TBJP: టీబీజేపీ వంద రోజుల ప్లాన్ ఎక్కడ..? ఎన్నికల మీద ఆశలు వదిలేసుకున్నారా ?
ప్రతీసారి హడావుడి చేయడం.. ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం కామన్ అయింది కమలం పార్టీకి ! వంద రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. మిషన్ 75 టార్గెట్‌గా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఐతే దాన్ని ఆచరణలో పెట్టడంలో మాత్రం బీజేపీ ఘోరంగా విఫలం అవుతోంది.
తెలంగాణలో పొలిటికల్ హీట్ పీక్స్‌కు చేరింది. అన్ని పార్టీలు వారి వారి వ్యూహరచనలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఐతే బీజేపీ పరిస్థితి మాత్రం విభిన్నంగా కనిపిస్తోంది. ప్రతీసారి హడావుడి చేయడం.. ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం కామన్ అయింది కమలం పార్టీకి ! రాష్ట్ర నేతలతో ఢిల్లీలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు అమిత్ షా ఆ మధ్య ! వంద రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. మిషన్ 75 టార్గెట్‌గా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఐతే దాన్ని ఆచరణలో పెట్టడంలో మాత్రం బీజేపీ ఘోరంగా విఫలం అవుతోంది. రాష్ట్ర నాయకత్వం దీన్ని లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
బీజేపీలో కొద్దిరోజులుగా అనుకున్నంత స్థాయిలో యాక్టివిటీ జరగడం లేదు. బయట పార్టీ నేతలే కాదు.. బీజేపీలో ఉన్న నాయకులే ఈ మాట అనుకుంటున్నారు. లీడర్లు ఎవరి పనుల్లో వారు ఉన్నారు. పార్టీని పట్టించుకోవడం మానేశారు. కర్ణాటక ఫలితం తెలంగాణ బీజేపీపై ఘోర ప్రభావం చూపుతోంది. ఒక్కసారిగా పార్టీ సైలెంట్‌గా మారిపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే అధ్యక్షుడి మార్పు నేతలందరినీ షాక్‌లో పడేసింది. పార్టీ అన్నాక మార్పులు చేర్పులు సహజమని భావించి ముందుకు వెళ్దామని అనుకున్నప్పటికీ… చెప్పుకోదగ్గ యాక్టివిటీ లేకపోవడంతో నేతలు డీలాపడ్డారు. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఇతర పార్టీల నేతలు నమ్మారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో ఎంతో మంది సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు కాషాయతీర్థం పుచ్చుకున్నారు. ఐతే కేసీఆర్‌కు చెక్ పెట్టేలా అనుకున్న స్థాయిలో ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. ఈ విషయంలో బీజేపీ వెనుకబడిరదని పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ సర్కార్‌ను ఇరుకున పెట్టే ఎన్నో సమస్యలు ఉన్నా.. వాటిని లేవనెత్తడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారనే చర్చ జరుగుతోంది. పార్టీ పెద్దల తీరుతో కిందిస్థాయి నేతల్లోనూ దిగులు కనిపిస్తోంది. రాష్ట్రంలో కొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయ్. అన్ని పార్టీలు వారి గ్రౌండ్ స్ట్రాంగ్ చేసుకునే పనిలో పడ్డాయ్. బూత్ స్థాయి ఇంచార్జీల నియామకం, విస్తారక్, పాలక్‌లను నియమించినా… వారితో క్షేత్రస్థాయిలో పని చేయించుకోవడంలో బీజేపీ వెనకే ఉండిపోయింది. ఈ పరిణామాలన్నింటితో బీజేపీ తీరుపై కొత్త అనుమానాలు వినిపిస్తున్నాయ్. ఎన్నికలను కమలం పార్టీ లైట్ తీసుకుందా.. ఆశలు వదిలేసుకుందా అనే చర్చ జరుగుతోంది.