స్కీ సేనలపై పుతిన్ బలగాలు ఆధిపత్యం చూపించలేకపోయాయి.
అదే సమయంలో సొంతింటిలోనే పుతిన్‌కి సెగ మొదలైంది. రష్యా ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ తిరుగుబావుటా ఎగరేసింది. రెండు కీలకమైన రష్యా నగరాలను తమ ఆధీనంలోకి తీసుకుంది.
పుతిన్‌పై తిరుగుబాటు అంటే అది చిన్న విషయం కాదు. సాధారణంగా ఏ దేశంలోనైనా పాలించేవారి (ప్రెసిడెంట్ లేదా ప్రైమ్ మినిస్టర్)పై కొన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తులు ఉంటాయి. అది సహజమే. అయితే.. ఇక భరించలేం బాబోయ్ అనుకున్నప్పుడే ప్రజలు రోడ్లెక్కుతారు. రష్యాలోనూ అదే చేస్తారు. అలా ప్రజలు తిరుగుబాటు చేసిన ప్రతిసారీ తీవ్రంగా దెబ్బలు తింటారు. ఆడవాళ్లు, వృద్ధులు అని ఏ మాత్రం భేదం చూపని రష్యా పోలీసులు పుతిన్ కోసం దొరికినవారిని దొరికినట్టు చావు దెబ్బలు కొడతారు. అటు మిలిటరీ సంగతి సరే సరి. పుతిన్ కోసం ప్రాణాలిచ్చే సైన్యమది. ఇదంతా పుతిన్‌పై ప్రేమతో కాదు.. భయంతో..! కానీ అందరూ అలానే భయపడతారని పుతిన్ అనుకుంటే ఆయన పిజ్జాపై కాలేసినట్టే.
వాగ్నర్ గ్రూప్ అని రష్యాలో ఒక ప్రైవేట్ గ్రూప్ ఉంది. ఈ గ్రూప్‌లో మొత్తం 50 వేల మంది వరకూ ఫైటర్లుంటారు. తూర్పు యుక్రెయిన్‌లో రష్యా అనుకూల, వేర్పాటువాదులకు మద్దతిచ్చే గ్రూప్ ఇది. రష్యా స్పెషల్ ఫోర్సెస్‌కు చెందిన మాజీలు ఈ గ్రూప్‌లో ఎక్కువగా ఉంటారు. ఇప్పుడిదే గ్రూప్ పుతిన్‌తో తాడోపెడో తేల్చుకుంటానంటోంది. పలు నగరాలను తమ గుప్పిట్లో పెట్టుకుంటోంది. ఇప్పటి వరకు రెండు నగరాలు వాగ్నర్ అండర్‌లోకి వెళ్లినట్టు సమాచారం. ఈ దెబ్బతో పుతిన్‌కి భయం పట్టుకుంది. మీడియా ముందుకొచ్చి వాగ్నర్ గ్రూప్‌పై మండిపడ్డారు. ఇది దేశద్రోహమంటూ, వాగ్నర్ గ్రూప్ అంతు చూస్తానంటూ హెచ్చరించారు. పుతిన్ ఇలా మాట్లాడారో లేదో.. రష్యా ఆర్మీ అలా రంగంలోకి దిగిపోయింది. ప్రస్తుతం వాగ్నర్ గ్రూప్ కోసం భారీగా బలగాలను మోహరించింది. చాలా నగరాల వీధుల్లో ఆర్మీ ట్రక్కులు చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు..!