చదువులకు ఓ శాఖా…! మూసిపారేయండి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేసినా సంచలనమే... నేను అనుకుంటే అయిపోవాలంతే అన్నది ఆయన రూల్... లేటెస్ట్‌గా ఆయన విద్యాశాఖపై పడ్డారు. అసలు మనకు ఆ శాఖ అవసరమా అన్న థాట్ ఆయన మనసులో మెదిలింది. అంతే కొన్నిరోజుల్లోనే దాన్ని రద్దు చేసేశారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేసినా సంచలనమే… నేను అనుకుంటే అయిపోవాలంతే అన్నది ఆయన రూల్… లేటెస్ట్‌గా ఆయన విద్యాశాఖపై పడ్డారు. అసలు మనకు ఆ శాఖ అవసరమా అన్న థాట్ ఆయన మనసులో మెదిలింది. అంతే కొన్నిరోజుల్లోనే దాన్ని రద్దు చేసేశారు.
విద్యాశాఖ… అత్యంత కీలకమైన శాఖ… దేశంలో విద్యాభివృద్ధికి, నైపుణ్యాభివృద్ధికి అత్యంత కీలకమైన విభాగం… మన దగ్గర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విద్యాశాఖలు నిర్వహిస్తాయి. ప్రతి దేశంలోనూ విద్యకంటూ ప్రత్యేకంగా ఓ శాఖ ఉంటుంది. ఆ శాఖ మంత్రికి ఓ గౌరవం ఉంటుంది. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్‌నకు మాత్రం అదో చెత్త విభాగం అనిపించింది. ఎన్నికల ముందు నుంచి దాన్ని రద్దు చేస్తామని ఆయన చెబుతూనే వస్తున్నారు. ఇప్పుడు దాన్ని అమలు చేసేశారు.
విద్యాశాఖ మూసివేతకు ట్రంప్ చెబుతున్న రీజన్. ప్రభుత్వ వ్యయం. అంటే విద్యాశాఖపై అనవసరంగా ఖర్చు చేస్తున్నామన్నది ఆయన బాధ. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ ఖర్చులు తగ్గిస్తున్నారు. పలు విభాగాల్లో ఉద్యోగుల కోత పెట్టారు. వివిధ దేశాలకు సాయం నిలిపివేశారు. ఓ రకంగా కత్తెర పట్టుకుని తిరుగుతున్నారు. ఇక DOGE పేరుతో ఓ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఎక్కడ కోతలు పెట్టాలన్నది చెప్పడమే. అందులో భాగంగానే విద్యాశాఖను క్లోజ్ చేయాలని డిసైడయ్యారు. వైట్‌హౌస్‌లో పాఠశాల విద్యార్థులతో ఓ కార్యక్రమం నిర్వహించారు ట్రంప్. ఆ తర్వాతే ఆయన ఫైల్‌పై సైన్ చేశారు. విద్యాశాఖ ద్వారా ఎలాంటి మేలు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఆ శాఖ అధికారాలాను రాష్ట్రాలకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ట్రంప్. అయితే, విద్యార్థుల ఫీజుల రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. గతంలోనే విద్యాశాఖలో ఉద్యోగుల్ని తగ్గిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు పూర్తిగా దాన్ని మూసివేసింది. అమెరికా విద్యాశాఖలో 4వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వారిలో కొందరు స్వచ్ఛందంగా రాజీనామాలకు ముందుకొచ్చారు. మిగిలిన వారిని ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది. వారిని బలవంతంగా సాగనంపుతారా లేక ఇంకెక్కడైనా అడ్జస్ట్ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. 2వేల మందిని ముందుగా లీవ్‌లో పంపేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే విద్యాశాఖ మంత్రి ఉన్నారు. లిండా మెక్‌మాన్‌ను మంత్రిగా నియమించారు. తన చేతుల మీదుగానే ఆ శాఖకు ముగింపు పలికారు ట్రంప్.
అమెరికాలోని ప్రతి రాష్ట్రంలోనూ విద్యకు ప్రత్యేక విభాగాలున్నాయి. అలాంటప్పుడు ఫెడరల్ గవర్నమెంట్ వృధాగా డబ్బులెందుకు వేస్ట్ చేయాలన్నది ఆయన ప్రశ్న. వాళ్ల చావు వాళ్లు చస్తారు మళ్లీ మనకెందుకొచ్చిన తంటా అన్నది ఆయన ఆలోచన. ఆ నిధులను రాష్ట్రాలకు ఇచ్చి మనం చేతులు దులుపుకుందామన్నది ఆయన ఉద్దేశం. నిజానికి అమెరికా స్కూళ్లు, కాలేజీలను ఫెడరల్ ప్రభుత్వం నడుపుతుందని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు… రాష్ట్రాలు, జిల్లాలే వాటిని నిర్వహిస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే కేవలం 13శాతం మాత్రమే ఫెడరల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. మిగిలినవన్నీ స్థానిక పన్నులతోనే నడుస్తాయి. అందుకే ట్రంప్ దాన్ని క్లోజ్ చేయలనుకున్నారు. 1979లో ఏర్పాటైన ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ విద్యార్థుల లోన్లు, పేద విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
ట్రంప్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డెమోక్రాట్లు దీన్ని తప్పుపట్టారు. ట్రంప్ తీసుకున్న విధ్వంసకర, వినాశకరమైన చర్యల్లో ఇదొకటి అంటూ మండిపడ్డారు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌ను మూసేయడం ఆయన అనుకున్నంత సులువు కాదు. దీనికి న్యాయపరమైన చిక్కులు చాలానే ఉన్నాయి. ఇప్పటికే పలు సంస్థలు కోర్టులను ఆశ్రయించాయి. ఇక అమెరికన్ కాంగ్రెస్ కూడా దీన్ని ఆమోదించాల్సి ఉంది. ప్రస్తుతం సెనెట్‌లో రిపబ్లికన్లకు 53మంది సభ్యులున్నారు. కానీ ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 60మంది అనుకూలంగా ఓటేయాలి. ఇది ట్రంప్‌కు బిగ్ టాస్క్