విజయసాయిరెడ్డి పగ ఎవరిపై? జగన్ మీదా.. భారతి మీదా..?
విజయసాయిరెడ్డి... ఇప్పుడు ఈ పేరు వింటేనే జగన్ ఉలిక్కిపడుతున్నాడు. ఒకప్పుడు వినే అవసరం లేదు.. ఎప్పుడంటే అప్పుడు కనపడేవాడు. ఇప్పుడు మాత్రం విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నాడంటే చాలు..

విజయసాయిరెడ్డి… ఇప్పుడు ఈ పేరు వింటేనే జగన్ ఉలిక్కిపడుతున్నాడు. ఒకప్పుడు వినే అవసరం లేదు.. ఎప్పుడంటే అప్పుడు కనపడేవాడు. ఇప్పుడు మాత్రం విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నాడంటే చాలు.. బెంగళూరులో టీవీలకు అతుక్కుని చూడాల్సి వస్తుంది జగన్ అండ్ కో కి. లిక్కర్ స్కామ్ లో ఉన్నది ఉన్నట్లు చెప్పటానికి రెడీ అయిపోయాడు. ఎందుకో తెలియదు గాని.. వాళ్లు అడిగిన డేట్ కాకుండా.. ముందే వస్తానన్నాడు.. ఇప్పుడు రావడం కుదరడం లేదన్నాడు. ప్రతి మూమెంట్ కి మాత్రం జగన్ బ్యాచ్ వణుకుతున్నారు. ఒకప్పుడు వైసీపీకి ఆయన తురుపుముక్క.. కాని కలుపు మొక్కను చేసి పక్కన పడేశారు.. ఇప్పుడు అందుకే చుక్కలు చూపిస్తున్నాడు. అసలు విజయసాయిరెడ్డికి జగన్ మీద అంత పగ ఎందుకు? ఎవరి మీద కోపం ఇదంతా?
అసలైతే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కుటుంబానికి ఆడిటర్. కాని దాదాపు కుటుంబసభ్యుడైపోయాడు. అంత నమ్మకస్తుడు. ఎంత నమ్మకస్తుడంటే.. జగన్ అక్రమాస్తుల కేసులో ఈయనే ఏ2 అయ్యేంతగా. అన్ని కేసులొచ్చినా భయపడలేదు.. వెనక్కు తగ్గలేదు. నీ వెంటే నేను అంటూ జగన్ తో పాటు జైలుకి వెళ్లాడు. తర్వాత పార్టీకి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పాడు. బిజెపి పెద్దలకు దగ్గరయ్యాడు. జగన్ కు బిజెపి నేతలకు మధ్య లింకుగా మారాడు. ఏ డీల్ అయినా సరే ఈయన చేయాల్సిందే. జగన్ తర్వాత ఆయనే అన్నంతగా అయ్యాడు. కాని 2019లో విజయం తర్వాత సీన్ మారిపోయింది. అప్పటివరకు విజయసాయి పరపతి చూసి అసూయపడినవారంతా.. ఎలాగోలా ఆయనను విశాఖకే పరిమితం చేయాలని చూశారు. అలా చూసినవారిలో సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి బ్యాచ్ ఉన్నారు. అయితే విజయసాయి విశాఖలో ఉన్నా ఎక్కడ ఉన్నా చక్రం తిప్పేవాడు. వైజాగ్ లో చాలా భూములు లేపేశారని ఆరోపణలు వచ్చాయి. విశాఖను తన సామ్రాజ్యం చేసుకున్నారని విమర్శలు వచ్చాయి. అయితే ఈ సంపాదనలో తాడేపల్లికి రావాల్సిన వాటా రావటం లేదంటూ కోటరీ భారతి చెవిలో ఊదితే.. ఆవిడ జగన్ చెవిలో నూరిపోసింది. అంతే విజయసాయిరెడ్డిపై అనుమానాలు మొదలయ్యాయి.
ఒక దశలో విజయసాయిరెడ్డి కేవలం విశాఖ మాత్రమే అని.. మిగతా అంతా సజ్జల చూసుకుంటాడని ప్రకటించారు. దీంతో జగన్ కు ఎప్పుడూ ఢిల్లీలో వచ్చే అపాయింట్ మెంట్ రాలేదు.. ఢిల్లీ వెళ్లి మరీ వెనక్కి రావాల్సి వచ్చింది. అలా పవర్ చూపించాడు విజయసాయిరెడ్డి. దీంతో జగన్, కోటరీ కాస్త వెనక్కు తగ్గాల్సి వచ్చింది. కాని ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ విజయసాయిరెడ్డికి చెక్ పోస్టులు పెట్టడం మొదలెట్టారు. సోషల్ మీడియా విజయసాయిరెడ్డి చూసేవాడు. ఐప్యాక్ తోనూ ఆయనే కోఆర్డినేషన్. అవి కూడా తీసేసి సోషల్ మీడియా సజ్జల కొడుక్కి అప్పచెప్పి.. ఆయనే ఐప్యాక్ చూసుకుంటాడన్నారు. దీంతో చాలా అవమానంగా ఫీలయ్యాడు విజయసాయిరెడ్డి. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడ్డం తిరిగి టీడీపీలోకి వెళ్లడంతో.. అక్కడ ఎంపీగా విజయసాయిరెడ్డి వెళ్లాలంటూ కోటరీ పట్టుబట్టింది. ఓడిపోతాడని తెలిసే పంపారు. అయినా లోపల కోపం దిగమింగుకుని.. తలొంచుకుని వెళ్లి ఓడిపోయాడు విజయసాయిరెడ్డి.
లిక్కర్ స్కామ్ లో అసలు క్యాండేట్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని జగన్ విజయసాయిరెడ్డికి పరిచయం చేసి.. ఎంకరేజ్ చేయమని చెప్పాడంట. మూడు నెలలు విన్నట్లే విని.. తర్వాత తన విశ్వరూపం చూపించాడు కసిరెడ్డి. ఆఖరికి జగన్ కే శఠగోపం పెట్టి.. లిక్కర్ స్కామ్ లో డబ్బులు కొట్టేశాడు. అప్పుడు కూడా విజయసాయిరెడ్డి మాటను జగన్ వినలేదు. అప్పటివరకు కుటుంబసభ్యుడిలా ఫీలైన విజయసాయిరెడ్డిని.. మన కుటుంబం కాదు దూరం పెట్టాలని.. ఎప్పటికైనా బిజెపితో కలిసి మనకు దెబ్బ కొడతాడని జగన్ కు కోటరీ చెప్పడంతో అదే ఫాలో అయ్యాడు జగన్. దీంతో ఘోర ఓటమి అయ్యాక.. జగన్ పవర్ పోయాక.. ఇక టైమొచ్చిందంటూ విజయసాయిరెడ్డి బయటికొచ్చేశాడు. కాకినాడ సెజ్ కేసులో అడ్డం తిరిగి ఎవిడెన్స్ ఇచ్చేశాడు. వైవీ సుబ్బారెడ్డి కొడుకే కథ నడిపించాడని అక్కడ అర్ధమయ్యేలా చేశాడు. ఇక తర్వాత ప్రెస్ మీట్ లో తాను నోరు విప్పితే ఏమవుతుందో చూసుకోమన్నాడు. లిక్కర్ స్కామ్ అంతా కసిరెడ్డే చేశాడని ఓపెన్ గా చెప్పేశాడు. ఇప్పుడు అదే కేసులో విజయసాయిరెడ్డిని పిలిచారు.. అక్కడ చెప్పే వివరాలతో.. జగన్ పై కేసు తప్పదు.. ఆయన అరెస్ట్ కూడా తప్పదంటున్నారు.
బిజెపితో ఉన్న సంబంధాలతో విజయసాయిరెడ్డి ఇప్పుడు వారి గైడెన్స్ లోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన కుమార్తె బిజెపిలో అధికారికంగా చేరడం ఖాయమంటున్నారు. మరోవైపు ఏ కేసులోనూ ఆయనను టచ్ చేయకుండా ఏపీ ప్రభుత్వానికి కూడా డైరెక్షన్ ఇచ్చేశారంట. ఇక జగన్ కు ది ఎండ్ చెప్పడానికి వాడే తురుపుముక్క విజయసాయిరెడ్డే అని ఇప్పుడు అందరికీ అర్ధమైపోతుంది. ఒకప్పుడు ప్రతి అడుగులోనూ జగన్ కు గైడెన్స్ ఇచ్చిన విజయసాయిరెడ్డి… స్పీకర్ కో ఎంపీ లేఖ కావాలంటే ఎక్కడో ఈశాన్యరాష్ట్రంలోని ఎంపీ లేఖ పట్టుకురావడం… ఎన్నికల కమిషనర్ కావాలంటే ఎక్కడో తమిళనాడులోని ఆఫీసర్ ను తీసుకురావడం.. మూడు రాజధానుల కోసం రిపోర్ట్ కోసం ఏదో సంస్థను ముందుకు తేవడం.. ఇలా ఏం కావాలన్నా.. ఏం తేవాలన్నా .. కొండ మీద కోతిని అయినా విజయసాయిరెడ్డి తీసుకొచ్చాడు. అయినా తన ఏ2ను వదులుకుని జగన్ పెద్ద తప్పిదమే చేశాడని చెప్పాలి. ఒకప్పుడు జగన్ కోటరీ ఆయనొక్కడే.. కాని ఇప్పుడు ఆయనను తోసేసి వచ్చిన కోటరీ మీద పగబట్టాడు విజయసాయిరెడ్డి. ఆ కోటరీకి లీడర్ గా వ్యవహరించిన భారతి మీద కూడా మండిపడుతున్నాడు. వాళ్ల మాట విన్నందుకు జగన్ కూడా మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటున్నాడు. ఏం జరుగుతుందో ఇక తెరపై చూడాలి మనం.