AP Congress: ఏపీలో కాంగ్రెస్‌ పూర్తిగా చచ్చిపోయినట్లేనా ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను టచ్ చేయాలంటే వణికిపోయేవి విపక్షాలు. రాష్ట్ర విభజన తర్వాత మారిపోయింది సీన్ పూర్తిగా ! రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా.. ఏపీలో పూర్తిగా తుడుచుపెట్టుకుపోతే.. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణలో క్రెడిట్ సాధించడంలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో రెంటికి చెడ్డ రేవడిగా తయారయింది హస్తం పార్టీ పరిస్థితి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 15, 2023 | 01:00 PMLast Updated on: Apr 15, 2023 | 1:45 PM

What Is The Congress Party Status In Ap

తెలంగాణ సంగతి ఎలా ఉన్నా.. ఏపీలో మాత్రం కాంగ్రెస్‌ సీన్ చూస్తుంటే.. జాలి వేస్తోంది ప్రతీ ఒక్కరికి ! ఢిల్లీని ఏలి.. తెలుగు రాష్ట్రాల్లో చక్రం తిప్పిన కాంగ్రెస్‌కు.. ఏపీలో ఆస్తి పన్ను చెల్లించేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయ్. దీంతో అయ్యో పాపం అంటున్నారు అంతా కాంగ్రెస్‌ను చూసి. 2014, 2019 అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ సత్తా చాటలేకపోయింది. బడాబడా నేతలతో నిండి.. ఢిల్లీని వణికించిన నేతలు కనిపించిన కాంగ్రెస్‌.. ఇప్పుడు పూర్తిగా బోసిపోయిన పరిస్థితి.

2014 తర్వాత ఏపీ కాంగ్రెస్‌కు ముగ్గురు అధ్యక్షులను మార్చారు. రఘువీరా ఆ తర్వాత శైలజానాథ్.. ఇప్పుడు రుద్రరాజు. ఫేస్‌లు మారుతున్నాయ్ తప్ప.. కాంగ్రెస్ ఫేట్ మారే అవకాశాలు ఆవగింజ అంత అయినా కనిపించడం లేదు. చివరికి రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర అని.. ఏపీని అలా టచ్ చేస్తూ వెళ్లినా సీన్‌లో ఎలాంటి మార్పు కనిపించలేదు. అధ్యక్షులు మారిన ప్రతీసారి.. ఢిల్లీకి అలా ఫ్లైట్‌లో వెళ్లి ఇలా తిరిగి వచ్చి.. ఓ ప్రెస్‌మీట్ పెట్టి.. కష్టపడతాం, పడదాం అంటూ ఓ స్టేట్‌మెంట్ ఇవ్వడం.. కాంగ్రెస్‌ చేస్తోంది, చేసిందేమీ లేదు పెద్దగా ! ముగ్గురు అధ్యక్షులు మారారు. పార్టీలో ఎలాంటి మార్పు లేదు.

గట్టిగా చెప్పాలంటే ఇక రాదు కూడా ! తెలుగువాళ్లను సోనియాగాంధీ అడ్డంగా చీల్చినరోజే.. ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అయింది. ఒకరకంగా పార్టీ చచ్చిపోయింది. అధ్యక్షులను మార్చడాలు.. హడావుడి చేయడాలన్నీ.. ఎక్మో ట్రీట్‌మెంట్ ఇచ్చినట్లే ! ఇంకా పచ్చిగా చెప్పాలంటే.. శవానికి ట్రీట్‌మెంట్ ఇవ్వడమే ! ఈ నిజాన్ని కొందరు ముందుగానే గుర్తించారు. ఇలా రాష్ట్ర విభజన జరగగానే అలా తమ దారి తాము చూసుకున్నారు. సేఫ్‌ జోన్‌లోకి వెళ్లిపోయారు. టీజీ వెంకటేష్‌, గంటా శ్రీనివాసరావు వెంటనే 2014లోనే టీడీపీలో చేరిపోగా.. అనంతపురం జేసీ బ్రదర్స్ ఆ తర్వాత సైకిలెక్కారు.

తత్వం ఆలస్యంగా బోధపడిందో.. ఇక తప్పదు అనుకున్నారో కానీ.. బొత్స, ధర్మానలాంటి వాళ్లు 2019లో వైసీపీలో చేరారు. వైఎస్ఆర్‌ ఆత్మలాంటి కేవీపీ రామచంద్రరావుతో పాటు.. ఉండవల్లి అరుణ్‌ కుమార్‌లాంటి వాళ్లు అస్త్ర సన్యాసం తీసుకున్నారు. ఇప్పుడు తమ రాజకీయ అనుభవాలు చెప్తున్నారే తప్ప.. తమ అనుభవం రాజకీయానికి ఎలా యూజ్ అవుతుందన్న దానిపై పెదవి విప్పడం లేదు. ఇక రఘువీరా వ్యవసాయం మొదలుపెట్టారు. ఊరిలో సామాన్యుడిలా బతుకుతున్నాడు. క్వాలిటీ లైఫ్ అంటే ఏంటో చూపిస్తున్నాడు.. దాదాపు రాజకీయాలకు దూరం అయ్యాడు. కాంగ్రెస్‌ అనేది ఇప్పుడు కేఏ పాల్ పార్టీ కంటే దారుణంగా తయారయింది ఏపీలో ! పడిన ప్రతీసారి లేచే అవకాశం ప్రతీ ఒక్కరికి ఉంటుంది.. ఐతే కాంగ్రెస్‌కు మాత్రం అసలు అలాంటి చాన్స్ కూడా ఉండేలా కనిపించడం లేదు. వంద ఏళ్లు అయినా.. ఏపీలో ఆ పార్టీ బతికే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయం తీరే మారిపోయింది. ఇలాంటి సమయంలో పోటీ పడలేరు. పోటీని తట్టుకోలేరు. దీంతో ఇంకెక్కడి కాంగ్రెస్‌ రా నాయనా అనుకుంటున్నారు ఏపీ జనాలు.