Private Military Companies: రక్తపాతం సృష్టిస్తున్న ప్రైవేట్ సైన్యాలు..! ప్రపంచానికి కిరాయి సైనికులతో పనేంటి ?
యుద్ధంలో పాల్గొంటున్న దేశాలు ఒక్కోసారి ఆ పనిని ఒంటరిగా చేయలేవు. మిత్ర దేశాల మద్దతు తీసుకున్నా అంతకు మించిన యుద్ధ అవసరాలు చాలానే ఉంటాయి. అలాంటి అవసరాలను తీర్చడానికే పుట్టుకొచ్చాయి ప్రైవేటు సైన్యాలు. ప్రైవేటు మిలిటరీ కంపెనీలుగా ఇవి తమను తాము ప్రకటించుకుంటాయి.
Private Military Companies: ఘర్షణ హింసాత్మకంగా మారి యుద్ధానికి దారితీసినప్పుడు సైన్యం ఆయుధాలు ఎక్కుపెడుతుంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రపంచంలోని అన్ని దేశాలు యుద్ధంతో కలిసి ప్రయాణం చేస్తున్నవే. యుద్ధం అనివార్యంగా మారినప్పుడు సైనిక అవసరాలు కూడా పెరిగిపోతాయి. ప్రత్యర్థి దేశాలపై విజయం సాధించాలంటే యుద్ధ క్షేత్రంలో బలమైన బలగం పోరాటానికి దిగాలి. యుద్ధంలో పాల్గొంటున్న దేశాలు ఒక్కోసారి ఆ పనిని ఒంటరిగా చేయలేవు. మిత్ర దేశాల మద్దతు తీసుకున్నా అంతకు మించిన యుద్ధ అవసరాలు చాలానే ఉంటాయి. అలాంటి అవసరాలను తీర్చడానికే పుట్టుకొచ్చాయి ప్రైవేటు సైన్యాలు. ప్రైవేటు మిలిటరీ కంపెనీలుగా ఇవి తమను తాము ప్రకటించుకుంటాయి. వీటి అస్థిత్వం ఉన్న చోట.. ప్రైవేటు మిలిటరీ కంపెనీలు సాగిస్తున్న వ్యవహారాలు చూస్తుంటే వీటిని సైన్యం అనే కంటే కరుడుగట్టిన కిరాయి మూకలు అనడం సబబుగా ఉంటుంది.
వాగ్నర్ ఒక్కటే కాదు.. ఇలాంటివి చాలానే ఉన్నాయ్
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు వాగ్నర్ గ్రూప్. పుతిన్ పాలుపోసి పెంచిన ఒక ప్రైవేటు సైనిక ముఠా ఇది. నిన్న మొన్నటి వరకు పుతిన్ చేతిలో కీలుబొమ్మగా ఉన్న వాగ్నర్ గ్రూప్ ఒక్కసారిగా రష్యా మిలిటరీపైనే ఎదురుతిరిగింది. ఎదుటివ్యక్తిని కాల్చి చంపడంలోనే ఆనందం వెతుక్కునే నరరూప రాక్షసులైన దాదాపు 50వేల మంది ప్రైవేటు సైనికులతో వాగ్నర్‌ను నడుపుతున్న ప్రిగోజిన్.. చివరకు పుతిన్ భవిష్యత్తుకే ఎసరుపెట్టే స్థాయికి ఎదిగిపోయారు. బెరాలస్ మధ్యవర్తిత్వం వహించకపోయి ఉండకపోతే.. రష్యా సివిల్ వార్‌లో చిక్కుకుపోయేది. పుతిన్ ఆదేశాలతో రష్యా సైనికులకు మద్దతుగా ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలుపెట్టిన వాగ్నర్ కిరాయి సైనికులు.. ఆ దేశంలో సృష్టించిన రక్తపాతం అంతా ఇంతా కాదు. మానం, అభిమానం, కరుణ, ప్రేమ, దయవంటివి కిరాయి మూకలకు ఉండవు. అవతలి వ్యక్తులను లోబరచుకోవడానికి, పైచేయి సాధించడానికి కిరాయి సైన్యం అత్యంత అనాగరికంగా వ్యవహరిస్తోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా ఇప్పుడు వాగ్నర్ గురించి చర్చ జరుగుతున్నా ఇలాంటి ప్రైవేటు సైన్యాలు ప్రపంచ వ్యాప్తంగా చాలానే ఉన్నాయి. యుద్ధ క్షేత్రాల్లో ఇవి సమాంతర శక్తులుగా మారి అరాచకాలు సృష్టిస్తూ ఉంటాయి.
బ్లాక్‌వాటర్ అలియాస్ అకాడమీ
వాగ్నర్ గ్రూప్‌ను మించిన శక్తివంతమైన ప్రైవేటు సైన్యం ఇది. ప్రపంచంలోనే అత్యాధునికమైన మిలిటరీ యూనిట్‌గా దీనికి పేరుంది. ఇరాక్ యుద్ధ సమయంలో అమెరికా నుంచి కాంట్రాక్ట్ తీసుకున్న ఈ సంస్థ ఇరాక్ ప్రజల ప్రాణాలతో ఆడుకుంది. యుద్ధంలో అమెరికా అధికారులకు, సైనికులకు రక్షణగా ఉండే పేరుతో ఇరాక్‌లో అడుగుపెట్టి చివరకు మారణహోమం సృష్టించింది. 2007లో జరిగిన నిసార్ స్క్వేర్ మారణహోమమే దీనికి పెద్ద ఉదాహరణ. అమెరికా రాయబార కార్యాలయ కాన్వాయ్‌కి ఎస్కార్ట్ వాహనంగా వచ్చిన బ్లాక్‌వాటర్ కిరాయి మూకలు 20 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్నారు. అమెరికాతో పాటు వివిధ దేశాల నుంచి బిలియన్ డాలర్లలో కాంట్రాక్టులు పొందుతున్న బ్లాక్‌వాటర్ అలియాస్ అకాడమీ కంపెనీ… ఉక్రెయిన్ యుద్ధంలో కూడా సీక్రెట్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. నాటో దళాలు నేరుగా యుద్ధంలో పాల్గొనే అవకాశం లేకపోవడంతో నాటో దేశాల తరపున రహస్యంగా ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటోంది. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో ఎవరు కిరాయి మూకలో, ఎవరు నిజమైన సైనికులో చెప్పలేని పరిస్థితుల్లో ప్రైవేట్ సైన్యం వ్యాపించింది.
డిఫైన్ ఇంటర్నేషనల్ ముసుగులో మరో కిరాయి దళం
పెరూ కేంద్రంగా పనిచేస్తున్న మరో ప్రైవేటు సైన్యం పేరు డిఫైన్ ఇంటర్నేషనల్. లాజిస్టిక్స్, భద్రతతో పాటు అనేక అంశాల్లో ఇది ప్రపంచవ్యాప్తంగా తన సర్వీసులను అందిస్తోంది. బ్లాక్‌వాటర్‌తో పాటు అమెరికా యుద్ధంలో కూడా ఇది పాల్గొంది. దుబాయ్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, ఇరాక్‌లో బ్రాంచీలు ఓపెన్ చేసిన డిఫైన్ ఇంటర్నేషనల్.. వివిధ దేశాల అవసరాల కోసం సైనికులను సరఫరా చేస్తుంది. ప్రొఫెషనల్ సైనికుల కంటే వీళ్లు చాలా కఠినంగా ఉంటారు. బుల్లెట్లు దించడానికి ఏమాత్రం ఆలోచించరు.
ఏజీస్ డిఫెన్స్ సర్వీసెస్
స్కాట్‌లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ఏజిస్ డిఫెన్స్ సర్వీసెస్ అనే ఈ రిస్క్ మేనేజ్‌మెంట్ కంపెనీ 60 దేశాల్లో ప్రైవేటు సైనిక కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అమెరికాతో పాటు అనేక దేశాలకు చెందిన సంస్థలకు ఇది సైనిక సేవలు అందిస్తోంది. వ్యక్తులకు, వ్యవస్థలకు భద్రత కల్పించడంతో పాటు కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ కూడా ఇది నిర్వహిస్తోంది. ఇలాంటివి ఇంకా పది పదిహేను ప్రైవేటు మిలిటరీ సంస్థలు ఉన్నాయి.
ప్రైవేటు సైన్యాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
వ్యక్తులు, వ్యవస్థల కోసం భద్రత కల్పించేందుకు సెక్యూరిటీ సర్వీసులు నెలకొల్పడం సర్పసాధారణ విషయం. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి వేలాదిగా ఉంటాయి. భద్రతాపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వచ్చినప్పుడు ప్రముఖ వ్యక్తులు ప్రైవేటు సెక్యూరిటీలపై ఆధారపడతారు. కానీ.. ప్రభుత్వాలే ప్రైవేటు సంస్థలపై ఆధారపడే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అంతేకాదు రెండు దేశాల మధ్య జరిగే యుద్ధాల్లో నేరుగా పాల్గొనేస్థాయికి ప్రైవేటు కిరాయి సైన్యాలు ఎదిగిపోయాయి. ఇదే ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టిస్తోంది.
ప్రైవేటు మిలిటరీ వేనుక వేలకోట్ల వ్యాపారం
ప్రైవేట్ మిలిటరీ ఫోర్స్ అన్నది ప్రపంచవ్యాప్తంగా అది పెద్ద బిజినెస్ ఫోర్స్‌గా మారిపోయింది. అమెరికా, రష్యాతో పాటు వివిధ దేశాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రైవేటు మిలిటరీ సంస్థలను ప్రోత్సహిస్తున్నాయి. వివిధ దేశాల డిఫెన్స్ బడ్జెట్ల నుంచి ప్రైవేటు మిలిటరీ కంపెనీలకు బిలియన్ డాలర్ల సొమ్ము జమవుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సహకారంతో వాగ్నర్ గ్రూప్ ఆఫ్రికా దేశాలపై పడగ వేస్తే.. ఇలాంటి ఎన్నో ప్రైవేటు మిలిటరీ కంపెనీలు ఎన్నో దేశాల్లో మనుగడ సాధిస్తున్నాయి. యెమెన్, సిరియా, ఇరాక్, నైజీరియా, సూడాన్ దేశాల్లో ఇటీవలి కాలంలో ప్రైవేటు మిలటరీ సంస్థలు రెచ్చిపోతున్నాయి. ఏదేశంలో అంతర్గత సంఘర్షణలు జరిగినా.. అక్కడ అమెరికా, రష్యా ఎంట్రీ ఇస్తాయి. స్థానిక సంక్షోభ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని తమ పబ్బం గడుపుకుంటాయి. తమ ప్రయోజనాలకు అనుగుణంగా అవసరమైతే అక్కడి సైన్యంతో చేతులు కలపడం లేదా వేర్పాటువాద సంస్థలను ఎగదోయడం, ఆ తర్వాత వాగ్నర్, బ్లాక్‌వాటర్ లాంటి ప్రైవేటు సైన్యాన్ని రంగంలోకి దించడం.. ఇలా విదేశాల్లో కూడా ప్రైవేటు సైన్యాన్ని అడ్డుం పెట్టుకుంటున్నాయి అమెరికా, రష్యా లాంటి అగ్రదేశాలు. వేర్పాటువాదుల చేతుల్లోకి వెళ్లిపోయిన సహజ వనరులను కాపాడుకునేందుకు సిరియా లాంటి దేశాలు ప్రైవేటు సైన్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఆయిల్ గనులను ఆక్రమించుకున్న మిలిటెంట్లతో పోరాడిన ప్రైవేటు సైనికులకు సిరియా రివార్డులు ఇస్తోంది. యెమెన్‌లో ఇరాన్ మద్దతుతో నడుస్తున్న హౌతీ మిలిటెంట్లపై పోరాటం చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రహస్యంగా ప్రైవేటు సైన్యాన్ని ఆదేశానికి పంపింది. ఇలా అనేక దేశాలు ప్రైవేటు సైన్యంపై ఆధారపడుతున్నాయి.
ప్రైవేటు సైన్యంలో చేరుతున్నది ఎవరు ?
దేశం మీద అభిమానంతో సైన్యంలో చేరి ప్రాణాలకు తెగించి పోరాటం చేయడం, శత్రువులను సంహరించడంలో అవసరమైతే ప్రాణత్యాగాలకు సిద్ధపడటం.. ఇవన్నీ దేశంపై ఉన్న ప్రేమను సూచిస్తాయి. కానీ కిరాయి సైన్యంలో సైనికులుగా చేరేవాళ్లకు ఇలాంటి లక్షణాలు ఏమీ ఉండవు. జేబు దొంగలు, హత్యలు, మానభంగాలు చేసి జైలు శిక్ష అనుభవించిన వాళ్లు, జీవితంపై విరక్తి చెందిన వాళ్లు, గతంలో సైన్యంలో పనిచేసి బయటకు వచ్చేసిన వాళ్లు ఇలా అనేక మంది ప్రైవేటు సైన్యంలో చేరుతూ ఉంటారు. వీళ్ల జీవితాలకు ఏమాత్రం విలువుండదు. కానీ వీళ్లను రిక్రూట్ చేసుకునే సంస్థలు వీళ్లకు బాగా జీతాలు చెల్లిస్తాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రైవేటు సైన్యంలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. కిరాయి సైన్యాన్ని సృష్టించడం, సెక్యూరిటీ పేరుతో వాళ్లను వివిధ ప్రాంతాలకు తరలించడం.. ఇవి మాత్రమే బయటకు కనిపిస్తాయి. కానీ వాగ్నర్ గ్రూప్ తరహాలో ప్రైవేటు సైన్యం యుద్ధ నేరాలకు పాల్పడుతూ రక్తాన్ని అంటించుకుంటున్నాయి.