Undi TDP: ఉండిలో రాజుల మధ్య రసవత్తర పోరు.. రఘురామ త్యాగం చేయాల్సిందేనా !
తానే బరిలో ఉంటానని సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు పట్టుదలతో కనిపిస్తుంటే.. అవసరం అయితే రెబెల్‌గా బరిలోకి దిగుతానని శివరామరాజు.. చంద్రబాబు హామీతో టికెట్ తనదే అనే ధీమాతో రఘురామ రాజు.. ఇలా ముగ్గురు రాజులు ఉండి మీద పట్టిన పట్టు వీడకుండా ఉన్నారు.
Undi TDP: ఉండి.. టీడీపీకి కంచుకోట. 1983 నుంచి ఇప్పటివరకు అక్కడ టీడీపీ హవానే కొనసాగుతోంది. 2004లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. గత ఎన్నికల్లో జగన్ హవాలోనూ.. ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. రాజులకు కేరాఫ్ అయిన ఉండి అసెంబ్లీపై ముగ్గురు రాజులు కన్నేశారు. తానే బరిలో ఉంటానని సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు పట్టుదలతో కనిపిస్తుంటే.. అవసరం అయితే రెబెల్‌గా బరిలోకి దిగుతానని శివరామరాజు.. చంద్రబాబు హామీతో టికెట్ తనదే అనే ధీమాతో రఘురామ రాజు.. ఇలా ముగ్గురు రాజులు ఉండి మీద పట్టిన పట్టు వీడకుండా ఉన్నారు.
CHANDRABABU NAIDU: వాలంటీర్లపై చంద్రబాబుది సవతి తల్లి ప్రేమా..?
ముగ్గురిలో ఎవరికి హ్యాండ్ ఇచ్చినా.. సీన్ అంతా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఉండి స్థానంపై ఇప్పుడు ప్రతీ ఒక్కరి ఆసక్తి కనిపిస్తోంది. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును.. అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ. ఐతే తానే పోటీలో ఉంటానని చివరి వరకు ప్రయత్నించిన శివరామరాజు.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నారు. ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. ఇద్దరి రచ్చ సరిపోదు అన్నట్లు రామరాజును మార్చి.. నరసాపురం ఎంపీ రఘురామ రాజును అభ్యర్థిగా ప్రకటించేందుకు చంద్రబాబు సిద్ధం అవుతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ.. టీడీపీ కేడర్ గందరగోళంలో పడిపోయింది. రామరాజుకు నచ్చజెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. మరి దానికి ఆయన అంగీకరిస్తారా.. పరిస్థితి అనుకున్నంత ఈజీగా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని.. ఆ సీటు నుంచి తప్పుకోవాల్సిందిగా రామరాజును శివరామరాజు కోరగా, ఆయన నిరాకరించడంతో రెబల్‌గా పోటీ చేస్తున్నారు.
ఐతే ఇప్పుడు రఘురామను టీడీపీ అభ్యర్థిగా ప్రకటిస్తే.. రామరాజు ఎంతవరకు మద్దతు ఇస్తారు అనేది తేలాల్సి ఉంది. ఒకవైపు రామరాజు, మరోవైపు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, ఇంకోవైపు రఘురామరాజు.. ముగ్గురు ఎన్నికల్లో పోటీ చేస్తే వైసీపీ అభ్యర్థికి గెలుపు నల్లేరు మీద నడక అయినట్లే. ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురిలో ఇద్దరు త్యాగం చేయాల్సి ఉంటుంది. లేదంటే రామరాజు, రఘురామరాజులో.. ఒకరు కాంప్రమైజ్ కావాలి.. అప్పుడే టీడీపీకి ప్లస్ అవుతుంది. లేదంటే కంచుకోట జారిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో త్యాగం చేసేది ఎవరు.. ఉండికి రాజు అయ్యేది ఎవరు అనే చర్చ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.