INDIA: ఇండియా.. మీ నాయకుడు ఎవరు..?

ఎన్డీయేకు నాయకుడు ప్రధాని నరేంద్రమోదీ. అందులో ఏం అనుమానం లేదు. మిగిలిన వారంతా తెరవెనుక తంత్రం నడిపే సేనానులే. కానీ మరి ఇండియా కూటమికి నాయకుడు ఎవరు..? మోదీని ఢీకొట్టే ఫేస్ ఏది..? ఆ కూటమి మనుగడనే ప్రశ్నించే అతి పెద్ద ప్రశ్న ఇది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 19, 2023 | 09:51 AMLast Updated on: Jul 19, 2023 | 9:51 AM

Who Is The Leader Of India Will Face Modi In Upcoming Elections

INDIA: ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. 2024 కురుక్షేత్ర సంగ్రామానికి శంఖం పూరించాయి. ప్రతిపక్ష నేతలంతా కలిసి INDIA పేరుతో ఘనంగా కూటమిని ప్రకటించారు. కాసుకో మోదీ అంటూ సవాల్ విసిరారు. విపక్షాల చేతులు కలిశాయి.. మరి మనసులు కలుస్తాయా..? ఇంతకీ.. కూటమికి నాయకత్వం వహించేది ఎవరు..?
ఇండియా నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ పేరు కాస్త పెద్దదిగానే ఉంది. అందుకే సింపుల్‌గా ఇండియా అని చెప్పుకుంటున్నారు. ఇండియా అన్న పేరు కోసం నానా కష్టాలు పడ్డట్లున్నారు. సరే పేరు ఎలా ఉంటే ఏంటి అనుకోవచ్చు కానీ.. పేరు మార్చేస్తే అంతా మారిపోతుందా అన్నదే పెద్ద ప్రశ్న. యూపీఏ నుంచి ఇండియాగా మారడం బాగానే ఉంది. కానీ ఆ మార్పు పార్టీల్లో వచ్చిందా అన్నది మరో ప్రశ్న. బీజేపీతో పోరాటం సంగతి తర్వాత.. ముందు తమలో తాము పోట్లాడుకోకుండా ముందుకెళ్లగలవా అన్నది కూడా ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నే.
యుద్ధం చేయాలంటే నాయకుడు ఉండాలి. ఏక నాయకత్వంలోనే ముందుకెళ్లాలి. లేకపోతే ఎవరిష్టం వచ్చినట్లు వారు చేస్తారు. ఎన్డీయేకు నాయకుడు ప్రధాని నరేంద్రమోదీ. అందులో ఏం అనుమానం లేదు. మిగిలిన వారంతా తెరవెనుక తంత్రం నడిపే సేనానులే. కానీ మరి ఇండియా కూటమికి నాయకుడు ఎవరు..? మోదీని ఢీకొట్టే ఫేస్ ఏది..? ఆ కూటమి మనుగడనే ప్రశ్నించే అతి పెద్ద ప్రశ్న ఇది. ఇంకా చెప్పాలంటే కూటమిలోని నేతల మనసులను తొలుస్తున్న ప్రశ్న కూడా. బీజేపీని ఓడించాలన్న కసితో చేతులు కలపడం బాగానే ఉంది కానీ అది తమను ఎక్కడ ముంచేస్తుందో అన్న భయం కూడా పార్టీల్లో ఉంది. వేరెవరినో నాయకుడిగా ఎన్నుకుని తమ తమ రాష్ట్రాల్లో దెబ్బతింటామేమో అన్న సందేహం కూడా ఉంది. శత్రువుకు శత్రువు మిత్రుడే కానీ ఆ మిత్రుడు కూడా మన శత్రువే కదా..!
గెలిస్తే ప్రధాని అయ్యేది ఎవరు..? అన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్‌కు పెద్దన్న పాత్ర కట్టబెడతాయా..? పోనీ పెద్దవాడు కాబట్టి శరద్ పవార్‌ను తమ నేతగా ఎన్నుకుంటాయా..? ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీకి బాధ్యతలు అప్పగిస్తారా..? వేగంగా ఎదుగుతున్న ఆప్‌కు అవకాశం ఇస్తారా..? ఇప్పుడే ఈ గొడవంతా ఎందుకులే అని సోనియాకు కూటమి బాధ్యతలు అప్పగించి ఎన్నికలయ్యాక చూసుకుందాం అంటారా..? ఎన్సీపీ, తృణముల్ కాంగ్రెస్ వంటివి కాంగ్రెస్ నుంచి విడిపోయిన పార్టీలే కదా. మరి ఆ పార్టీలు మళ్లీ కాంగ్రెస్ నేతృత్వంలోనే ముందుకెళతాయా..? పోనీ ఒంటరిగా మోదీని ఓడించలేమనే భావనతో అన్యమనస్కంగానే అంగీకరించినా రేపు సీట్ల షేరింగ్ సంగతేంటి..?
సోనియాకు ఆరోగ్యం బాగోలేదు. కాబట్టి కూటమి బాధ్యతలు తీసుకుంటారా అంటే డౌటే. పోనీ శరద్ పవార్‌కు అప్పగిద్దామా అంటే అసలు ఆయనకే పార్టీ ఉందో లేదో తెలియడం లేదు. ఇంటిపోరు మరాఠా వీరుడిని మదనపెడుతోంది. పోనీ ఆప్ అంటే జాతీయ హోదా వచ్చింది కానీ పార్టీల్లో మాత్రం దానికి ఇంకా ఆమోదం రాలేదు. కమ్యూనిస్టులకు ఆ సత్తా లేదని తేలిపోయింది. మమత సంగతి చెప్పాల్సిన పనిలేదు. బెంగాల్‌లో బీజేపీని ఎదుర్కోవడానికే సమయం సరిపోవడం లేదు. పైగా ఆమెకు దక్షిణాదిలో అంత ఆమోదం లేదు. మొత్తానికి ఎటు చూసినా పెద్దన్న పాత్ర పోషించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై కనిపిస్తోంది. కానీ అందుకు పార్టీలు మనస్పూర్తిగా అంగీకరించలేని పరిస్థితి కూడా కూటమిలో ఉంది. ఇప్పుడు కూటమి నాయకత్వాన్ని తేల్చడమే అతి పెద్ద ప్రశ్న. కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి దానివైపు మొగ్గు ఉంటుంది. అయితే హస్తానికే ఆ క్రెడిట్ దక్కడం మిగిలిన పార్టీలకు అంతగా ఇష్టం లేదు. ఆర్జేడీ పెట్టిన ఓ ట్వీట్ కూటమి కుదురుకోకముందే కూల్చేలా కనిపించింది. నితీశ్‌కుమారే కూటమి నాయకుడు అనేలా ఓ ఫోటోను ట్వీట్ చేసింది. రాహుల్‌గాంధీని మిగిలిన నేతల్లో కలిపేసింది. మళ్లీ ఏమనుకుందో వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించింది. కానీ అప్పటికే అది వైరల్ అయిపోయింది. ఏం చేయాలనేది ముంబైలో నిర్ణయిస్తామని కూటమి చెబుతోంది. ప్రస్తుతానికి పార్టీలన్నీ ఏం జరుగుతుందో చూద్దామనే వైఖరిలో ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత ఓ క్లారిటీ వస్తుంది. కాబట్టి ఏం చేయాలో అప్పుడే నిర్ణయించుకుందాం అనుకుంటున్నాయి. అప్పటి పరిస్థితిని బట్టి కూటమిలో కొనసాగడమో లేక తప్పుకోవడమో చేయనున్నాయి. మొత్తంగా చూస్తే ఎన్నికల నాటికి కూటమిలో ఎన్ని పార్టీలుంటాయో ఇప్పుడే చెప్పడం కష్టం.