సాయి రెడ్డి.. అప్రూవర్ గా మారితే…?
వైసీపీకి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. నాయకులు అనుకూలంగా ఉంటేనే జగన్ దగ్గరికి తీసుకుంటారని..

వైసీపీకి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. నాయకులు అనుకూలంగా ఉంటేనే జగన్ దగ్గరికి తీసుకుంటారని… కోటరీ మాటలు వినొద్దని జగన్ కు ఎన్నోసార్లు చెప్పిన ఫలితం లేదని.. చెప్పుడు మాటలను వినేవాడు నాయకుడు కాదు అని, చెప్పుడు మాటలను నాయకుడు వినకూడదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మనసులో నాకు స్థానం లేదని తెలిసి వైసీపీ నుంచి బయటకు వచ్చాను అని, తన మనసు విరిగిపోయిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
విరిగిన మనసు మళ్ళీ… అతుక్కోదని తిరిగి వైసీపీలో చేరే ప్రసక్తే లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తాను రాజకీయాల నుంచి అలాగే వైసిపి నుంచి తప్పుకోవడానికి జగన్ పక్కనున్న కోటరి ప్రధాన కారణమని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తాజాగా విజయవాడలో సిఐడి విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. కాకినాడ సేజ్ భూములను.. కెవి రావు నుంచి అక్రమంగా అరబిందో ప్రతినిధులు లాక్కున్నారని.. ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సిఐడి అధికారులు విచారణకు పిలిచారు.
ఈ విచారణకు హాజరైన అనంతరం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వై వి సుబ్బారెడ్డి కుమారుడుతో తనకు ప్రస్తుతం ఎటువంటి వ్యాపార సంబంధాలు లేవని.. కేవలం తన కూతుర్ని మాత్రమే ఆయనకు ఇచ్చానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దీనితో ఇప్పుడు విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారే అవకాశం ఉంది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. జగన్ కేసుల్లో విజయసాయిరెడ్డి అత్యంత కీలకంగా ఉన్నారు. వైఎస్ జగన్… ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడ పెట్టిన ఆస్తులకు విజయసాయిరెడ్డి ప్రత్యక్ష సాక్షి.
ఒకవేళ విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారితే మాత్రం కచ్చితంగా జగన్ నిండా ఇరుక్కుపోయినట్లే. ఆడిటర్ గా జగన్ కంపెనీల లెక్కల విషయంలో విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. అలాగే సిబిఐ కేసులను కూడా విజయసాయిరెడ్డి ఎదుర్కొన్నారు. కొన్నాళ్లపాటు ఆయన జైలుకు కూడా వెళ్లారు. ఇక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుతోపాటుగా పలు కేసుల్లో వైయస్ కుటుంబాన్ని రక్షించేందుకు విజయ సాయి రెడ్డి ఢిల్లీ స్థాయిలో తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి కూడా విజయసాయిరెడ్డి పరోక్షంగా కీలకపాత్ర పోషించారు.
ఇప్పుడు ఆయన ఏదైనా విషయాలు బయట పెడితే మాత్రం.. కచ్చితంగా జగన్ రాజకీయ జీవితంతో పాటుగా వ్యక్తిగత జీవితం కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఇక వైసిపి రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్ధకమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం తన వ్యక్తిగత భద్రతకు కూడా విజయసాయిరెడ్డి కీలక ప్రాధాన్యత ఇస్తున్నారు. పొరపాటున ఆయన అప్రూవర్ గా ఏ సందర్భంలో మారినా సరే వైసీపీ పడే ఇబ్బందులు ఊహకు కూడా అందవు. దీనితో వైసిపి అభిమానులు, కొంతమంది ఆ పార్టీ క్షేమం కోరుకునే నాయకులు.. సాయి రెడ్డితో గొడవలు వద్దని సూచిస్తున్నారు.