Top story: టన్నెల్ కూలి నెల రోజులు ఆ ఏడుగురు ఏమయ్యారు ?

కాల గమనంలో బతుకులకే విలువ లేదు.. శవాలకు ఉంటుందా ! తప్పిపోయిన మనిషి గురించి పట్టించుకునే ఓపికే లేదు ఈ వ్యవస్థకు.. అలాంటిది ఇక లేరని.. రారని.. చనిపోయారని తెలిసి.. వాళ్ల కోసం వెతుకుతారా.. ఇక ఆ చీకట్లలో.. మట్టి దుబ్బల్లో.. కాంట్రీట్‌లో

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 22, 2025 | 06:05 PMLast Updated on: Mar 22, 2025 | 6:05 PM

Where Are Those Seven Cant Even Find The Bodies

కాల గమనంలో బతుకులకే విలువ లేదు.. శవాలకు ఉంటుందా ! తప్పిపోయిన మనిషి గురించి పట్టించుకునే ఓపికే లేదు ఈ వ్యవస్థకు.. అలాంటిది ఇక లేరని.. రారని.. చనిపోయారని తెలిసి.. వాళ్ల కోసం వెతుకుతారా.. ఇక ఆ చీకట్లలో.. మట్టి దుబ్బల్లో.. కాంట్రీట్‌లో కలిసిపోవాల్సిందేనా ఆ శవాలు ! SLBC టన్నెల్‌ ప్రమాదానికి నెల రోజులు పూర్తయిన వేళ వినిపిస్తున్న మాటలు ఇవి. SLBC సొరంగ పనుల్లో ఫిబ్రవరి 22న ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8మంది సజీవ సమాధి అయ్యారు. ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అధికారులు.. ప్రమాదం జరిగిన 16వ రోజున ఒక డెడ్‌బాడీని వెలికి తీసి కుటుంబసభ్యులకు అప్పగించారు. మరో 7 మృతదేహాల కోసం నెలరోజులుగా గాలింపు జరుగుతూనే ఉంది. ఇంతకీ ఆ ఏడు డెడ్‌బాడీలు ఎక్కడ.. ఎప్పటివరకు బయటకు తీస్తారు.. అసలు తీస్తారా లేదా.. తీసేందుకు ప్రయత్నించినా దొరుకుతాయా లేదా.. డెడ్‌బాడీల వెలికితీత అసలు సాధ్యమయ్యే పనేనా.. ప్రమాదం జరిగి నెల రోజులు అయింది. దీంతో స్కెల్టన్‌ లెవల్‌కు మారిపోయి ఉంటాయ్.

ఇప్పుడు వెతికినా, దొరికినా.. ఎముకలు మాత్రమే లభిస్తాయ్.. అలాంటిది ఎలా గుర్తిస్తారు.. డీఎన్ఏ టెస్టులు చేసి కుటుంబాలకు ఎప్పుడు అప్పగిస్తారు.. ఇలా చాలా ప్రశ్నలు.. ప్రతీ ఒక్కరి మెదళ్లలో మెదులుతున్నాయ్. డెడ్‌బాడీలను తీయలేకపోతే.. ప్రభుత్వం నుంచి ప్రకటన ఎలా ఉంటుంది.. అసలు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్ ఏం చెప్తోందనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయ్.
శ్రీశైలం వైపు నుంచి 14వ కిలోమీటర్ దగ్గర SLBC టన్నెల్‌లో బోరింగ్ మిషన్‌తో పనులు చేస్తుండగా.. పైకప్పు కూలింది. 42మంది కూలీలు ప్రాణాలతో బయటపడగా…. 8 మంది చిక్కుకొని ప్రాణాలు వదిలారు. వారి మృతదేహాల కోసం నెల రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎప్‌, , సింగరేణి రెస్క్యూ టీమ్‌, సౌత్ సెంట్రల్ రైల్వే, ర్యాట్ హోల్ మైనర్స్, ఇండియన్ ఆర్మీతో పాటు.. జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన రెస్క్యూ టీమ్‌లు.. ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయ్‌. అయినా సరే.. టిబియం మిషన్ సమీపంలో ఇంజినీర్ గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీ మాత్రమే తీయగలిగారు. మిగిలిన ఏడు డెడ్‌బాడీల ఆనవాళ్లు కనిపెట్టలేకపోయారు. డేంజన్ జోన్‌గా చెప్తున్న D1 ప్రాంతంలో తవ్వితే.. డెడ్‌బాడీలు లభించే చాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు. ఐతే టన్నెల్‌లో జీరో పాయింట్‌గా చెప్పే 14వ కిలోమీటర్ దగ్గర.. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని.. అక్కడ రెస్క్యూ మరింత రిస్క్ అంటున్నాయ్ టీమ్స్‌.

సీపేజ్ జోన్, షీర్ జోన్‌గా చెప్పే ఆ ప్రాంతంలో… నీటి ఊట ఎక్కువగా ఉండటం, టిబియం మిషన్ అడ్డుగా ఉండటం.. ఇప్పుడు ప్రతికూలంగా మారింది. అక్కడ తవ్వితే మరో మారు పైనుంచి భూమి కుంగే చాన్స్‌ ఉండటంతో… ఆ ప్రాంతంలో అడుగుపెట్టాలంటేనే జంకుతున్న పరిస్థితి. టన్నెల్‌లో మృతదేహాల వెతుకులాట కోసం.. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో పాటు.. జాగిలాల సేవలు.. అనుభవం ఉన్న వివిధ రెస్క్యూ టీమ్‌లను ఉపయోగిస్తున్నారు. జీపీఆర్ఎస్, క్యాడవర్ డాగ్స్ ద్వారా గుర్తించి పలు ప్రదేశాల్లో తవ్వినా ఫలితం లేకుండా పోయింది. ఇక అటు రోబోటిక్ యంత్రాలను టన్నెల్‌ లోపలికి పంపించినా.. అవి పనిచేసేందుకు అనుకూలమైన పరిస్థితులు లేవు. ఇక అటు SLBC టన్నెల్‌లో ప్రమాదం జరిగినప్పటి నుంచి… రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఊరుతున్న నీటిని ఎప్పటికప్పుడు డీవాటరింగ్ చేయడంతో పాటు.. అడ్డుగా ఉన్న బోరింగ్ మిషన్ కటింగ్ పనులు నడుస్తున్నాయ్‌. మరోవైపు ప్రమాదం జరిగిన రోజు ధ్వంసమైన కన్వేయర్ బెల్ట్‌ను పునరుద్ధరించి.. వ్యర్దాల తొలగింపు చేపడుతున్నారు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో.. ఎనిమిది నుంచి పది అడుగుల లోతు తవ్వుతూ మృతదేహాల కోసం సెర్చ్ చేస్తున్నారు.

అయినా డెడ్‌బాడీల జాడ దొరకలేదు. మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. అసాధ్యంగా మారిన మ్రతదేహాల వెలికితీత అంశంలో.. రెస్క్యూ ఆపరేషన్ ఎప్పటివరకు అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయ్‌. ప్రమాదకరమైన గనులు, గుహలు, సొరంగాలు, జలాంతర్గాముల్లో ప్రమాదాలు జరిగి మృతదేహాలు దొరకకుండా పోయినప్పుడు.. ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు, ప్రకటనలు చేస్తాయి అనే అంశాలపై చర్చ మొదలైంది. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఏం చెప్తుందనే చర్చ జరుగుతోంది. ఇక అటు నల్గొండ జనాల చిరకాల స్వప్నం SLBC. ఇప్పటికే దాదాపు 80శాతం పనులు జరిగిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి సర్కార్ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటనే అంశాలపై విశ్లేషణలు కొనసాగుతున్నాయ్‌. ఓవరాల్‌గా SLBC టన్నెల్‌లో చనిపోయిన కార్మికుల మృతదేహాలను ఎప్పటి వరకు తీయగలరు.. ఈ వ్యవహారానికి ఎప్పటిలోగా పులిస్టాప్ పెడతారో అనే అంశంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి కనిపిస్తోంది.