రేవంత్ చేసిన తప్పు ఏమిటి ? హైడ్రా ఎక్కడ ఫెయిల్ అయింది?

అధికారంలో ఉన్న వాళ్ళకి ఆవేశమే కాదు ఆలోచన కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా తెలంగాణ లాంటి యాక్టివ్ స్టేట్ లో, ప్రతి పక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో పాలక పార్టీలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలి. హైదరాబాదులో సంచలన సృష్టిస్తున్న హైడ్రా బుల్ డోజర్లు కథ ముగిసి పోయేటట్లు ఉంది .

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 30, 2024 | 09:11 PMLast Updated on: Sep 30, 2024 | 9:11 PM

What Is Revanths Mistake Where Did Hydra Fail

అధికారంలో ఉన్న వాళ్ళకి ఆవేశమే కాదు ఆలోచన కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా తెలంగాణ లాంటి యాక్టివ్ స్టేట్ లో, ప్రతి పక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో పాలక పార్టీలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలి. హైదరాబాదులో సంచలన సృష్టిస్తున్న హైడ్రా బుల్ డోజర్లు కథ ముగిసి పోయేటట్లు ఉంది . దీనికి కారణం … ధనవంతుల్ని, సెలబ్రిటీల్ని, లీడర్లని వదిలేసి సామాన్యుల కొంపలు కూల్చడమే హైడ్రా చేసిన నేరం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి హైడ్రా విషయంలో క్రెడిట్ దక్కకపోగా చివరికి జనం శాపనార్ధాలు మిగిలాయి.ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న బి.ఆర్.ఎస్ సామాన్యుల భుజాలపై తుపాకులు పెట్టి కాంగ్రెస్ సర్కారుపై విమర్శల తూటాలు పేల్చుతోంది.

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను రక్షించే లక్ష్యంతో హైడ్రాను ఏర్పాటు చేసింది. కమిషనర్ గా ఐపీఎస్ రంగనాథ్ ను నియమించింది. హైడ్రా రావడంతోనే మొదట హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చి పడేసింది. దాంతో ఒక్కసారిగా సీఎం రేవంత్ రెడ్డి, కమిషనర్ రంగనాథ్ హీరోలు అయిపోయారు. కానీ ట్రైలర్ లో చూపించినంత నిజాయితీ సినిమాలో చూపించలేకపోయారు వీళ్ళిద్దరూ. హైడ్రా అధికారులు చాలా చెరువుల్లోని బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చే సారు. అయితే కొంత మంది బిల్డర్లు.. చెరువులు కబ్జా చేసి అపార్ట్ మెంట్లు కట్టారు. వాటిని మధ్యతరగతి వారికి అమ్మరు. వీటిపై తన ప్రతాపం చూపించింది హైడ్రా. జనం ఆందోళన చెందుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటన చేశారు. బఫర్, ఎఫ్టీఎల్ పక్కన ఉన్న మధ్యతరగతి జనం నిర్మాణాలను ముట్టుకోమని చెప్పారు.

చెరువు బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్న వాణిజ్య కట్టడాలు, కొత్తగా నిర్మిస్తూన్న నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు. ఇక్కడ హైడ్రా కాస్త మానవత్వంతో వ్యవహరిస్తే బాగుండేది.చెరువుల్ని కొంత మంది రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు ఆక్రమించారు. భూములు తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చిన్న వ్యాపారాలు తో ఉపాధి కోసం మధ్య తరగతి ప్రజలు సదరు ఓనర్ల వద్ద భూమిని లీజ్ కు తీసుకున్నారు. అందులో లక్షలు పెట్టి తాత్కాలిక షేడ్లు వేసుకున్నారు. వ్యాపారం చేసుకుంటూ పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇందులో చాలా మంది అప్పులు చేసి, బ్యాంకు లోన్లు తీసుకుని వ్యాపారం ప్రారంభించారు. సడెన్ గా హైడ్రా అధికారులు వచ్చి నిర్మాణాలను కూల్చివేశారు. కనీసం సామాన్లు బయటకు తీసుకునే సమయంకూడా ఇవ్వలేదు. ఓ మహిళ కన్నీరు పెట్టుకుంటూ.. కనీసం గంట ఇవ్వాలని అడిగినా.. హైడ్రా అధికారులు సమయం ఇవ్వలేదని చెప్పారు. ఈ ఘటనల్లో చెరువు కబ్జా చేసి లీజ్ కు ఇచ్చిన ఓనర్లు లాభం పొందారు. కష్టాన్ని నమ్ముకున్నవారు అన్యాయం అయిపోయారు.

రిజిస్ట్రేషన్ చేసుకున్న మూడు రోజులకే ఇంటిని కూల్చేశారంటూ ఓ కుటుంబం బోరున విలపిస్తే.. తన కష్టాన్నంతా ధారపోసి మూడేళ్లు నిర్మించిన ఇల్లు క్షణాల్లో నేలమట్టం అయిందని మరో బాధితుడు కన్నీరు పెట్టుకున్నారు. ఇలా ఒక్కో బాధితుడిది ఒక్కో విషాదగాథ. హైడ్రా ఇల్లు కూల్చేయటంతో తన పుస్తకాలు అందులోనే ఉండిపోయాయని.. తండ్రి ప్రేమతో కొనిచ్చిన వాటర్ బాటిల్ పగిలిపోయిందని ఓ చిన్నారి వాపోతున్న వీడియో జనాన్ని కదిలించింది.
పలుకుబడి ఉన్న వ్యక్తులకు నోటీసులతో సరిపెడుతున్న సర్కారు.. పేదోడి గూడుపై మాత్రం కర్కశంగా వ్యవహరిస్తోందనే వాదన క్రమంగా బలపడుతోంది. హైడ్రా ఏర్పటైన తొలినాళ్లలో అందరికీ ఒకటే న్యాయమనే సూత్రం అమలైంది. అందుకే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. తమ ప్రాంతానికి రావాలని ఆహ్వానించారు. అంతెందుకు హైడ్రాను రాష్ట్రవ్యాప్తం చేయాలనే డిమాండ్లు వచ్చాయి. కానీ వచ్చిన మంచిపేరుని హైడ్రా కొద్దిరోజులకే పోగొట్టుకుంది.

ఉద్దేశం మంచిదైనా ఆచరణ లోపాలు హైడ్రాను వెక్కిరిస్తున్నాయి. అసలు చెరువుల హద్దులపై హైడ్రాకు పక్కా సమాచారం ఉందా.. లేదా అనే ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఐదేళ్ల క్రితం హైకోర్టు అడిగిన జంట జలాశయాల హద్దులు ఇంతవరకూ ఇవ్వని అధికారులు.. ఇప్పుడు హైడ్రాకు మాత్రం సరైన రికార్డులిస్తున్నారా.. లేదా అనే అనుమానాలూ లేకపోలేదు. రెవిన్యూ, ఇరిగేషన్ రికార్డులకు పొంతన లేదనే వాదనలు గందరగోళం సృష్టిస్తున్నాయి. హైడ్రా కూడా గూగుల్ మ్యాపుల ఆధారంగా కూల్చివేతలు చేపట్టడం ఎంతవరకు న్యాయమనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ హైడ్రా మాత్రం లేడికి లేచిందే పరుగన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఏదో ఈ గంటలో కూల్చకపోతే హైదరాబాద్ కు ఏదో పెను నష్టం జరిగిపోతున్నంత కలర్ ఇస్తోంది. ఇక్కడే సామాన్యుడికి కడుపు మండుతోంది. పెద్దల భవంతులకు నోటీసులిచ్చి వదిలేస్తూ.. పేదలకు మాత్రం అసలు టైమ్ ఇవ్వకుండా హడావుడిగా కూల్చివేతలు ఎందుకని నిలదీస్తున్నారు. ఈ విషయంలో హైడ్రా తీరు.. సర్కారుకు చెడ్డపేరు తెచ్చేలా ఉందని కొందరు కాంగ్రెస్ నేతలు కూడా మొత్తుకుంటున్నారు. అసలు పేదోడి గూళ్లు కనిపించగానే పూనకం వచ్చినట్టు ఊగిపోయి.. నిర్విరామంగా కూల్చివేతలు చేయాల్సిన పనేముందనే ప్రశ్నలకు హైడ్రా దగ్గర సమాధానం లేదు.

చెరువుల్లో ఆక్రమణలు కేవలం ఇప్పుడు నివాసం ఉంటున్నవారి తప్పు మాత్రమ లేదు. ఆ స్థలాలు అమ్మినవారు, అనుమతులు ఇచ్చిన అధికారులు, లంచాలు తీసుకున్న పెద్ద మనుషులు.. ఇలా చాలా మంది చేసిన తప్పుకి.. డబ్బులిచ్చి కొనుకున్నవాళ్లు అన్యాయమైపోవటం ఏం న్యాయం అనే ప్రశ్న అలాగే ఉంది. కనీసం పరిహారమైనా ఇవ్వాలని వారు అడుగుతున్నారు. హైడ్రా అధికారులు మాత్రం కూల్చటమే మా పని.. మిగతాది సంబంధం లేదన్నట్టుగా వెళ్లిపోతున్నారు. కొన్నిచోట్ల హద్దులు నిర్ణయించేదాకా ఆగాలని ఇతర శాఖల అధికారులు చెప్పినా.. హైడ్రా ఆగటం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇంత ఏకపక్షంగా దూకుడుగా వెళ్లి ఏం సాధించదలుచుకున్నారని సామాన్యులు అడుగుతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిందే. మొన్నటిదాకా హైడ్రాకు స్వాగతం చెప్పిన హైదరాబాదీలే.. ఇప్పుడు మా కొద్దీ హైడ్రా అనే పరిస్థితి తెచ్చుకుంటోంది. ఆక్రమణల కూల్చివేత ఓ ఎత్తైతే.. హైడ్రా వ్యవహరిస్తున్న తీరు మరో ఎత్తు. కూల్చివేతల సమయంలో నిర్వాసితులౌతున్నవారితో అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.

హైడ్రా కూల్చివేతలపై కొందరు కోర్టుకు వెళ్తే.. న్యాయస్థానాలు కూడా కొన్ని మార్గదర్శకాలు ఇచ్చాయి. ఆక్రమణలు కూల్చివేయాల్సిందే కానీ.. వివరణ ఇవ్వటానికి సమయం ఇవ్వాలని, అన్ని రకాలుగా అక్రమమని నిర్థారించుకున్నాకే ముందుకెళ్లాలని చెప్పింది. ముందు హైదరాబాద్ లో ఉన్న చెరువుల లెక్క, చెరువుల హద్దుల సంగతి తేల్చుకోవాలని సూచించింది. అన్ని శాఖలూ ఏకాభిప్రాయానికి రావాలని కూడా చెప్పింది. కానీ హైడ్రా మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. వారమంతా సైలంట్ గా ఉండి… శనివారం నోటీసులిచ్చి.. ఆదివారం తెల్లారుజామునే కూల్చివేతల్ని జనం తప్పుబడుతున్నారు. నోటీసులు తీసుకున్న వాళ్ళు వాటిని చదువు కునే సమయం కూడా ఉండటం లేదని వాపోతున్న దాఖలాలున్నాయి. హైడ్రాపై ఎలా స్పందించాలో తెలియకుండా ఉన్న ప్రతిపక్షాలకు కూడా.. తన చర్యలతో హైడ్రానే దారి చూపించింది.

జంట జలాశయాలతో పని మొదలుపెట్టాల్సిన హైడ్రా.. వాటిని వదిలేసి జనావాసాల మీదకు బుల్డోజర్లు తీసుకురావడమే విమర్శలకు దారితీస్తోంది. ట్రిపుల్ వన్ జీవో అమల్లో ఉన్నా.. జంటల జలాశయాల పరిధిలో విచ్చలవిడిగా నిర్మాణాలున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం యథేచ్ఛగా జరుగుతోంది. మొదట అక్కడ కట్టడి చేసి.. తర్వాత హైదరాబాద్ లోకి వస్తే బాగుండేది. కానీ హైడ్రా మాత్రం జంట జలాశయాల దగ్గర రెండు రోజులు హడావుడి చేసి.. నేరుగా నగరం మీద పడటమేంటని సామాన్యులు నిలదీస్తున్నారు. మొదట జంట జలాశయాల హద్దులు గుర్తించి.. ఫెన్సింగ్ వేసి.. వాటి ఎఫ్టీఎల్, బఫర్ పరిధిలో ఆక్రమణలన్నీ కూల్చేసి.. ఒక్కో చెరువునూ అలాగే ఆక్రమణల నుంచి విముక్తం చేస్తే.. జనం సంతోషించేవాళ్లు. ఈలోగా చెరువు భూముల్లో నివాసం ఉన్నవారు జాగ్రత్తపడటానికి సమయం దక్కేది. ఒక వారం ముందు నోటీసులిచ్చి.. కూల్చితే హైడ్రాకు పోయేదేముందనే ప్రశ్నలు వస్తున్నాయి. సామాన్యుల ఇళ్లు కూల్చటానికి కంగారు అక్కర్లేదు. వారేం రాజకీయ పలుకుబడి ఉన్నవారు కాదు. హైడ్రా అధికారుల్ని ఎదిరించే పరిస్థితి లేరు. అలాంటప్పుడు కాస్త మానవీయ దృక్పథం చూపించి.. కాస్త . హైడ్రా చూపిస్తున్న అతి దూకుడు కారణంగా ఆక్రమణల కూల్చివేతల కంటే.. బాధితుల ఆవేదనే హైలైట్ అవుతోంది.
హైదరాబాద్ లో దశాబ్దాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపటానికి రేవంత్ సర్కారు ఉద్దేశం మంచిదైతే సరిపోదు. ఆచరణ కూడా అందుకు తగ్గట్టుగా ఉండాలి. ఇక్కడ హైడ్రా పనితీరులో లోపాలు ప్రభుత్వ లక్ష్యాన్ని దెబ్బతీశాయి.

హైడ్రా మొదట జనావాసాలు పెద్దగా లేని చెరువుల ఆక్రమణలపై దృష్టి పెట్టి.. ఆ చెరువులకు హద్దులు నిర్ణయిస్తే బాగుండేది. హైడ్రా రాకముందు, వచ్చిన తర్వాత సదరు చెరువులు ఎలా ఉన్నాయో ఫోటోలు, విజువల్స్ విడుదల చేస్తే.. ఆ ప్రచారమే వేరేలా ఉండేది. చాలాసార్లు ప్రభుత్వ ఆలోచనలు మంచివైనా.. అధికారుల ఆచరణ కారణంగానే సమస్యలొస్తాయి. దీనికి చరిత్రలో కొన్ని ఉదాహరణలున్నాయి. ఇప్పుడు హైడ్రా కూడా ఆ కోవకే ఇంత తొందరగా చేరుతుందని ఎవరూ అనుకోలేదు. మొదట్లో హైడ్రా పనితీరు చూసిన సామాన్యులు కూడా ఇన్నాళ్లకు సర్కారు అధికారులు కరెక్టుగా పనిచేస్తున్నారని సంబరపడ్డారు. కానీ అదే హైడ్రా తమ ఇళ్ల మీదకొచ్చి ప్రతాపం చూపేసరికి.. వారి ఆనందం కాస్తా ఆవిరైపోయింది. అన్యాయం జరిగితే హైడ్రాకు చెప్పుకుందామనుకుంటే.. ఆ హైడ్రానే అన్యాయం చేస్తే.. ఎవరితో చెప్పుకోవాలనే భావన వ్యక్తమౌతోంది. హైడ్రా తీరు ఇలాగే కొనసాగితే చాలా సమస్యలొస్తాయనే అభిప్రాయాలున్నాయి. ఇప్పటికైనా హైడ్రా దూకుడు తగ్గించుకుని సరైన కార్యాచరణ తీసుకోవాలి.

సీఎం రేవంత్ రెడ్డి, కమిషనర్ రంగనాథ్ ఏ తప్పు చేయకూడదో అదే చేశారు. తమను తాము సినిమా హీరోlla ఊహించుకున్నారు. కానీ చివరికి విలన్స్ లాగా వ్యవహరించారు. హిమాయత్ సాగర్, గండిపేట, తోపాటు పెద్ద పెద్ద చెరువులు పక్కనున్న బడా బాబుల నిర్మాణాలను వదిలేసి సామాన్య జనల పైకి బుల్డోజర్లను నడిపించారు. బి ఆర్ ఎస్ నేతలకు ఈ ఒక్క అవకాశం చాలు. ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ఎదిగిన బి ఆర్ ఎస్ నేతలు ఇప్పుడు సామాన్యుడికి కన్నీళ్లను పెట్టుబడిగా పెట్టి తెలంగాణలో రాజకీయం చేస్తున్నారు. రంగనాథ్ టీం చేసిన ఓవరాక్షన్ చివరికి రేవంత్ కు తలవొంపులు తెచ్చింది.
హైడ్రా కథ ముగిసి పోయే పరిస్థితి వచ్చింది.