మాకు రజనీ వద్దు జగన్ సార్.. పల్నాడులో రజనీ రచ్చ
2019లో వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత బాగా ఫేమస్ అయిన వ్యక్తుల్లో విడదల రజిని కూడా ఒకరు. రాజకీయంగా వైసిపి బలంగా ఉండటం...

2019లో వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత బాగా ఫేమస్ అయిన వ్యక్తుల్లో విడదల రజిని కూడా ఒకరు. రాజకీయంగా వైసిపి బలంగా ఉండటం… వైసీపీ అధిష్టానం వద్ద ఆమెకు మంచి పేరు ఉండటంతో విడదల రజిని… ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా బాగా ఫేమస్ అయ్యారు. దానికి తోడు ఆర్థికంగా బలంగా ఉన్న నేత కావడంతో వైసీపీ అధిష్టానం కూడా ఆమెకు ఎక్కువగా వెయిట్ ఇచ్చింది అనే మాట వాస్తవం. ఇక 2024 ఎన్నికల్లో ఆమెను చిలకలూరిపేట నియోజిక వర్గం నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయించారు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో నియోజకవర్గాన్ని మార్చారు జగన్. 2019 నుంచి 2024 వరకు చిలకలూరిపేట నియోజకవర్గంలో తన వర్గాన్ని బలోపేతం చేసుకునేందుకు విడదల రజిని పెద్ద ఎత్తున కష్టపడ్డారు. ఇదే సమయంలో వైసీపీలో ముందు నుంచి ఉన్న నాయకులను ఆమె ఇబ్బందుల పాలు చేశారు అనే ఆరోపణలు కూడా వినిపించాయి. ముఖ్యంగా నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలతో ఆమెకు విభేదాలు ఎక్కువగా ఉన్నాయి.
చిలకలూరిపేట నియోజకవర్గంలో లావు కృష్ణదేవరాయలని ఆమె ఇబ్బందులకు గురి చేశారని… అప్పట్లో ఎన్నో పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఆమెకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి. పలు గ్రామాల్లో ఎంపీకి వైసిపి కార్యకర్తలు, స్థానిక నాయకులు సహకరించకుండా ఆమె వ్యవహరించారనేది కూడా అప్పట్లో ఉన్న ప్రధాన ఆరోపణ. ఇక ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా విడదల రజనీకారణంగా నియోజకవర్గంలో ఇబ్బందులు పడ్డారు. పార్టీ కోసం మర్రి రాజశేఖర్ గట్టిగానే కష్టపడ్డారు. ఆమె కంటే ముందే వైసీపీలోకి వెళ్లిన రాజశేఖర్ అక్కడ భారీగానే ఖర్చు పెట్టారు.
అయితే రాజశేఖర్ తో పోలిస్తే రజిని ఆర్థికంగా బలంగా ఉన్న నాయకురాలు కావడంతో ఆమెకు సీటు దక్కింది. ఇక రాజశేఖర్ కు ఎమ్మెల్సీ సీటు దక్కుతుందని… అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ 2023 చివర్లో రాజశేఖర్ కు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. రాజశేఖర్ కు కమ్మ సామాజిక వర్గంతో పాటుగా బీసీ సామాజిక వర్గాల్లో కూడా మంచి పేరుంది. దానికి తోడు సౌమ్యుడుగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. ఎంపీ లావు కృష్ణదేవరాయలతో కూడా ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి.
అలాంటి నేతను నియోజకవర్గంలో లేకుండా చేయాలని విడదల రజిని చాలా కష్టపడేవారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత విడదల రజిని మళ్ళీ నియోజకవర్గానికి వెళ్లారు. ఎన్నికల్లో తాను పోటీ చేసిన స్థానం నుంచి ఓటమి చెందడంతో… మళ్లీ చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆమె రాజకీయం చేయడం మొదలుపెట్టారు. పోటీ చేసిన నియోజకవర్గాన్ని పక్కనపెట్టిన రజిని… చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఇక 2019లో అధికారంలో వచ్చిన తర్వాత తాను ఖర్చుపెట్టిన సొమ్ముని లాక్కునే ప్రయత్నం గట్టిగానే చేశారు. ఈ టైం లో నియోజకవర్గంలో ఉన్న గ్రానైట్ వ్యాపారులు.. స్టోన్ క్రషర్ యజమానులను ఆమె ఇబ్బందులకు గురి చేశారని ఆరోపణలు వినిపించాయి. ఇక వీటిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు కూడా నమోదయ్యాయి. ఇటీవల ఆమెను అదుపులోకి తీసుకుంటున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఇక వైసీపీ అధిష్టానం వద్ద ఆమెకు పట్టు ఉండటంతో… ఆ పార్టీ నుంచి ఆమెకు న్యాయసహాయం కూడా గట్టిగానే అందుతుంది.
ఇక విడదల రజనీకారణంగా నరసరావుపేట పార్లమెంటులో పార్టీ ఇబ్బందులకు గురవుతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలకు విడుదల రజిని విలువ ఇవ్వడం లేదని… వైసీపీ అధిష్టానం వద్ద ఉన్న వెయిట్ తో ఆమె నాయకులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని… కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రజిని వ్యవహార శైలి మారకపోతే కచ్చితంగా పార్టీలో… కీలక నేతలు నరసరావుపేట పార్లమెంట్ నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తను దూకుడు స్వభావంతో చివరకు కార్యకర్తలను కూడా ఆమె ఇబ్బందుల పాలు చేస్తున్నారని గ్రామస్థాయి నాయకత్వం ఆమెపై ఆగ్రహంగా ఉంది.