NARA LOKESH: లోకేష్‌కు సీఐడీ ఇచ్చిన నోటీసుల్లో ఏముంది..?
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో ఏ14గా చేర్చిన సీఐడీ నోటీసులు జారీ చేసింది. దీని ప్రకారం.. ఈ నెల 4న ఉదయం పది గంటలకు విచారణకు హాజరుకావాలని సూచించింది. ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. అక్కడ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇంట్లో నారా లోకేష్ ఉంటున్నారు.
NARA LOKESH: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఇటీవల ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో ఏ14గా చేర్చిన సీఐడీ నోటీసులు జారీ చేసింది. దీని ప్రకారం.. ఈ నెల 4న ఉదయం పది గంటలకు విచారణకు హాజరుకావాలని సూచించింది. ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. అక్కడ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇంట్లో నారా లోకేష్ ఉంటున్నారు. లోకేష్‌ను కలిసేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఆన్‌లైన్ ద్వారా ఆయనకు నోటీసులు పంపారు.
సెక్షన్స్ 34,35,36,37,120(బి),166, 167,217 409,420, 13(2),13(1)(సి)&(డి) కింద నమోదైన కేసుల్లో లోకేష్‌కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసుల్లో విచారణ కోసమే నోటీసులు ఇస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ నోటీసుల్లో 10 కీలక అంశాలను లోకేష్‌కు సూచించారు. విచారణ జరిగేంత కాలం, భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకూడదని, ఆధారాలను ట్యాంపరింగ్ చేయకూడదని, ఈ కేసుతో సంబంధమున్న వ్యక్తులను ప్రలోభపెట్టటం గానీ, బెదిరింపులకు గురి చేయటం గానీ చేయకూడదన్నారు. అవసరమైనప్పుడు కోర్టు ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. విచారణలో నిజాలు చెబుతూ, సహకరించాలన్నారు. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు చెందిన లావాదేవీలు, ఆస్తుల విషయంలో బోర్డు మీటింగ్స్‌కు సంబంధించిన మినట్స్ బుక్, భూముల కొనుగోళ్లకు సంబంధించిన పేమెంట్స్ వివరాలు ఇవ్వాలని కోరారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు సహకరించాలన్నారు.
అధికారులు పెట్టే కండీషన్స్ అనుసరించాలని సూచించారు. విచారణకు సహకరించకపోయినా, హాజరు కాలేకపోయినా.. నిబంధనలకు అనుగుణంగా అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఈ కేసులో నారా లోకేష్‌ను అరెస్టు చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. లోకేష్ కోర్టును ఆశ్రయించడంతో ఈ ముప్పు తప్పింది. లోకేష్‌ను ఈ నెల 4 వరకు అరెస్టు చేయకూడదని హైకోర్టు ఆదేశించింది. దీంతో సీఐడీ అధికారులు విచారణ కోసం మాత్రమే నోటీసులు జారీ చేశారు. ఢిల్లీలో ఉన్న లోకేష్ ఏపీ రావాల్సి ఉంది.