Congress: అధికారంలోకి వస్తే బజరంగ్‌దళ్‌పై నిషేధం.. కాంగ్రెస్‌ సెల్ఫ్‌గోల్ వేసుకుందా.. బీజేపీని ఫాలో అవుతోందా ?

గెలుపు అంటే ఎంత దూరం ప్రయాణం చేశామన్నది కాదు.. ప్రయాణం ఎక్కడ ఆగాం.. ఎక్కడ మలుపు తీసుకున్నామన్నదే అసలు మ్యాటర్‌! ఇదే విషయం అర్థమైంది అనుకుంటా కాంగ్రెస్‌కు.. కర్ణాటక మేనిఫెస్టో చూస్తే అర్థం అవుతోంది అదే! ఎవ్రీథింగ్ ఫెయిర్ ఇన్ లవ్‌ అండ్‌ వార్ అంటారు.. ఈ రెండే కాదు రాజకీయాల్లోనూ ప్రతీది ఫెయిరే ! ఇలానే చేయాలని లేదు కాబట్టే.. రాజకీయం ఇలా తయారైందనే మాటలు వినిపించేది అందుకే ! ఇది సక్సెస్ ఫార్ములా అనుకుంటే.. ప్రత్యర్థితో పాటు అదే స్ట్రాటజీని ఫాలో అవుతుంటాయ్‌ పార్టీలన్నీ! ఇప్పుడు కర్ణాటకలో చేస్తోంది అదే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 8, 2023 | 05:15 PMLast Updated on: May 08, 2023 | 5:15 PM

What Strategy Impliment The Congress In Karnataka Bajrangdal

రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్‌.. తన మేనిఫెస్టోలో చేర్చింది. ఇదే ఇప్పుడు కన్నడనాట రాజకీయ రచ్చకు కారణం అవుతోంది. కాంగ్రెస్‌ ఇలాంటి హామీ ఎందుకు ఇచ్చింది.. మతం అనే సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి ఎన్నికల్లో లాభపడాలని భావిస్తోందా.. దీనికోసం బీజేపీనే ఫాలో అవుతుందా.. అసలీ హామీ కాంగ్రెస్‌ను అధికారానికి దగ్గర చేస్తుందా.. లేదంటే బూమరాంగ్ అవుతుందా అనే చర్చ కన్నడ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌ హామీ తర్వాత.. బజరంగ్‌దళ్‌ను బజరంగ్‌బలికి కనెక్ట్‌ చేసేలా.. హనుమాన్‌చాలిసా పాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ, బజరంగ్‌ శ్రేణులు నిరసనలకు పిలునిచ్చాయి. దీంతో కాంగ్రెస్‌ నిర్ణయం బీజేపీకి ఆయుధంగా మారిందా.. సరిగ్గా ఎన్నికల ముందు హస్తం పార్టీ తప్పుడు నిర్ణయం తీసుకుందా అనే చర్చ జరుగుతోంది.

మతం సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడం ద్వారా.. అది బీజేపీకే ప్లస్ అవుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి కోస్తా కర్ణాటకలోని 20 అసెంబ్లీ నియోజకవర్గాలు.. బీజేపీకి హిందూత్వ లాబోరేటరిలాంటివి. ఈ 20 స్థానాల్లో కమలం పార్టీ భారీగా బలం పుంజుకుంది. రామ్‌మందిర్‌, ఆర్టికల్‌ 370, యూనిఫామ్ సివిల్‌ కోడ్‌, హలాల్, హిజాబా, అజాన్‌, టిప్పు సుల్తాన్ వివాదం… ఇలాంటి అంశాలతో కమలం పార్టీ భారీగా బలం పుంజుకుందీ 20 స్థానాల్లో ! ఇక మిగతా ప్రాంతాల్లో హిందూత్వ వ్యవహారం అనేది పీక్స్‌కు చేరింది. ఇప్పుడికిప్పుడు బీజేపీ ఎన్ని సెంటిమెంట్లు తెరమీదకు తీసుకువచ్చినా.. హిందూత్వ వ్యవహారం తగ్గడమే తప్ప ఓట్ల రూపంలో పెద్దగా ఉపయోగపడేలా కనిపించడం లేదు.

కాంగ్రెస్‌ మేనిఫెస్టోకు వ్యతిరేకంగా బీజేపీ నిరసనలు అందుకున్నా.. ఓట్లు పెరుగతాయేమో కానీ.. సీట్లు పెరిగే ఛాన్స్ మాత్రం అసలు లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ధరల పెరుగుదల, నిరుద్యోగంలాంటి అంశాలే ఈ ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయ్. ఇలాంటి సమయంలో బజరంగ్‌దళ్ ఇష్యూ తెరమీదకు తీసుకొచ్చి.. అందులోకి కమలం పార్టీని లాగి.. బీజేపీపై సైకలాజికల్‌గా కాంగ్రెస్‌ పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. బజరంగ్‌దళ్‌పై నిషేధం అనే హామీ ద్వారా.. ఒకరకంగా రివర్స్‌ పోలరైజేషన్‌ను కాంగ్రెస్‌ మొదలుపెట్టినట్లు అర్థం అవుతోంది. హిందూ వర్గంలో కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంక్ చెక్కుచెదరకుండా ఉంది. బజరంగ్‌దళ్‌పై బ్యాన్‌లాంటి హామీ ద్వారా.. కోస్తా కర్ణాటకలోనే ఎక్కువ ప్రభావం ఉంటుంది. అక్కడ ఎలాగూ సీట్లు లేవు, ఓట్లు లేవు కాబట్టి.. వచ్చే నష్టం లేదు. కోల్పోవడానికి ఏమీ లేనప్పుడు.. ఓడిపోతామన్న భయం ఉండదు.

ఇప్పుడు కాంగ్రెస్‌ ఫాలో అవుతోంది కూడా అదే ! బజరంగ్‌దళ్‌ హామీ ద్వారా.. బీజేపీని నిరసల్లోకి దింపి.. ఆ పార్టీకి మైనారిటీ వర్గాలను పూర్తిగా దూరం చేసి.. వాళ్లను దగ్గర చేసుకోవాలన్నది హస్తం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ముస్లీంవర్గాల్లో కాంగ్రెస్‌కు 13శాతం ఓటు బ్యాంక్‌ ఉంది. ఇది ఇప్పుడు మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు చర్చిలపై దాడి చేసిన ఘటనలు.. ఈ మధ్య కర్ణాటకలో వెలుగుచూశాయి. దీంతో ఇప్పుడీ హామీ ద్వారా.. ఆ ఓట్లు కూడా కాంగ్రెస్‌ ఖాతాలో చేరే అవకాశం ఉంటుంది. ఇలా బీజేపీ మీద సైకలాజికల్‌ గేమ్ మొదలుపెట్టిన కాంగ్రెస్‌.. పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. కర్నాటకలో వర్కౌట్ అయి విజయం సాధిస్తే.. ఇదే వ్యూహాన్ని కాంగ్రెస్ దేశమంతా అనుసరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.