Wagner Group: వెనుదిరిగిన వాగ్నర్ సేన.. రష్యాలో ముగిసిన అంతర్యుద్దం.. అంతా డ్రామాయేనా..?
అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అత్యంత నమ్మకస్తుడైన ప్రిగోరిన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రైవేటు సైన్యమే వాగ్నర్ గ్రూప్. దీన్ని తయారు చేసింది కూడా పుతినే. అయితే, తాజాగా ప్రిగోరిన్ తన వాగ్నర్ సైన్యంతో రష్యా సైన్యంపై తిరుగుబాటు ప్రకటించారు.
Wagner Group: ప్రపంచాన్ని కలవరపెట్టిన రష్యా అంతర్యుద్ధం ముగిసింది. వాగ్నర్ సైన్యానికి, రష్యా సైన్యానికి మధ్య పోరు తప్పదని అంతా భావించారు. అయితే, తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోరిన్ ప్రకటించారు. దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఓకే చెప్పారు. దీంతో సంక్షోభం ముగిసింది.
రెండు, మూడు రోజులుగా ప్రపంచాన్ని కుదిపేసిన అంశం రష్యాలో వాగ్నర్ సైన్యం తిరుగుబాటు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అత్యంత నమ్మకస్తుడైన ప్రిగోరిన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రైవేటు సైన్యమే వాగ్నర్ గ్రూప్. దీన్ని తయారు చేసింది కూడా పుతినే. అయితే, తాజాగా ప్రిగోరిన్ తన వాగ్నర్ సైన్యంతో రష్యా సైన్యంపై తిరుగుబాటు ప్రకటించారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైన్యానికి, వాగ్నర్ గ్రూప్‌నకు మధ్య తలెత్తిన విబేధాలే ఈ తిరుగుబాటకు కారణమని ప్రిగోరిన్ అన్నారు. ప్రిగోరిన్ నిర్ణయం పుతిన్‌కు షాకిచ్చింది. తన దేశాన్ని కాపాడుకునేందుకు ఏమైనా చేస్తానని పుతిన్ ప్రకటించారు. వాగ్నర్ సైన్యం తమ చర్యలు ఆపేయాలని సూచించారు. ఈ విషయంలో పుతిన్-ప్రిగోరిన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో పరిస్థితి చేయిదాటిపోయే అవకాశం ఉందనుకున్నారు. రష్యాలో సైన్యానికి, వాగ్నర్ గ్రూప్ సైన్యానికి మధ్య పోరు తప్పదేమో అనుకున్నారు. దీనికి తగ్గట్లుగానే అనేక రష్యన్ నగరాల్ని వాగ్నర్ గ్రూప్ కైవసం చేసుకుంది. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం ఆదేశించింది. నగరాల్లో రష్యా సైన్యం మోహరించింది. వాగ్నర్ గ్రూపును ఎదుర్కొనేందుకు సైన్యం అన్నిరకాలుగా సిద్ధమైంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో పుతిన్ మాస్కోను వీడి బంకర్లలోకి వెళ్లాడనే ప్రచారం కూడా జరిగింది. ఇంకేం.. రష్యాలో అంతర్యుద్ధం, రక్తపాతం తప్పదేమో అనుకున్నారు.
సంధి కుదిర్చిన బెలారస్ అధ్యక్షుడు
రష్యా సైన్యానికి, వాగ్నర్ గ్రూప్‌నకు మధ్య సంధి కుదిర్చేందుకు బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో ముందుకు వచ్చారు. ఉద్రిక్తతలు తగ్గించేలా రాజీ ఫార్ములా ప్రతిపాదించారు. ఇరువైపులా బలగాలను నిలువరించాలని కోరారు. దీనికి టెలిగ్రామ్ ద్వారా ప్రిగోరిన్ స్పందించారు. రష్యాలో రక్తపాతం చిందకూడదనే తమ నిర్ణయంలో భాగంగా వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించారు. సైన్యాన్ని తిరిగి వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. తమ సైన్యం తిరిగి సరిహద్దులోని స్థావరాలవద్దకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ప్రిగోరిన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి పుతిన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా ఉన్నాయి. వాగ్నర్ గ్రూపునకు భద్రతాపరమైన హామీలు ఇవ్వడం వల్లే సైన్యం వెనక్కి తగ్గింది. ప్రభుత్వం కూడా ప్రిగోరిన్‌పై పెట్టిన కేసులను ఎత్తివేసింది. అలాగే తిరుగుబాటు చేసిన వాగ్నర్ సైన్యంపై కూడా ఎలాంటి కేసులూ ఉండవని ప్రకటించింది. అయితే, ఈ లోపు పలుచోట్ల వాగ్నర్ గ్రూపుపై రష్యా సైన్యం దాడులు చేసింది. రష్యాలో భారీ అంతర్యుద్ధం తప్పదని భావించిన ప్రపంచానికి ఈ పరిణామం కూడా షాక్‌కు గురిచేసింది.
అంతా డ్రామాయేనా..?
మరోవైపు వాగ్నర్ సైన్యం, రష్యన్ సైన్యం మధ్య గొడవ అంతా పెద్ద డ్రామా అయ్యుండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాలా ఉద్రిక్తంగా మారుతున్నట్లు కనిపించిన పరిస్థితి ఉన్నట్లుండి మారిపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు తిరుగుబాటు చేసిన వాగ్నర్ సైన్యానికి అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆర్థిక సాయం చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రపంచాన్ని బురిడీ కొట్టించేందుకే పుతిన్, ప్రిగోరిన్ కలిసి తిరుగుబాటు నాటకానికి తెరతీసి ఉండచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.