Vizag Steel Plant: అన్నీ డ్రామా పార్టీలే..! స్టీల్ ప్లాంట్ విషయంలో పక్కా మోసం..!!
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవాల్సిన పార్టీలు ఆ సంగతి మర్చిపోయాయి. దీన్ని తమ రాజకీయ మనుగడకు ఎలా వాడుకోవాలో అని మాత్రమే ఆలోచిస్తున్నాయి. ఏపీలోని అధికార వైసీపీతోపాటు, ప్రతిపక్ష టీడీపీ కూడా ఈ విషయంలో చప్పుడు చేయడం లేదు.
Vizag Steel Plant: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు రాజకీయాలకు వేదికవుతోంది. ఏపీకే కాదు.. దేశానికే గర్వ కారణంగా నిలిచిన పరిశ్రమల్లో ఒకటైన విశాఖ స్టీల్‌ను ప్రైవేటు పరం చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన దీనికి కారణం. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవాల్సిన పార్టీలు ఆ సంగతి మర్చిపోయాయి. దీన్ని తమ రాజకీయ మనుగడకు ఎలా వాడుకోవాలో అని మాత్రమే ఆలోచిస్తున్నాయి. ఏపీలోని అధికార వైసీపీతోపాటు, ప్రతిపక్ష టీడీపీ కూడా ఈ విషయంలో చప్పుడు చేయడం లేదు. రాష్ట్రంలో ఉనికే లేని బీజేపీ, ఆ పార్టీకి మిత్రపక్షంగా చెప్పుకొనే జనసేన కూడా తమకేం పట్టనట్లే ఉంటున్నాయి. సందట్లో సడేమియా అన్నట్లు మధ్యలో కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీ మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తామే ఉద్ధరించబోతున్నట్లు బిల్డప్ ఇచ్చింది. తర్వాత అదంతా ఉత్తిదే అని తేలింది. దీంతో అన్ని పార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడే విషయంలో చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. మరైతే దీన్ని కాపాడేదెవరు? పార్టీలెందుకు ఈ విషయంలో సైలెన్స్‌గా ఉంటున్నాయి? విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రక్షించి, ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేదెవరు?
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు
ఐదు దశాబ్దాల క్రితం విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మొదలైంది విశాఖ స్టీల్ ప్లాంట్. ఇది ప్రభుత్వ రంగ సంస్థ. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు రాష్ట్రానికి బోలెడంత ఆదాయాన్ని సమకూర్చిపెట్టేది. ఇక్కడ తయారైన ఉక్కు అమెరికా, జపాన్, దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎగుమతి అవుతుంది. ఇంత ఘనమైన చరిత్ర కలిగిన విశాఖ ఉక్కును ప్రైవేటు సంస్థకు అమ్మేయాలని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. కంపెనీ నష్టాల్లో ఉందని, వాటిని కేంద్రం భరించలేదని, అందువల్ల స్టీల్ ప్లాంట్ అమ్మడం ఒక్కటే పరిష్కారమని కేంద్రం చెబుతోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇటు పార్టీలు, ప్రజలు, అటు కార్మికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నా కేంద్రం వెనక్కు తగ్గే సూచనలు కనిపించడం లేదు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ నిజంగానే ప్రైవేటు పరం అవుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఏపీలోని ఏ పార్టీ కూడా దీనికి వ్యతిరేకంగా ఉద్యమించడం లేదు.
ఏపీలోని పార్టీలకు ఏమైంది?
నిజానికి ప్రజలకు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే పార్టీలు స్పందిస్తుంటాయి. వీటిపై ఉద్యమాలు చేయడం ద్వారా లబ్ధి కలుగుతుందంటే దాన్ని వాడుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. కానీ, ఏపీలోని పార్టీలు దీనికి భిన్నం. అన్ని పార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా నోరెత్తేందుకు భయపడుతున్నాయి. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే తూతూ మంత్రంగా విమర్శలు, ప్రతి విమర్శలు, ప్రకటనలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్నాయి. అంతేకానీ.. అవసరమైన స్థాయిలో ప్రజా ఉద్యమాన్ని లేవనెత్తేందుకు ఏ పార్టీ ముందుకు రావడం లేదు. ఒక పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఉద్యమాలు చేస్తున్నా.. వాళ్లకు ఏ పార్టీ మద్దతు తెలపడం లేదు.
వైసీపీ అధికారంలో ఉండి ఏం లాభం?
ఏపీకి అన్యాయం జరుగుతుంటే ముందుగా స్పందించాల్సింది అధికార పార్టీయే. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ముందుకు రావాలి. కానీ, స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ వైఖరి దీనికి భిన్నంగా ఉంది. ఏపీకి గర్వకారణమైన స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే వైసీపీ ఏం చేస్తున్నట్లు? కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? ఏపీలో వైసీపీ అధికారంలో ఉండి ఏం ప్రయోజనం? దీనికి వైసీపీ నేతల వద్ద సమాధానమే లేదు. ఎందుకంటే ఆ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలకంటే సొంత ప్రయోజనాలే ముఖ్యం. అసలు వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రం నుంచి ఏపీకి పెద్దగా ఏం ఒరిగింది? ప్రత్యేక హోదాపై గతంలో ఉద్యమాలు చేసి, అధికారంలోకి రాగానే ఆ విషయమే మర్చిపోయింది.
ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి కూడా ఆ పార్టీ కేంద్రాన్ని అడగదు. అంత సాహసం కూడా చేయదు. ప్రతిపక్షాలపై విమర్శలు చేసేందుకే ప్రాధాన్యమిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దక్కించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రకటించినప్పటికీ, చేతల్లో మాత్రం అది కనపడదు. ఇలాంటి అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తే పార్టీ నేతలపై, తమ ప్రభుత్వంపై కేంద్రం వైఖరి ఎలా ఉంటుందో అని ఆ పార్టీ భయం. లోపాయికారిగా ఈ విషయంలో కేంద్రానికి సహకరిస్తుందా అనిపించకమానదు వైసీపీ వైఖరి చూస్తుంటే. విశాఖ స్టీల్ ప్లాంట్ కనుక అమ్ముడైతే.. అధికారంలో ఉండి కూడా కంపెనీని దక్కించుకోలేకపోయిన పార్టీగా వైసీపీ నిలుస్తుంది. అది ఆ పార్టీకి మాయని మచ్చగా ఉంటుంది.
టీడీపీకేమైంది?
వైసీపీకి బీజేపీతో చాలా పనులున్నాయి. కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్లే సాహసం సీఎం జగన్ చేయలేరు. మరి ప్రతిపక్ష టీడీపీకి ఏమైంది? విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఉద్యమించొచ్చు కదా. కానీ, టీడీపీ కూడా దీనిపై నోరెత్తదు. అధికార వైసీపీని నిందిస్తూ కాలం గడిపేస్తుంది. మోదీకి వ్యతిరేకంగా టీడీపీ కూడా మాట్లాడలేకపోతుంది. దీంతో స్టీల్ ప్లాంట్ అంశంలో టీడీపీ చేతకానితనం కనిపిస్తుంది. ఏపీకి మళ్లీ సీఎం కావాలని భావిస్తున్న చంద్రబాబు నాయుడు ఈ విషయంలో రాష్ట్ర ప్రజల తరఫున మాట్లాడకపోవడం ఆశ్చర్యకరం.
జనసేనదీ అదే దారి
బీజేపీకి మిత్రపక్షంగా ఉండటం వల్లో ఏమో జనసేన పార్టీ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తప్పుబట్టలేకపోతుంది. ఏపీలో అధికారం కావాలని ఆశిస్తున్న పవన్ ఈ విషయాన్ని రాజకీయంగానైనా వాడుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే స్థానిక ప్రజల మద్దతు మరింత పెరుగుతుంది. కానీ, జనసేన కూడా తూతూ మంత్రంగా ప్రకటనలకే పరిమితమైంది. కేంద్రంపై తిరుగుబాటు చేయలేకపోతోంది. కనీసం జనసేన అయినా పోరాటం చేయాల్సింది. ఇక రాష్ట్ర బీజేపీ సంగతి సరేసరి. కేంద్రం చేస్తున్న చర్యను సమర్ధించుకోలేక, ఇటు వ్యతిరేకించలేక బీజేపీ నేతలు తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోతున్నారు. కమ్యూనిస్టులు మాత్రం పోరాటాలు చేస్తున్నా, ప్రభావం కనిపించడం లేదు.
బీఆర్ఎస్ ప్లాన్ ఫ్లాప్
ఏపీలోని పార్టీలు విఫలమవుతుంటే తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తాము కొనబోతున్నట్లు ప్రచారం చేసుకుంది. ఇందుకోసం తెలంగాణ నుంచి సింగరేణి కాలరీస్ తరఫున బిడ్ వేయబోతున్నట్లు చెప్పుకొంది. అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి అనేక సాంకేతిక అంశాల్ని పరిశీలించాలి. అదేమీ లేకుండానే స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొంటున్నట్లు చెప్పుకొంది. దీని ద్వారా ఏపీ ప్రజలకు బీఆర్ఎస్ దగ్గరవ్వొచ్చన్నది కేసీఆర్ ప్లాన్. అయితే, బిడ్డింగ్‌లో పాల్గొనడం అంత తేలికకాదు అనే విషయం నెమ్మదిగా అర్థమైంది. దీంతో బీఆర్ఎస్ ప్రయత్నం బెడిసికొట్టినట్లైంది. బీఆర్ఎస్ బిడ్డింగ్ గురించి ప్రకటన చేసిన రోజునే ప్రైవేటీకరణ విషయంలో ముందుకెళ్లడం లేదని కేంద్ర మంత్రి ప్రకటించారు. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బ్రేక్ పడిందని అందరూ భావించారు. ఇక.. ఈ క్రెడిట్ తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. తమ వల్లే కేంద్రం వెనకడుగు వేసిందని బీఆర్ఎస్ చెప్పుకొచ్చింది. కానీ, తర్వాత కేంద్రం తన మాట మార్చింది. దీంతో మరోసారి బీఆర్ఎస్ వైఖరి నవ్వులపాలైంది.
ఇక దిక్కెవరు?
నిజంగా స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని పార్టీలు కలిసి ఉద్యమిస్తే కేంద్రం వెనకడుగు వేయక తప్పదు. కానీ, ఏ ఒక్క పార్టీ ఈ విషయంలో ముందుకు రావడం లేదు. అసలు ఈ విషయంలో కేంద్రాన్ని అడ్డుకునే ఉద్దేశమే పార్టీలకు లేనట్లుంది. కనీసం ప్రతిపక్షాలైనా స్పందించి పోరాడాల్సింది. రాష్ట్రంలో సరైన పోరాటాలు జరగకుంటే కేంద్ర నిర్ణయమే చెల్లుబాటవుతుంది. అన్ని పార్టీలూ ప్రజల ముందు డ్రామాలాడుతూ, రాజకీయ ప్రయోజనం పొందేందుకు మాత్రం దీన్ని వాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కార్మికుల గోడు వినేవాళ్లెవరూ లేరు. కేంద్రంతో లోపాయికారీ ప్రయోజనాలు తప్ప ప్రజల బాగోగులు పట్టని ఏపీలోని పార్టీల వైఖరికి ఇదో నిదర్శనం. పార్టీలంతా ఒకవైపు.. ప్రజలంతా మరోవైపు ఉన్నట్లు అయిపోయింది ఈ విషయంలో.