Jagan – MLC Elections: వైసీపీకి హ్యాండిచ్చే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు…?

నిజానికి కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు హైకమాండ్ తీరుపై సంతృప్తిగా లేరన్న ప్రచారం చాలాకాలంగానే జరుగుతోంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు ఓటు అటూ ఇటూ చేస్తే ఏడుకు ఏడు ఖచ్చితంగా గెలవలేరు. ఇది వైసీపీని టెన్షన్ పెడుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 17, 2023 | 12:32 PMLast Updated on: Mar 17, 2023 | 12:32 PM

Who Are Those Two Mlas Who Will Give Hand To Ycp

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడుకు ఏడు గెలవాలని వైసీపీ అధినేత భావిస్తున్నా ఆ పార్టీ ఎమ్మెల్యేలే షాకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కోటంరెడ్డి, ఆనం టీడీపీకి ఓటేయడం దాదాపు ఖాయమే అయినా మరో ఒకరిద్దరు హ్యాండ్ ఇవ్వడం ఖాయమంటున్నారు. దీంతో ఎవరా ఇద్దరన్న చర్చ మొదలైంది….

ఏపీలో ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఏడు స్థానాలు గెలిచేస్తామని ధీమాలో ఉన్న వైసీపీకి చంద్రబాబు తెలివిగా చెక్ పెట్టారు. పంచమర్తి అనురాధను రంగంలోకి దించారు. గెలవలేమని తెలిసినా టీడీపీ ఎందుకు రంగంలోకి దిగిందన్నది ఆలోచిస్తే దాని వెనక చంద్రబాబు చాణక్యం కనిపిస్తోంది. ఎమ్మెల్సీ సీటు గెలవాలంటే 22మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. అయితే వైసీపీకి స్పీకర్ మినహా 150మంది ఎమ్మెల్యేలున్నారు. టీడీపీ నుంచి గెలిచిన మరో నలుగురు మద్దతిస్తున్నారు. దీంతో వైసీపీ బలం 154కి చేరుతుంది. అంటే ఏడు ఎమ్మెల్సీ స్థానాలు గెలవడానికి సరిగ్గా లెక్క సరిపోతుంది. కానీ ఈ లెక్కలోనే ఓ లొసుగు ఉంది. పేరుకు వైసీపీకి 154మంది కనిపిస్తున్నా.. అందులో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. అసెంబ్లీలోనే తగ్గేదేలే అంటున్నారు. ఇక అదే జిల్లాకు చెందిన ఆనం కూడా టీడీపీ నేతలతో రాసుకు పూసుకు తిరుగుతున్నారు. వీరిద్దరూ వైసీపీకి ఓటేసే అవకాశాలు స్పష్టంగా కనిపించడం లేదు. తాజాగా మరో వార్త ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో తెగ తిరుగుతోంది. మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి ఓటేస్తారని చెప్పుకుంటున్నారు. ఇది టీడీపీ చేయిస్తున్న ప్రచారమా లేక నిజంగానే ఇద్దరు పార్టికి దూరమవుతున్నారా అన్న అనుమానాలున్నాయి. నిజానికి కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు హైకమాండ్ తీరుపై సంతృప్తిగా లేరన్న ప్రచారం చాలాకాలంగానే జరుగుతోంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు ఓటు అటూ ఇటూ చేస్తే ఏడుకు ఏడు ఖచ్చితంగా గెలవలేరు. ఇది వైసీపీని టెన్షన్ పెడుతోంది. గీత దాటడానికి సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరన్నది కూడా వైసీపీ అధిష్ఠానానికి తెలుసంటున్నారు. వారిని బుజ్జగించే పనిలో పార్టీ పెద్దలు ఉన్నట్లు కూడా చెప్పుకుంటున్నారు.

ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మంత్రులకు కూడా పరీక్ష పెడుతున్నాయి. ఏ జిల్లా ఎమ్మెల్యే గీత దాటితే ఆ జిల్లాకు చెందిన మంత్రి పదవి పోయే అవకాశాలెక్కువగా కనిపిస్తున్నాయి. కేబినెట్ సమావేశంలో ఈ సంకేతాలు కూడా ఇచ్చారు సీఎం. పనితీరు అని చెప్పినా అది ఎమ్మెల్సీ ఎన్నికల గురించే అని మంత్రులకు స్పష్టంగా అర్థమైంది. దీంతో తమ జిల్లా ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసుకుంటున్నారు.

గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలు చాలామంది ఓటింగ్ సమయంలో తప్పు చేశారు. ఫలితమే తారుమారైన సందర్భాలున్నాయి. ఈసారి పొరపాటున ఒకరిద్దరు అలా చేస్తే అది టీడీపికి అడ్వాంటేజ్ గా మారుతుంది. అందుకే అలా జరగకుండా వైసీపీ పెద్దలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కావాలని పొరపాటు చేయాలనుకుంటే దాన్ని ఎవరూ ఆపలేరు కదా…! ఇదే పార్టీని కలవరపెడుతోంది. ఒక్క ఓటు ఇన్ వాలీడ్ అయినా కష్టమే.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనంలను కంట్రోలే చేయడానికి విప్ అస్త్రాన్ని ఉపయోగించే అవకాశమే లేదు. నిజానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు విప్ జారీ చేయవచ్చు. ఒకవేళ ఆ ఇద్దరు టీడీపీకి ఓటేస్తే వారిని అనర్హులుగా ప్రకటింప చేసే అవకాశం కూడా ఉంది. కానీ అది దాదాపు అసాధ్యం. ఎందుకంటే టీడీపీ కూడా విప్ జారీ చేస్తుంది. ఆ పార్టీ తరపున గెలిచిన నలుగురు ఆ పార్టీకే ఓటేయాల్సి ఉంటుంది. వేయకపోతే వారిపై కూడా అనర్హత వేటు వేయాల్సి వస్తుంది. ఆనం, కోటంరెడ్డిపై చర్యలు తీసుకుంటే వీరిపై కూడా తీసుకోవాల్సి ఉంటుంది. పోనీ ఆ నలుగురు రెబల్ టీడీపీ అభ్యర్థుల్ని ఓటింగ్ కు దూరంగా ఉంచుదామా అంటే అది కుదిరే పనికాదు. వారు కూడా ఖచ్చితంగా ఓటేస్తేనే ఏడో సీటు గెలవగలరు. ఇక వైసీపీ ముందున్న మరో మార్గం మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిని మేనేజ్ చేయడం. అయితే ఇన్నాళ్లూ వైసీపీ ఒత్తిడిని తట్టుకుంటూ వచ్చిన నేతలు.. పార్టీకి సానుకూల పరిస్థితులు ఏర్పడుతున్న సమయంలో ఆ సాహసం చేస్తారా అంటే అనుమానమే…

మొత్తంగా చూస్తే చంద్రబాబు జగన్ కు గట్టి పరీక్షే పెట్టారు. మరి ఈ పరీక్షల్లో జగన్ నెగ్గుతారా…? చంద్రబాబుకు ఊహించని షాకి ఇచ్చి ఏడు ఎమ్మెల్సీ స్థానాలను గెలుస్తారా…?