Skill Development Case: అసలేంటీ స్కిల్ డెవలప్మెంట్ కేసు.? చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశారు?
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసినట్లు సీఐడీ వెల్లడించింది. అయితే అసలు ఈ కేసు పూర్వాపరాలేంటి..? చంద్రబాబు ప్రమేయం ఏంటి..?
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నంద్యాలలో చంద్రబాబును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చంద్రబాబు అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు. చంద్రబాబుపై 120 (బి), 166, 167, 418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 మరియు 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ1గా ఉన్న చంద్రబాబుపై పలు అభియోగాలు మోపారు. ఈ కేసులో మొత్తం రూ.241 కోట్లు అవినీతి జరిగింది. కేబినెట్‌ను తప్పుదారి పట్టించడమే కాకుండా జీఓలో ఒకటి, ఒప్పందంలో మరొకటిపెట్టి… డబ్బులు కాజేశారని అభియోగాలు నమోదయ్యాయి. జీఎస్టీ, ఇంటెలిజెన్స్, ఐటీ, ఈడీ, సెబీ… ఇలా పలు ఏజెన్సీలన్నీ ఈ కేసును దర్యాప్తు చేశాయి. కాజేసిన సొమ్మును విదేశాలకు పంపించి.. అక్కడి నుంచి పలు ఇతర మార్గాల ద్వారా తిరిగి దేశంలోకి తీసుకొచ్చారు.
చంద్రబాబు జూన్ 2014లో అధికారం చేపట్టిన 2 నెలలకే ఈ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంకు తెరలేపినట్లు సీఐడీ చెప్తోంది. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.3,356 కోట్లు. ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం కాగా.. 90 శాతం సీమెన్స్ సంస్థ పెట్టుకుంటుందని ఒప్పందంలో ఉంది. అంటే దాదాపు రూ.౩వేల కోట్లు సీమెన్స్ సంస్థ భరించాల్సి ఉంది. తమకు తాముగా తయారు చేసుకున్న అంచనా వ్యయాన్నే డీపీఆర్‌గా చూపిస్తూ స్కిల్‌డెవల్‌మెంట్ నుంచి నోట్ పెట్టించారు. ప్రభుత్వంలో సెక్రటరీ, ఆపై స్థాయిలన్నింటినీ ఓవర్‌రూల్ చేస్తూ కేబినెట్లోకి ఈ నోట్‌ను తీసుకొచ్చారు. అదీ ఒక స్పెషల్ ఐటెంగా రావడం గమనార్హం. కేబినెట్లోకి అలా రాగానే దీనికి ఓకే చెప్పేశారు. ఆ వెంటనే జీవో కూడా విడుదలైపోయింది.
ఇక ఒప్పందం విషయానికొస్తే.. జీఓ ఒకలా ఉంటే ఒప్పందం మరోలా ఉంది. జీవోలో ఉన్నది.. ఒప్పందంలో లేనప్పుడు ఎలా సంతకాలు చేశారనేది పెద్ద ప్రశ్న. సీమెన్స్ నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఒక్కపైసా కూడా రాకుండానే 5 దఫాలుగా ప్రభుత్వం రూ. 371 కోట్లు విడుదల చేసేసింది. ఇలా ఎలా విడుదల చేశారనేది అంతు చిక్కడం లేదు. నిధులు ఇలా విడుదల చేసేందుకు ఆర్థికశాఖ అధికారులు అభ్యంతరం తెలిపారు. కానీ అప్పటి సీఎం చంద్రబాబు నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో నిధులు విడుదలైపోయాయి. ఈ విషయాన్ని అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్‌ఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. సీఎం చెప్పారు కాబట్టి నిధులు విడుదల చేయాలని చీఫ్ సెక్రటరీ కూడా ఫైలుపై రాశారు.
తమకు తెలియకుండానే నిధులు విడుదలయ్యాయని అధికారులతో పాటు సీమెన్స్ సంస్థ కూడా వెల్లడించింది. 164 సీఆర్పీసీ కింద సీమెన్స్ సంస్థ ఏకంగా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు, ఎంఓయూకు ఎలాంటి సంబంధం లేదని వాళ్లు కోర్టుకు తెలిపారు. తమ కంపెనీలో పనిచేసే సుమన్ బోస్ అనే వ్యక్తి మేనేజ్‌మెంట్‌నుగాని, లీగల్‌టీమ్ కాని సంప్రదించకుండానే ఇలా చేశారని కోర్టుకు తెలిపింది. ఇలా వెళ్లిన డబ్బు 70కిపైగా షెల్ కంపెనీల ద్వారా చేతులు మారి తిరిగి భారత్ వచ్చింది.
ఈ స్కిల్‌డెవలప్‌మెంట్ స్కాంపై ఓ వ్యక్తి 2018లోనే ఏసీబీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే విచారణ మొదలుపెట్టి… దాన్ని ముందుకు సాగనివ్వకుండా పక్కన పెట్టేశారు. అంతేకాక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నోట్‌ఫైల్స్‌ను మాయం చేసేశారు. ఇందులో పీవీఎస్‌పీ/స్కిల్లర్, డిజైన్‌టెక్ సంస్థలు కీలక పాత్ర పోషించాయి. ఈ రెండు కంపెనీలు సర్వీస్ ట్యాక్స్ కట్టకుండానే సెస్, వ్యాట్ కోసం క్లెయిమ్ చేశాయి. దీంతో అనుమానం వచ్చిన జీఎస్టీ అధికారులు కంపెనీ లావాదేవీలపై విచారణ జరిపారు. హవాలా మార్గంలో నిధులు తరలించినట్టు ఈ విచారణలో తేలింది. దీంతో కేసు మొత్తం బయటికొచ్చింది.