West Bengal: బెంగాల్ అంటే అంతే.. ఎన్నికలంటే హింస మామూలే.. ఎవరి వాదన వారిదే!
శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు అనేకచోట్ల ఇరు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణల వల్ల ఉదయం పదకొండులోపే 9 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. రేజినగర్, తుపాన్‌గంజ్, ఖర్‌గ్రామ్ ప్రాంతాల్లో ముగ్గరు టీఎంసీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు.

West Bengal: దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎంతో కొంత హింస సాధారణమే. పలు చోట్ల ఘర్షణలు, పరస్పర దాడులు వంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ ముందుంటుంది. ఎన్నికలంటే తీవ్ర హింస జరిగే రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్‌దే ప్రథమ స్థానం అనొచ్చు. తాజాగా పంచాయతీ ఎన్నికల్లో తీవ్ర ఘర్షణ చెలరేగుతోంది. ఈ ఘర్షణల్లో ఏకంగా తొమ్మిది మంది మరణించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అయితే, ఎన్నికలకు ముందు నుంచే అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ముఖ్యంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు అనేకచోట్ల ఇరు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణల వల్ల ఉదయం పదకొండులోపే 9 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. రేజినగర్, తుపాన్‌గంజ్, ఖర్‌గ్రామ్ ప్రాంతాల్లో ముగ్గరు టీఎంసీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. దోమ్‌కోల్‌లో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి. కూచ్‌బెహార్, రాణినగర్, డైమండ్ హార్బర్, జల్‌పాయ్‌గురి, తదితర చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలోనే కాదు.. గతంలోనూ అనేక సార్లు ఇక్కడ హిందూ, ముస్లిం ఘర్షణలు జరిగాయి. అలాగే కులాల కుంపట్లు కూడా సాధారణమే. పరస్పర దాడులు, హత్యలు, ఇండ్లు తగలబెట్టడాలు వంటి ఘటనలతో బెంగాల్ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. రెండు వర్గాల్లో ఒక వర్గాన్ని బీజేపీ, మరో వర్గాన్ని టీఎంసీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటాయి. దీంతో ఇక్కడ నిత్యం ఘర్షణ వాతావరణమే ఉంటుంది.
పరస్పర ఆరోపణలు
ఎన్నికల వేళ చెలరేగుతున్న హింస విషయంలో బీజేపీ, టీఎంసీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. బీజేపీయే ఈ హింసకు పాల్పడుతోందని టీఎంసీ ఆరోపిస్తుంటే.. టీఎంసీనే దాడుల్ని ప్రోత్సహిస్తోందని బీజేపీ విమర్శిస్తోంది. అధికార బలంతో టీఎంసీ ఎన్నికలు నిర్వహిస్తోందని బీజేపీ ఆరోపించింది. పోలింగ్‌కు ముందే కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లు వేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు కేంద్ర బలగాలను నియమించాలని బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం డిమాండ్ చేశాయి. ఇప్పటికే అధికారులు భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ ఘర్షణలు జరుగుతున్నాయి. దాదాపు 600 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు, 70 వేల మందికిపైగా రాష్ట్ర పోలీసులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో 73,887 పంచాయతీలకు శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికోసం 2.06 లక్షల మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీఎంసీ అత్యధిక సీట్లు సాధించింది. 34 శాతం సీట్లు ఏకగ్రీవం కాగా, మిగతా స్థానాల్లోనూ 90 శాతం సీట్లు గెలుపొందింది. ఈ సారి ఎలాగైనా మెజారిటీ సీట్లు సాధించాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది.