టాటా భుజం మీద చెయ్యి వేసేంత క్లోజ్‌ ఫ్రెండ్‌ అసలు ఎవరీ శాంతను నాయుడు

ఇంట్లో వాడుకునే గుండుపిన్ను దగ్గర్నించి ఆకాశంలో ఎగిరే విమానం వరకూ.. అన్ని వ్యాపారాల్లో అందె వేసిన చేయి రతన్‌ టాటాది. ఆయన మరణం నిజంగా ఈ దేశానికి ఓ తీరని లోటు. అలాంటి మహనీయుడు ఇక లేరనే వార్తను ఈ దేశం జీర్ణించుకోలేకపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 12, 2024 | 12:35 PMLast Updated on: Oct 12, 2024 | 12:35 PM

Who Is Tatas Close Friend Shantanu Naidu

ఇంట్లో వాడుకునే గుండుపిన్ను దగ్గర్నించి ఆకాశంలో ఎగిరే విమానం వరకూ.. అన్ని వ్యాపారాల్లో అందె వేసిన చేయి రతన్‌ టాటాది. ఆయన మరణం నిజంగా ఈ దేశానికి ఓ తీరని లోటు. అలాంటి మహనీయుడు ఇక లేరనే వార్తను ఈ దేశం జీర్ణించుకోలేకపోయింది. ముఖ్యంగా ఆయన అంతిమయాత్రలో టాటా క్లోజ్‌ఫ్రెండ్‌, యంగెస్ట్‌ ఫ్రెండ్‌ని చూసి ప్రతీ ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 30 ఏళ్ల శాంతను నాయుడు రతన్‌ టాటాకు చాలా క్లోజ్‌ ఫ్రెండ్‌. వాళ్లిద్దరూ ఒకరి భుజం మీద ఒకరు చేయి వేసుకుని దిగన ఫొటోలు చూస్తే చాలు వాళ్ల మధ్య ఉన్న అనుబంధం ఏంటో తెలిసిపోతుంది. వయసులో చాలా చిన్నవాడు అయినప్పటికీ శంతను నాయుడిని తన క్లోజ్‌ఫ్రెండ్‌గా స్వీకరించారు రతన్‌ టాటా. టాటా సన్స్ ఛైర్మన్ బాధ్యతల నుండి తప్పుకున్నాక రతన్ టాటా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు ప్లాన్ చేసుకున్నారు.

అతడికి పెళ్లి కాలేదు… కాబట్టి పిల్లాపాపలు లేరు. ఈ క్రమంలోనే తన జంతుప్రేమ, మానవత్వంతో ఓ యువకుడు ఎంతగానో టాటాను ఆకట్టుకున్నాడు. దీంతో ఆ యువకున్ని వృద్దాప్యంలో తనకు సహాయకుడిగా నియమించుకున్నారు రతన్ టాటా. అతడే శంతను నాయుడు. మహారాష్ట్రలోని పూణే నగరంలో నివాసముండే తెలుగు కుటుంబంలో 1993 లో శంతను నాయుడు జన్మించాడు. అతడి తండ్రి టాటా మోటార్స్‌లో పనిచేసాడు. పూణేలోని సావిత్రబాయి పూలే యూనివర్సిటీలో శాంతను ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. కార్నెల్ జాన్సన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ నుండి ఎంబిఏ పూర్తిచేసాడు. ఆ తర్వాత టాటా సంస్థలో ఉద్యోగంలో చేరాడు. టాటా ఎల్క్సీ లో ఆటోమొబైల్ డిజైన్ ఇంజనీర్‌గా పనిచేసాడు. రతన్ టాటా మంచి జంతు ప్రేమికుడు. ఇదే ఆయన శంతను నాయుడును దగ్గరకు తీయడానికి కారణమయ్యింది. ఎంబీఏ పూర్తయిన తర్వాత టాటా సంస్థలో ఉద్యోగం చేస్తూనే జంతువులపై ప్రేమను చాటుకుంటూ ‘మోటో పా’ పేరుతో ఓ స్టార్టప్ ప్రారంభించాడు శాంతను. ఏ దిక్కు లేకుండా రోడ్లపై తిరిగే వీధికుక్కలను రక్షించడానికి ఈ ప్రాజెక్ట్ ను చేపట్టాడు.

వాహనాల కిందపడి రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా కుక్కలను కాపాడేందుకు సరికొత్త ప్రయత్నం చేసాడు. ఇలా శంతను ఏ స్వార్థం లేకుండా చేస్తున్న జంతుసేవ స్వతహాగా జంతు ప్రేమికుడైన రతన్ టాటాకు ఎంతగానో నచ్చింది. దీంతో శంతను స్టార్టప్ సంస్థలో ఆయన పెట్టుబడి పెట్టారు. తన హోదాను సైతం పక్కనబెట్టి శంతనుతో స్నేహం చేసారు. చిన్న వయసులోనే సాటి ప్రాణులపై ప్రేమను ప్రదర్శించడంతో పాటు ఇలాగే వృద్దులకు సాయం చేసేందుకు కూడా ఓ సంస్థను స్థాపించాలన్న ఆలోచనను కూడా రతన్ టాటాతో పంచుకున్నాడు శాంతను. ఇలా ఎంతో ఉన్నత ఆలోచనలు కలిగిన ఆ యువకుడితో రతన్ టాటా స్నేహం చేసారు. స్నేహానికి వయసుతో సంబంధం లేదు… మంచి మనసుంటే చాలని రతన్ టాటా, శంతను నాయుడు నిరూపించారు. కాలేజీ కుర్రాళ్లలా ఈ ఇద్దరూ ఎక్కడికి వెళ్లినా కలిసి వుండేవారు. ఇలా శంతనుతో స్నేహం బాగా నచ్చడంతో 2018 లో మేనేజర్‌గా నియమించుకున్నారు రతన్ టాటా. అప్పటినుండి వ్యక్తిగత సహాయకుడిగా, ఓ స్నేహితుడిగా రతన్ టాటా వెన్నంటివుండి సహాయం చేసేవాడు శంతను. వేలకోట్ల ఆస్తులు కలిగిన అపర కుభేరుడు రతన్ టాటా లాంటివారే వృద్దాప్యంలో ఇబ్బందిపడటం కళ్లారా చూసి చలించాడో.. లేక మరేదైనా కారణముందో తెలీదుగానీ ‘గుడ్ ఫెలోస్’ పేరిట మరో స్టార్టప్ ప్రారంభించాడు శంతను నాయుడు. దీని ద్వారా సీనియర్ సిటిజన్స్‌కు సహాయ సహకారాలు అందించేవాడు. మంచి మనసుతో స్థాపించిన ఈ స్టార్టప్‌లో కూడా రతన్ టాటా పెట్టుబడులు పెట్టారు. ఇలా జంతు ప్రేమికుడిగానే కాదు సాటి మనుషులపై ప్రేమను చాటుకున్నాడు శంతను. కేవలం 30 ఏళ్ల కుర్రాడు ఇంత ఉన్నత భావాలు కలిగివుండటం ఒక్క రతన్ టాటాకే కాదు ఎంతో మందిని ఆకట్టుకుంది. అందువల్లే శంతను స్థాపించిన గుడ్ ఫెలోస్ స్టార్టప్ 5 కోట్ల విలువ సాధించింది.