BRS vs YCP: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం బ్రేక్..! బీఆర్ఎస్, వైసీపీ మధ్య మాటల యుద్ధం..!!
తమ వల్లే కేంద్రంలోని బీజేపీ వెనక్కు తగ్గిందని, ఇది తమ ఘనతేనని బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంది. అయితే ముందు తెలంగాణ సమస్యల గురించి ఆలోచించాలని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి స్టీల్ ప్లాంట్ వ్యవహారం బీఆర్ఎస్, వైసీపీ నేతల మధ్య మరోసారి మాటల తూటాలకు కారణమవుతోంది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం ఇప్పటిది కాదు. చాలా ఏళ్లుగా ఈ ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. మూడేళ్ల కిందట ఈ ప్రతిపాదనను బహిరంగంగా ప్రకటించింది కేంద్రం. అప్పటి నుంచి ఇది తీవ్ర దుమారం రేపుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళన బాట పట్టారు. కొన్ని రోజులు పార్టీలు కూడా హడావుడి చేశాయి. తర్వాత జారుకున్నాయి. అయినా కార్మికులు మాత్రం మూడేళ్లుగా రిలే నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అంశాన్ని బీఆర్ఎస్ లేవనెత్తుకోవడంతో మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని, దీన్ని ప్రైవేటీకరించవద్దని కోరుతూ ప్రధాని మోదీకి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. ఆ తర్వాత ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విశాఖ వెళ్లి కార్మికులను కలిసి మద్దతు తెలిపారు. అంతేకాక.. ఏపీలోని పార్టీలు కేంద్రంలోని బీజేపీకి మద్దతుగా ఉండడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తే సింగరేణి ద్వారా తాము దక్కించుకునేందుకు ప్రయత్నిస్తామని, ఇందుకోసం బిడ్ వేస్తామని కేసీఆర్ ప్రకటించడం సంచలనం కలిగించింది. దీనిపై స్టీల్ ప్లాంట్ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రకటన రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆంధ్రలో ప్రయోజనం పొందేందుకే కేసీఆర్ స్టీల్ ప్లాంట్ ను ఎత్తుకున్నారని వైసీపీ ఆరోపించింది. అసలు ప్రైవేటీకరించవద్దని వైసీపీ మొదటి నుంచి కోరుతూ వస్తోందని, దీనిపై ప్రధానిని కూడా తమ పార్టీ అధినేత జగన్ కలిశారని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మొదట ముందుకొచ్చిందే తమ పార్టీ అని బీఆర్ఎస్ నేతలకు కౌంటర్స్ ఇచ్చారు.
ఇంతలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఇప్పుడు తాము ఆలోచించట్లేదని, RINL ను ఎలా బలోపేతం చేయాలనేదానిపై దృష్టి పెట్టామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కార్మికులతో దీనిపై చర్చలు జరుపుతామన్నారు. దీంతో తమ వల్లే కేంద్రంలోని బీజేపీ వెనక్కు తగ్గిందని, ఇది తమ ఘనతేనని బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంది. అయితే ముందు తెలంగాణ సమస్యల గురించి ఆలోచించాలని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి స్టీల్ ప్లాంట్ వ్యవహారం బీఆర్ఎస్, వైసీపీ నేతల మధ్య మరోసారి మాటల తూటాలకు కారణమవుతోంది.